Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, జులై 17, 2026

వాన శబ్దం ‌‌(అరుణ నారదబట్ల)


వాన శబ్దం

============ 

 అరుణ నారదభట్ల


తాపం భరించలేని ఆకాశం 

కోపంతో ఊగిపోయింది

పిట్టలు మాడినట్టు 

మబ్బులు అలిగి గుమిగూడి

నల్లముఖాలై భయకంపితం! 


ఘొల్లుమని నేలన పడి 

మట్టిగుండెను హత్తుకుని

బొబ్బలెక్కిన దేహానికి 

లేపనాల్ని రుద్దుకుంటున్నాయ్ చెట్లతో! 


చెవుల్లో అల్లరి హోరు

ఒక్క సారిగా దిగిన బంధువుల్లా

ఝల్లుమని చినుకులు

రివ్వుమంటూ ఈదురుగాలి


అంతా హడావిడి

ఆవిరి పాట

పొగలు గక్కుతున్న ఇళ్ళ దేహాలన్నీ 

చీకటి వేషం కట్టిన వైనం!  

డామ్ ఢామని పేలుతున్న  ట్రాన్స్ఫార్మర్ల విఘాత దాడికి

మౌనాన్ని  తొడుక్కున్న ప్రపంచం


విరుగుతున్న చెట్లకొమ్మలు

రాలి పరుగులు తీస్తున్న పండు ఎండు టాకులు

భూమిని ముద్దాడే పందెంలో  పాచికలాటల గవ్వలశబ్దం!


తునాతునకలవకున్నా

పగిలిపగిలి చెర్రలు విడి అతుక్కుంటున్న గగనం 

చీకటిముంత నుండి ఒలకబోసే వెలుగు వేర్ల పుంతల్తో 


ఇవాళ భూమికి స్నేహిత తిరిగొచ్చింది

ఎన్నెన్ని వాడిన హృదయాలను

సాంత్వనపరిచిందో... 

వాన చినుకులు కౌగిలింతలై!!




"వాన శబ్దం" కవి: అరుణ నారదభట్ల

 కవితా విశ్లేషణ :  నవీన్​

"వాన శబ్దం" కవితలో ప్రకృతి వైభవాన్ని, వర్షం రాకతో ఏర్పడే భావోద్వేగాలను కవయిత్రి అత్యంత సజీవంగా ఆవిష్కరించారు. మండే ఎండను తట్టుకోలేక ఆకాశమే కోపగించి వానగా కురిసినట్లు తొలి పాదాల్లో అద్భుతమైన ఊహను వ్యక్తం చేశారు.

మట్టిని హత్తుకునే వాన చినుకులు, బొబ్బలెక్కిన భూమికి చెట్లు లేపనం రాస్తున్నట్లుగా చెప్పిన రూపకం ఎంతో హృద్యంగా నిలుస్తుంది. ఒక్కసారిగా వచ్చిన చినుకులు, ఈదురుగాలి, ఇళ్లపై పడే వర్షం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలే శబ్దాలు—ఇవన్నీ కలిసి వర్షకాలపు వాతావరణాన్ని పాఠకుడి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి.

విరిగే చెట్ల కొమ్మలు, రాలే ఆకులు, మెరుపులతో చీలిపోయిన ఆకాశం వంటి దృశ్యాల ద్వారా వానలోని ఉగ్రరూపాన్ని కూడా కవయిత్రి సమతుల్యంగా చిత్రించారు.

కవిత చివర్లో మాత్రం భావం పూర్తిగా మారుతుంది. "భూమికి స్నేహిత తిరిగొచ్చింది" అనే ఒక్క వాక్యంతో వానను జీవానికి ఊపిరినిచ్చే మిత్రురాలిగా ఆవిష్కరించారు. "వాన చినుకులు కౌగిలింతలై" అనే ముగింపు కవితకు ఆత్మగా నిలుస్తుంది. వాడిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చే ప్రేమస్పర్శగా వర్షాన్ని ప్రతీకాత్మకంగా చూపించారు.

ఈ కవితలో రూపకాలు, ధ్వన్యనుకరణలు, దృశ్యవర్ణనలు, భావోద్వేగాల సమ్మేళనం పాఠకుడిని వర్షపు అనుభూతిలో ముంచెత్తుతుంది. ప్రకృతిని మానవ భావాలతో మేళవించి రాసిన ఈ కవిత ఆధునిక తెలుగు వచన కవిత్వానికి ఒక చక్కని ఉదాహరణ.


శంకరవాణి

 

మనసే నిజమైన పుణ్యక్షేత్రం

(గంగా రాధాకిషన్​)

మనసు నిండా రాక్షస భావాలు, ఈర్ష్య, అసూయ, కుళ్లు బుద్ధులు నింపుకొని, ఆ పశుత్వాన్ని అరికట్టుకోకుండా ఎన్ని పుణ్యక్షేత్రాల యాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో పుష్కర స్నానాలు చేసినా, ఎన్ని పారాయణాలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు, ధార్మిక కర్మలు చేసినా అవన్నీ వ్యర్థమే అని మన పురాణాలు, ఆధ్యాత్మిక బోధనలు చెబుతున్నాయి.

స్వామి వివేకానందుల బోధనలోని ఒక చక్కని భావం ఏమిటంటే—దేవాలయాలకు వెళ్లడం మాత్రమే పుణ్యమైతే, ఒక పక్షి ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశ విదేశాల్లోని ఎన్నో దేవాలయాల శిఖరాలపై వాలుతుంది కదా! దానికి జ్ఞానం లేదా పుణ్యం లభించిందా?

అలాగే భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు వంటి పవిత్ర గ్రంథాలను బీరువాలు, ర్యాక్‌లు నిరంతరం మోస్తూనే ఉంటాయి. మరి వాటికి జ్ఞానం కలిగిందా? మోక్షం లభించిందా?

అందుకే మనం ఎక్కడికి వెళ్లాం అన్నది ముఖ్యం కాదు. మన మనసును ఎంత నిర్మలంగా ఉంచుకున్నాం? మనలోని పశుత్వాన్ని ఎంతవరకు అరికట్టుకున్నాం? స్వార్థాన్ని ఎంతవరకు త్యజించాం? ప్రేమతత్వాన్ని ఎంతగా పెంచుకున్నాం? అన్నదే అసలైన విషయం.

అప్పుడు మన హృదయమే మనకు కాశీ, అమర్‌నాథ్, మానస సరోవరం. సమస్త పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు మనలోనే ఉన్నాయని తెలుసుకుంటాం.

ఓ మానవా! నీవే భగవంతుని ప్రతిరూపం. అందుకే మన పెద్దలు “దైవం మానుష రూపేణ” అన్నారు. భగవంతుని మనలోనే దర్శించుకోవడానికి ఆత్మపరిశీలన, సాధన అవసరం. అప్పుడే మనసుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం, జీవితానికి సార్థకత చేకూరుతాయి.

హృదయంలో తలచుకున్నదే నోటితో చెప్పాలి. నోటితో చెప్పినదే ఆచరణలో చూపించాలి. మాట, మనసు, చేతల మధ్య ఏకత్వం ఉండటమే నిజమైన మానవతా విలువ.

ఆహార నియమాలు పాటించండి. శారీరక వ్యాయామం చేయండి. అనుభవజ్ఞుల మాటలు వినండి. సత్సంగంలో పాల్గొనండి. నామస్మరణ చేయండి, చేయించండి. సేవ చేస్తూ శారీరక, మానసిక ఆనందాన్ని పొందండి.

ఇంతకంటే గొప్ప సాధన మనిషి జీవితంలో మరొకటి లేదు.

🙏 శంకరవాణి — సంపూర్ణ యదార్థవాది
సాయిరామ్


చేసిన పుణ్యమే శాశ్వతం

(గంగా రాధాకిషన్​)

"ఇల్లు మిగలదు… ఇల్లాలు మిగలదు… నాదనుకున్నది ఏదీ మిగలదు… చివరకు మిగిలేది చేసిన పుణ్యం. అది చేయగలిగినా బ్రతుకే ధన్యం."

ఈ భావం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన గీతంలోని చిరస్మరణీయమైన సందేశం.

ఈ భూమిపై మనమందరం అతిథులమే. ఇది ఒక సత్రం వంటిది. మనకంటే ముందు పండితులు, పామరులు, అధికారులు, అనధికారులు, ఆస్తికులు, నాస్తికులు, ధనవంతులు, పేదవారు, మహామేధావులు… ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపోయారు. ఒకరోజు మనం కూడా ఈ ప్రయాణాన్ని ముగించాల్సిందే. అయితే ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.

అయినా మనం శాశ్వతంగా ఇక్కడే ఉంటామని భావించడం మానవ మోహం. కానీ జీవితం యొక్క నిజమైన విలువ ఆస్తులు కూడబెట్టడంలో కాదు; మనం వెళ్లిపోయిన తర్వాత కూడా పదిమంది ప్రేమతో, గౌరవంతో గుర్తుచేసుకునేలా జీవించడంలో ఉంది.

పశుపక్షులకు కూడా ఆకలి, నిద్ర, భయం, సంతానం ఉంటాయి. కానీ మనిషికి వాటికి మించిన గొప్ప వరం వివేకం, దయ, ధర్మం. అందుకే భగవద్గీతలో "జాతస్య హి ధ్రువో మృత్యుః" అని చెప్పబడింది. జన్మించిన ప్రతి ఒక్కరికీ మరణం అనివార్యం. కాబట్టి జీవితం ఉన్నంతకాలం మంచి పనులు చేస్తూ, ఇతరులకు ఉపయోగపడుతూ, ఆత్మసంతృప్తితో జీవించడం మన కర్తవ్యం.

మన వద్ద ఎంత ధనం ఉందన్నది కాదు ముఖ్యం. ఆ ధనాన్ని ఎంతమందికి మేలు చేసేలా వినియోగించామన్నదే అసలు విలువ. నిస్వార్థ సేవ, దానం, ధర్మం, మానవత్వం – ఇవే మనిషిని మహోన్నతుడిగా నిలబెడతాయి. అలాంటి వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

"వస్తా వట్టిదే… పోతా వట్టిదే… ఆశ ఎందుకన్నా… చేసిన ధర్మం చెడని పదార్థం… చేరును నీ వెంట."

మనిషి వెనుక మిగిలేది సంపద కాదు… సత్కార్యాలు. పేరు కాదు… పరులకు చేసిన మేలు. అందుకే ప్రతి రోజూ ఒక మంచి పని చేస్తూ, మానవత్వాన్ని నిలబెడుతూ జీవిద్దాం. అదే జీవితానికి నిజమైన సార్థకత.

– శంకర వాణి
సాయిరామ్ 🙏

============================================================

సంసారం – సుఖమా? దుఃఖమా?

(గంగా రాధాకిషన్​)

అనివార్యంగా అనిపిస్తున్న ఈ సంసారం అనే చక్రంలో నిజంగా శాశ్వతమైన సుఖం, సంతృప్తి, ఆనందం ఉన్నాయా? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, వాటికి స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమే.

దుఃఖాలు వరుసగా వస్తూనే ఉంటాయి. వాటి మధ్యలో కొద్దిసేపు మనకు సుఖం కలిగినట్లు అనిపిస్తుంది. అయితే అది నిజమైన సుఖమా? లేక కేవలం దుఃఖం కొద్దిసేపు లేకపోవడమేనా? అనే సందేహం కలుగుతుంది.

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.

ఒక బలమైన వ్యక్తి భుజంపై బరువైన ధాన్యపు బస్తాను మోసుకుంటూ నడుస్తున్నాడు. కొంతసేపటికి ఒక భుజం నొప్పి పెరగడంతో ఆ బస్తాను మరో భుజంపైకి మార్చుకుంటాడు. అప్పుడు అతనికి కాస్త ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. కానీ ఆ ఉపశమనం శాశ్వతం కాదు. కొంతసేపటికే రెండో భుజం కూడా నొప్పి పెడుతుంది. మళ్లీ మొదటి భుజంపైకి మార్చుకోవాల్సి వస్తుంది.

మన సంసార జీవితం కూడా ఇలాగే ఉండవచ్చేమో! మనం సుఖంగా భావించేది, నిజానికి ఒక బాధ నుండి మరో బాధకు మారే మధ్యలో కలిగే తాత్కాలిక ఉపశమనమే కావచ్చు.

అందుకే ఆచార్యులు ఇలా చెప్పారు:

"సంసారసాగరం దుఃఖం."

అంటే, సంసారం అనేది సముద్రంలా అపారమైన దుఃఖాలతో నిండి ఉందని అర్థం.

మరి ఈ సంసారసాగరాన్ని ఎలా దాటాలి?

భగవంతుని మనసా, వాచా, కర్మణా శరణు వేడుకోవాలి. "ప్రభూ! ఈ సంసారసాగరాన్ని దాటించి, నన్ను ఉద్ధరించు" అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. భక్తి, ధర్మాచరణ, సత్సంగం, ఆత్మవిచారణ అనే మార్గాల్లో నడుస్తూ ఆయన అనుగ్రహాన్ని కోరాలి.

ఇదే మానవ జన్మకు సార్థకమైన మార్గమని నా అభిప్రాయం.

ఓం తత్ సత్.

— శంకర వాణి

సంపూర్ణ యదార్థవాది
సాయిరామ్ 🌹🙏

======================

మిమ్మల్ని మీరు నమ్మండి... 

విజయం మీ వెంట నడుస్తుంది!

కొందరు మీ విజయాన్ని చూసి తట్టుకోలేరు. మీ మంచితనాన్ని అంగీకరించలేరు. మీ కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతుంటే ఓర్వలేరు. మీరు నిస్వార్థంగా చెప్పే మంచి మాటలను, విలువైన సూచనలను అనుసరించి కొందరు జీవితంలో ముందుకు సాగుతూ, కృతజ్ఞతతో మిమ్మల్ని ప్రశంసిస్తుంటే కూడా కొందరికి అది నచ్చదు.

వారికి తెలియని నిజం ఒక్కటే... వారు ఎంత విమర్శించినా, మీ స్థాయిని అందుకోలేరు. విమర్శలు చేసే వారు చాలాసార్లు ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయపడేవారే.

"ఏనుగు ముందుకు సాగుతుంటే కుక్కలు మొరిగినా, ఏనుగు వెనుదిరిగి చూడదు."
అలాగే మనం కూడా ప్రతి విమర్శకు స్పందిస్తూ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు.

మంచిని చెడుగా మాట్లాడేవారి గురించి బాధపడకండి. వారి మాటలు వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి, మీ విలువను కాదు. "కుక్క కరిచిందని మనం తిరిగి కుక్కను కరవము" అన్నట్లుగా, మన స్థాయిని ఎప్పుడూ కాపాడుకోవాలి.

అనవసరంగా కాలహరణం చేసే, ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. సమయం జీవితంలో అత్యంత విలువైన సంపద. దాన్ని మీ లక్ష్యాల కోసం, మీ ఎదుగుదల కోసం వినియోగించండి.

మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సామర్థ్యాన్ని విశ్వసించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దైవ పరీక్షలు ఎదురైనా, మీరు నమ్ముకున్న లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేయండి. ఒకరోజు ప్రపంచమే మీ శక్తిని, మీ విలువను గుర్తిస్తుంది.

మన జీవన విధానం, మన క్రమశిక్షణ, మన శారీరక వ్యాయామమే మనకు దైవ రక్ష.








– శంకర వాణి
సంపూర్ణ యదార్థవాది
సాయిరామ్ 🙏

మంథనికి న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్

 

మంథనికి న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్  

భవన నిర్మాణానికి రూ.20 కోట్లు

మంథని, జూలై 17 (దిక్సూచి): పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు–భవనాల (టీఆర్‌అండ్‌బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మారుతున్న నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్య శిక్షణను యువతకు అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది. ఇక్కడ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులు నిర్వహించబడతాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధితో పాటు దేశీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మంథనికి ఈ ప్రతిష్ఠాత్మక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేటాయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తర తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించే కేంద్రంగా మంథని ఎన్‌ఏసీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం, జులై 16, 2026

యుకె కు ఎగుమతులు పెంచుతాం


యుకె కు ఎగుమతులు పెంచుతాం

ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, హైదరాబాద్​, జూలై 16, 

భారత్- యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) వల్ల తెలంగాణా గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యుకె సుంకాలను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. యుకె డిప్యూటి ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కె అయర్ (Chandru K Iyer) ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. రెండు దేశాల మధ్య రూ.3.25 లక్షల కోట్ల (25 Billion Pounds) వాణిజ్యానికి అవకాశం ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణాలో పారిశ్రామిక వస్తూత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్, చిప్ ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వృద్ధి చేసామని, యుకె పారిశ్రామికవేత్తలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రం నుంచి యుకెకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాల వల్ల ఎగుమతులను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం తెలంగాణాలోనే జరుగుతున్నాయని, వ్యాక్సిన్ ఎగుమతుత్లో 30 శాతం రాష్ట్రానిదేనని శ్రీధర్ బాబు తెలిపారు. విమానయాన రంగానికి అవసరమైన ప్రిసిషన్ విడిభాగాల ఉత్పత్తిలో తెలంగాణా అగ్రస్థానంలో ఉందని గుర్తు చేసారు. ప్రపంచ ప్రఖ్యాత ఏవియేషన్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్, విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీస్, డసో (Dassault) ఏవియేషన్ ఉత్పత్తి చేసే రఫేల్ విమానాల విడిభాగాల తయారీ, ఓవర్ హాలింగ్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, సఫ్రాన్ ఏవియేషన్ సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. హైదరాబాద్ లో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా పలు ప్రఖ్యాత సంస్థలు 450 జిసిసి కేంద్రాలను ఏర్పాటు చేసాయని చెప్పారు. యుకెకు ఎగుమతి చేయగలిగే వస్తువుల తయారీపై స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి సిఇటిఏ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆధిత్యకు శ్రీధర్ బాబు సూచించారు. యుకె నుంచి భారత్ పర్యటించే మేయర్ల బృందాన్ని హైదరాబాద్ ను కూడా సందర్శించేలా చూడాలని చంద్రు కె అయర్ ను మంత్రి కోరారు. అధికారులతో కలిసి యుకెను సందర్శించి అక్కడ పారిశ్రామిక, వాణిజ్య ఎకోసిస్టంను పరిశీలించాలని చంద్రు అయర్ శ్రీధర్ బాబును ఆహ్వానించారు. యుకె ప్రతినిధి బృందంలో సిద్దార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ స్సెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.



ఆషాఢం - నవ దంపతులు

ఆషాఢంలో నవ దంపతులకు ఎడబాటు ఎందుకు !?

 ఆషాడం అంటే అందరికీ ఇష్టమైనా,  కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాఢంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్త గారు ఒకేచోట ఉండకూడదు. ఒకరికి ఒకరు ఎదురు పడకూడదని చెబుతూ ఉంటారు.  అంతేకాకుండా, సాగు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు. కాబట్టి, కొత్త అల్లుడికి మర్యాదల  విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశ్యంతో కూడా ఎడబాటుగా ఉంచుతారు.

 ఆషాఢమాసంలో కొత్త దంపతులు కలిసి ఉండరాదనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు?  దీనివల్ల కలిగే అనర్థం ఏమిటి?  అసలు కలిసి ఉంటే ఏమవుతుంది?  

ఆషాడ మాసం కాదిది, - నవదంపతుల సరస శృంగారాల సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల, విరహాల ఆరూఢమాసం అంటూ ఓ కవి దీనిని వర్ణించాడు.

ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటలకు ఎడబాటు తప్పదు.  అత్తా-అల్లుడు ఎదురు పడకూడదనే ఆచారం ఉంది.  అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలసి ఉండకూడదని అంటారు. దీనివెనుక కూడా ఒక అర్థం ఉంది. 

పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం.  సంపాదన మాట అటుంచి, తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని,  కొత్త వలపు మోజులోపడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టారు.

అంతే కాదు, ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణంవల్ల బ్యాక్టీరియా, వైరస్ లు అంటువ్యాధులుగా బాగా ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్ళికూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డమీద వాటి ప్రభావం ఉంటుంది అనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి.  కావున ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండడమే  క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు.  

ఈ ఆషాఢాన్ని అనారోగ్యమాసంగా పేర్కొంటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. కాలువలలోనూ, నదులలోనూ ప్రవహించే నీరు  అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.  ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులోని పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది.

అలాగే, ఆషాడం తరువాత వచ్చే శ్రావణమాసంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచిరోజులే వుంటాయి. ఆ శుభ ఘడియలలో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు.  ఆషాఢంలో గర్భం దాల్చితే 9 నెలలకు అంటే చైత్రానికి పూర్తవుతుంది. ఆ సమయంలో ఎండకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్డుకోలేరని ఈ నియమం పెట్టారు.  అలాగే ఒక నెల వియోగం తరువాత కలుసుకుంటే, అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు అని కూడా అంటారు. 

పూర్వ కాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది.  కష్టపడి పని చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే, వ్యవసాయ పనులు జరుగవు.  వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడి పోవాల్సిందే.  

అందుకే కొత్త కోడలు  పుట్టింటిలో ఉండాలి. అల్లుడు అత్తారింటివైపు చూడకూడదని నియమం పెట్టారు.

– అవధాని మోహన శర్మ  

తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

 


 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ప్రాజెక్టుల్లో తాగునీటికి అవసరమైన నీటి మట్టాలు తప్పనిసరిగా నిర్వహించాలి

అమృత్ పథకం తాగునీటి పనులను గడువులోగా పూర్తి చేయాలి

వీబీజీఆర్‌ఏఎంజీ పథకంలో వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలి

సూపర్ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి

త్రాగునీరు, సీజనల్ వ్యాధులు, విద్యాశాఖ, సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్

 

దిక్సూచి, పెద్దపల్లి, జూలై-16:

 

తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యాశాఖ, సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వానికి త్రాగునీటి సరఫరా అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ప్రాజెక్టుల్లో తాగునీటికి అవసరమైన నీటి మట్టాలను తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రాంతాల్లో అమృత్ (AMRUT) పథకం కింద చేపట్టిన తాగునీటి సరఫరా పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీబీజీఆర్‌ఏఎంజీ (VBGRAMG) కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి గ్రామంలో పడే ప్రతి నీటి బొట్టును సంరక్షించేలా, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కాలానుగుణ వ్యాధుల నివారణకు స్థానిక సంస్థలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని గ్రామాలు, పట్టణాల్లో డ్రైడే కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రజల్లో "నీటిని నిల్వ ఉంచవద్దు" అనే అంశంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. దోమల నివారణ చర్యలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.

విద్యాశాఖకు సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలలో ఒక జతను ఆగస్టు 15 నాటికి తప్పనిసరిగా పంపిణీ చేసేలా జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధంగా ఉంచి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పవిత్ర, జిల్లా ప్రణాళిక అధికారి జి. రవీందర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

బ్రిడ్జ్ ఫౌండేషన్ తో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి


119 నియోజకవర్గాలకు ప్రత్యేక నాన్‌ప్రాఫిట్ సంస్థలు ఏర్పాటు

ఎంఎల్‌ఏలకు సాంకేతికత, నైపుణ్యం, భాగస్వామ్యాలతో అభివృద్ధికి మరింత బలం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


దిక్సూచి, హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం మరియు EQUIPPP సంస్థ మధ్య రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాన్స్టిట్యూయెన్సీ డెవలప్‌మెంట్ అండ్ సస్టైనబిలిటీ బ్రిడ్జ్ ఫౌండేషన్లు ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర లాభాపేక్షలేని (నాన్‌ప్రాఫిట్) ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి, సుస్థిరతకు కొత్త దిశ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో ఈ సంస్థలు పనిచేస్తాయని తెలిపారు.

EQUIPPP రూపొందించిన CDX ప్లాట్‌ఫామ్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సామాజిక సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల మధ్య సమన్వయం పెంచి నియోజకవర్గాల అభివృద్ధికి ఈ ఫౌండేషన్లు తోడ్పడతాయని వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల పాత్ర విస్తరిస్తున్న నేపథ్యంలో, సాంకేతికత, ప్రతిభ, భాగస్వామ్యాల ద్వారా ఎంఎల్‌ఏలు అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మార్గదర్శకత్వంలో శాసనసభ సచివాలయం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు.




పరదేశీ..... (అరుణ నారదభట్ల)


పరదేశీ

అరుణ నారదభట్ల


చేయడానికి ఏమీ లేదు ప్రేమగా నాలుగు మాటలు చెప్పడం తప్ప

తన గొంతు వణికినప్పుడల్లా గుండె మేఘమై పోతుంది


తనలోని మాటలన్నీ చెపుతుంటాడు

చిన్నపాటి ఉత్సాహంతో తనకేసి చూస్తూ "అవునా" అంటుంటాను.

తనకెంతటి ఆనందం తన భావాలని పంచుకోడానికీ ఒకరున్నారని...


జీవితాన్నంతా తడుముకుంటూ

గతించిన లోకంలో స్వేచ్చగా విహరిస్తుంటాడు

తనకప్పుడు ఎవరి సహాయమూ అవసరం లేదు


ధీమాగా ఎక్కిన ఎత్తుపల్లాలూ

తేలికగా దాటేసిన వాగువంకలూ

విద్యుల్లతల్లా మెరిసిన సరదాల సౌధాలు

అన్నీ తనుగానే.


వసంతకాలంలో విరిసినపువ్వులన్నీ

చెట్టును వీడి 

పూజకో...పులకరింతలకో

దారివెదుక్కోని వెళ్ళిపోతాయి 

కాసింత పరిమళాన్ని చెట్టుకు వదిలేసి.


శరత్కాలపు వెన్నెలలా

అనుభవాల మస్తిష్కపొరల్లో 

వెండిమబ్బుల్లో చండ్రుడైపోతుంటాడు నాన్న ఒంటరిగానే.


పురిటినొప్పులనూ మనసు తిప్పలునూ వదిలేసి

నిర్మోహమాటంగా వాళ్ళని ఊరికే వదిలేసి వెల్లిపోతాను


కనడానికీ పెంచడానికీ వెచ్చించిన కాలాలన్నీ

రుతుచక్రానికి ముడి పడిపోతాయి


చినుకు రాలడమూ చిగురు తొడగటమూ

ఆకులు ముదిరి పండిపోయి శిశిరాన్ని ఆశ్రయించడమూ

సహజమే అయినా 

నాకు పరిమళాన్ని అందించిన చెట్టు అమ్మానాన్నలే.

తమ వయస్సునో అవస్థనో తీసుకోలేను గానీ

చేయూతనై ఆ చెట్టుకు చిగురుగానే ఉంటానెప్పుడూ


దూరమున్నప్పుడు ప్రశాంతంగా ఆప్యాయంగా

తన జీవతపుకథ వింటూనే ఉంటానెప్పుడూ

తన అనుభవాలనుండే జాగృతమవుతూ ఉంటానెప్పుడు


శిశిరానికి చేయూత కాసింత చల్లని నీరే

బలంగా కొంతకాలమైనా చెట్టునంటుకొని 

సంతోషంగా బ్రతకడానికి!


"పరదేశీ" 

– తండ్రి ఒంటరితనాన్ని అక్షరాల్లో నిలిపిన కవిత

(నవీన్​)

"పరదేశీ" అనే శీర్షికతో అరుణ నారదభట్ల రాసిన ఈ కవిత, కేవలం తండ్రి–కూతుళ్ల అనుబంధాన్ని మాత్రమే కాదు, కాలంతో పాటు మారిపోతున్న కుటుంబ వ్యవస్థను కూడా హృదయానికి హత్తుకునేలా ప్రతిబింబిస్తుంది.

వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తండ్రికి పిల్లలు చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. కానీ ప్రేమగా పలికే నాలుగు మాటలు, ఆప్యాయంగా వినే రెండు చెవులు, ఆయన జీవితానుభవాలను ఆసక్తిగా ఆలకించే ఒక మనసు... అవే ఆయనకు ప్రపంచం. ఈ భావాన్ని కవయిత్రి అత్యంత సహజంగా, అలంకారాల ఆర్భాటం లేకుండా వ్యక్తీకరించారు.

"తన గొంతు వణికినప్పుడల్లా గుండె మేఘమై పోతుంది" అనే పాదం చదివిన క్షణంలోనే పాఠకుడి హృదయం తడుస్తుంది. వృద్ధాప్యంలో తండ్రి గొంతులో వినిపించే కంపనాన్ని, కూతురు గుండెలో కురిసే వర్షంగా మార్చడం కవిత్వానికి నిదర్శనం.

చెట్టును తల్లిదండ్రులకు ప్రతీకగా నిలబెట్టి, పూలను పిల్లలతో పోల్చిన రూపకం ఈ కవితలో అత్యంత అందమైన భావచిత్రం. పూలు చెట్టును విడిచిపోతాయి. కానీ వాటి పరిమళం మాత్రం చెట్టుకు మిగిలిపోతుంది. అలాగే పిల్లలు తమ జీవితాల కోసం దూరమైనా, తల్లిదండ్రుల జీవితాల్లో ప్రేమ అనే పరిమళం మిగిల్చాలని కవయిత్రి సూచించారు.

చివర్లో వచ్చే...

"తమ వయస్సునో అవస్థనో తీసుకోలేను గానీ... చేయూతనై ఆ చెట్టుకు చిగురుగానే ఉంటానెప్పుడూ..."

అనే పాదాలు ఈ కవితకు ప్రాణం. తల్లిదండ్రుల వృద్ధాప్యాన్ని తీసుకోలేకపోయినా, వారికి అండగా నిలవాలనే ప్రతి సంతానం బాధ్యతను అవి గుర్తు చేస్తాయి.

ఈ కవితలో అతిశయోక్తి లేదు... ఆవేశం లేదు... జీవిత సత్యం మాత్రమే ఉంది.

నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన కవితల్లో "పరదేశీ" ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే, ఈ కవిత చదివిన తర్వాత ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలనిపిస్తుంది. అదే ఈ కవిత సాధించిన విజయం.


ఆ భూతం పేరు.. ఎల్ల్నినో

 


ఆ భూతం పేరు.. ఎల్ల్నినో


(దహగాం శ్రీనివాస్​)

ఆకాశ వీధుల్లో అహంకారాల ఆట సాగుతోంది.

ఓ అదృశ్య భూతం చెరలో చిక్కుకున్న మేఘమాలలు విలవిల్లాడుతున్నాయి. వాటి హృదయ ఘోష ఉరుముల రూపంలో వినిపిస్తున్నా, కన్నీటి చినుకులు మాత్రం నేలను తాకలేకపోతున్నాయి.

ప్రకృతి వికృతంగా మారింది.

ఆకాశమంతా కారుమబ్బులు కమ్ముకుని వర్షిస్తాయనే ఆశ కలిగిస్తాయి. కానీ క్షణాల్లోనే ఎవరో మంత్రం వేసినట్లు చెదిరిపోయి మాయమవుతున్నాయి.

అగ్నిగుండంలా మండుతున్న భూగోళం తన దాహం తీర్చుకోవడానికి ఎదురుచూస్తోంది.

వేసవి తాపంతో అల్లాడుతున్న భూమాత ఒక వర్షపు చుక్క కోసం నోరు తెరిచి ఎదురుచూస్తోంది. కానీ కనికరం లేని ఆ భూతం మేఘాలను అష్టదిగ్బంధనం చేసి, వర్షం కురవకుండా అడ్డుకుంటోంది.


మరోవైపు నిండు గర్భిణిలా ప్రసవ వేదనతో అలమటిస్తున్న మేఘమాలలు...

వరుణుడి ఆదేశాలు పాటించాలని తహతహలాడుతున్నా, పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్నా, సుఖప్రసవంలా భూమిపై జలధారలు కురిపించాలని ఆరాటపడుతున్నా... ఆ భూతం వాటిని పురిటిలోనే బంధించి వేస్తోంది.

ఆ భూతం పేరు ఎల్‌నినో.

సముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో ఏర్పడే అసాధారణ మార్పులతో పుట్టుకొచ్చే ఈ అదృశ్య శక్తి ప్రపంచ వాతావరణాన్ని తారుమారు చేస్తుంది. భారత రుతుపవనాలపై దీని ప్రభావం పడితే, మేఘాలు వచ్చినా వర్షాలు తగ్గిపోతాయి. రైతు ఆశలు ఆవిరవుతాయి. భూమి దాహం తీరదు. చెరువులు వెలవెలబోతాయి. జీవజాలం నీటి కోసం పరితపిస్తుంది.


ప్రకృతితో మనిషి చేసిన చెలగాటం, పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ వంటి పరిణామాలు ఎల్‌నినో ప్రభావాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


మేఘాలు శత్రువులు కావు...

వర్షం కురవకపోవడం వాటి తప్పు కాదు...

ఆకాశాన్ని బంధించిన ఎల్‌నినో అనే అదృశ్య భూతం ఆడుతున్న ఆటలో ప్రకృతి, భూమి, మనిషి ముగ్గురూ బలైపోతున్నారు.

ఎఫ్‌డీఆర్ సైన్స్ సెంటర్ ప్రారంభం

 


విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

దిక్సూచి, హైదరాబాద్‌:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆల్వాల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎఫ్‌డీఆర్) సహకారంతో ఏర్పాటు చేసిన ఎఫ్‌డీఆర్ సైన్స్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  ప్రారంభించారు. అనంతరం

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నేటి ప్రపంచంలో విజ్ఞానం, సాంకేతికతే అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనా దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వం, ప్రయోగాలు చేసే ఆసక్తి, సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించే దృక్పథం అలవడితేనే భవిష్యత్తులో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తయారవుతారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక, శాస్త్రీయ నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి సైన్స్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎఫ్‌డీఆర్) విద్యా రంగానికి అందిస్తున్న సహకారం అభినందనీయమని శ్రీధర్‌బాబు కొనియాడారు. సమాజాభివృద్ధికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఎఫ్‌డీఆర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





ఇస్కాన్ అబిడ్స్ స్వర్ణోత్సవ రథయాత్రలో మంత్రి శ్రీధర్‌బాబు




దిక్సూచి, హైదరాబాద్‌:

హైదరాబాద్‌లోని ఇస్కాన్ అబిడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవ రథయాత్ర వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథయాత్రలో పాల్గొని కొంతసేపు జగన్నాథుని సేవలో గడిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇస్కాన్ అబిడ్స్ గత 50 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక విలువలను సమాజంలో విస్తరించడంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విశేష కృషి చేస్తోందని కొనియాడారు. రథయాత్ర భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ శ్రీ జగన్నాథ స్వామి శాంతి, సామరస్యం, కరుణ అనే శాశ్వత సందేశాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందన్నారు.

స్వర్ణోత్సవ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి పారవశ్యంలో రథయాత్రను తిలకించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ అబిడ్స్ కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీధర్‌బాబు అభినందనలు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.








యోగాపై పెరుగుతున్న ఆసక్తి

ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే అభ్యసించిన యోగా.. ఇప్పుడు అన్ని వయస్సుల వారిని ఆకర్షిస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెరగడంతో మహిళలు, యువత, విద్యార్థులు పెద్దఎత్తున యోగా సాధనకు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాకర్స్ అసోసియేషన్లు, యోగా కేంద్రాలు, పతంజలి సంస్థలు, ఆయుష్ కేంద్రాలు, పీఎం శ్రీ పాఠశాలలు, సైనిక పాఠశాలలు, క్రీడా మైదానాల్లో ప్రతిరోజూ వందల సంఖ్యలో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.

మూడో తరగతి నుంచే సాధన

కరీంనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ధృతి మూడో తరగతి నుంచే యోగా సాధన ప్రారంభించింది. గురువు మార్గదర్శకత్వంలో యోగా నేర్చుకున్న ఆమె, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించింది. పతంజలి నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో పాల్గొని తన ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంది.

"గురువు, అమ్మానాన్నల ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించాను. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావడమే నా లక్ష్యం. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి" అని ధృతి తెలిపింది.

మహిళలు, యువతలో పెరుగుతున్న ఆసక్తి

ఇటీవలి కాలంలో మహిళలు, యువతలో యోగా సాధనపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. వివిధ సంస్థల్లో శిక్షణ పొందిన వారు ప్రతిరోజూ ఇంటి వద్దే ఆసనాలు, ప్రాణాయామం సాధన చేస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రాధాన్యంపై మరింత అవగాహన పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు యోగా సాధన చేస్తున్నారని యోగా శిక్షకుడు సిద్ధారెడ్డి తెలిపారు. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారే అధిక సంఖ్యలో యోగా అభ్యసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

విస్తరిస్తున్న శిక్షణ కేంద్రాలు

వాకర్స్ అసోసియేషన్లు, పతంజలి యోగా కేంద్రాలు, ఆయుష్ కేంద్రాలు, పీఎం శ్రీ పాఠశాలలు, సైనిక పాఠశాలలు, క్రీడా మైదానాల్లో ప్రతిరోజూ యోగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజూ 400 నుంచి 500 వరకు యోగా తరగతులు జరుగుతుండగా, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా గురువులు, విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా శిక్షణ అందిస్తున్నారు.

విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు

యోగా రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం పెంచుతున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలు యోగాలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. పీఎం శ్రీ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు ఇతర విద్యాసంస్థల్లో యోగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. దీంతో యోగా విద్యను అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

ఆరోగ్యకరమైన జీవనానికి యోగానే మార్గం

శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, రోగనిరోధక శక్తిని పెంపొందించే యోగా నేటి కాలంలో అవసరంగా మారింది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు.


బుధవారం, జులై 15, 2026

నేటి నుంచి వారాహి దేవీ నవరాత్రులు

 

వారాహి దేవి నవరాత్రులను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు, వీటినే "ఆషాఢ గుప్త నవరాత్రులు" అని కూడా అంటారు. ఈ ఏడాది 2026 లో ఈ నవరాత్రులు జూలై 15, బుధవారం నుండి జూలై 23, గురువారం వరకు 9 రోజుల పాటు జరగనున్నాయి.

హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రులలాగే ఈ ఆషాఢ నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది. 

ఈ సమయంలో లలితా త్రిపుర సుందరి దేవి సేనాధిపతి అయిన శ్రీ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

ఈ నవరాత్రుల విశిష్టత, పూజా విధానం మరియు నియమాల పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి:```

ఎవరీ వారాహి దేవి?

*సేనాధిపతి: 

శ్రీ లలితా దేవి సర్వ సైన్యానికి వారాహి దేవి కమాండర్-ఇన్-చీఫ్ (సైన్యాధిపతి). లలితా సహస్రనామంలో ఈమెను 'దండనాథ' అని కీర్తించారు.```

*స్వరూపం:

సప్తమాతృకలలో ఈమె అత్యంత శక్తివంతమైన దేవత. విష్ణుమూర్తి వరాహ అవతారానికి సంబంధించిన స్త్రీ శక్తి రూపమే వారాహి దేవి. ఈమె వరాహ (పంది) ముఖంతో, చేతిలో హలము (నాగలి), దండం ధరించి భక్తులను రక్షిస్తూ ఉంటుంది.```

*రక్షణ కవచం:

భక్తులకు ఎదురయ్యే శత్రు భయాలు, కోర్టు సమస్యలు, ఆస్తి లేదా భూ వివాదాలు మరియు వ్యాపారంలో అడ్డంకులను తొలగించడంలో ఈమెను మించిన దైవం లేదు.

*"గుప్త" నవరాత్రులు అని ఎందుకు అంటారు?

'గుప్త' అంటే రహస్యం. శరన్నవరాత్రులలాగా వీటిని అందరికీ తెలిసేలా పబ్లిక్‌గా కాకుండా, భక్తులు తమ ఇంట్లోనే చాలా నిగూఢంగా, నిశ్శబ్దంగా మరియు అత్యంత నిష్ఠతో మంత్ర సాధన చేస్తారు.


ముఖ్యంగా తాంత్రికులు, సాధకులు, దేవి ఉపాసకులు తమ కుండలినీ శక్తిని జాగ్రత్త పరచుకోవడానికి ఈ 9 రోజులు కఠినమైన సాధన చేస్తారు.

పూజా విధానం మరియు సమయం:

*రాత్రి పూజ:

వారాహి దేవిని రాత్రి సమయాలలో పూజించడం అత్యంత శ్రేష్ఠం. సాధారణంగా రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య చేసే పూజలు, జపాలు అమ్మవారికి త్వరగా చేరుతాయి.

*దీపారాధన:

పూజా గదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి వారాహి అష్టోత్తరం, వారాహి కవచం లేదా మూలమంత్రాన్ని పఠించాలి.

*విశేష తిథి (పంచమి):

ఈ 9 రోజులలో వచ్చే "ఆషాఢ శుద్ధ పంచమి" (జూలై 19, 2026) తిథి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు చేసే పూజకు అనంతమైన ఫలితం దక్కుతుంది.

*అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు

వారాహి దేవి భూమికి అధిపతి కాబట్టి, భూమి లోపల పండే దుంపలు మరియు ఘాటైన పదార్థాలు ఆమెకు మహా ప్రీతి.

*పులిహోర లేదా చక్కర పొంగలి.

*ఉడకబెట్టిన చిలగడదుంపలు (గెనుసు గడ్డలు) లేదా కందగడ్డ.

*నల్ల మినపప్పుతో చేసిన గారెలు.

*దానిమ్మ పండ్లు లేదా పానకం, వడపప్పు. [1, 7] ```

లభించే ఫలితాలు:

*శత్రు విజయం:

మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు శాంతిస్తారు. మీపై ఉన్న నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి.```

*భూ వివాదాల పరిష్కారం:

*ఇల్లు కట్టుకోవడంలో అడ్డంకులు ఉన్నా లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమస్యలు, కోర్టు కేసులు ఉన్నా అవి త్వరగా తొలగిపోతాయి.```

*ధైర్యం & ఆత్మవిశ్వాసం:

*భయపడే స్వభావం ఉన్నవారికి మానసిక ధైర్యం, ధీరత్వం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 

*ఆషాఢ గుప్త నవరాత్రులలో పెద్దగా ఆడంబరాలు లేకుండా, ఇంట్లోనే ప్రతిరోజూ ఒక దీపం వెలిగించి, దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయి.

- అవధాని మోహన శర్మ

అందం అంటే రూపమే కాదు.. వ్యక్తిత్వం


మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చే 18 అలవాట్లు

దిక్సూచి ప్రత్యేకం: 

ఆకర్షణీయంగా ఉండాలంటే అందమైన ముఖం, ఖరీదైన దుస్తులు లేదా పరిపూర్ణమైన శరీరాకృతి తప్పనిసరి కాదని మనోవిజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. మన ప్రవర్తన, మాటతీరు, ఇతరులతో మెలిగే విధానమే ఒక వ్యక్తిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.

దశాబ్దాలుగా జరిగిన అధ్యయనాల ప్రకారం, అందరి మనసు గెలుచుకునే వ్యక్తుల్లో కనిపించే 18 ముఖ్యమైన అలవాట్లు ఇవే...

1. ఆత్మీయమైన కంటి చూపు

ఎదుటి వ్యక్తితో సహజంగా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం ఆప్యాయతను పెంచుతుంది. "నేను నిన్ను గమనిస్తున్నాను" అనే భావన కలిగిస్తుంది.

2. పేర్లు గుర్తుంచుకోవడం

ఎదుటి వ్యక్తి పేరును గుర్తుంచుకొని సంభాషణలో ఉపయోగించడం గౌరవాన్ని, నిజమైన ఆసక్తిని తెలియజేస్తుంది.

3. నిదానంగా మాట్లాడడం

ఆతురత లేకుండా ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తులను ఆత్మవిశ్వాసం కలవారిగా భావిస్తారు.

4. హృదయపూర్వకంగా నవ్వడం

నకిలీ నవ్వు కంటే సహజమైన చిరునవ్వు, మనస్ఫూర్తిగా నవ్వడం ఇతరులను ఆకర్షిస్తుంది.

5. మంచి ప్రశ్నలు అడగడం

తమ గురించి మాత్రమే కాకుండా, ఎదుటివారి అనుభవాలు, అభిరుచుల గురించి ఆసక్తిగా అడిగే వ్యక్తులు త్వరగా స్నేహితులవుతారు.

6. స్వంత అభిప్రాయం కలిగి ఉండడం

ప్రతి విషయానికీ అవుననే వ్యక్తికంటే, మర్యాదగా తన అభిప్రాయాన్ని చెప్పగలిగే వ్యక్తికి ఎక్కువ గౌరవం లభిస్తుంది.

7. హద్దులు తెలిసిన ఆప్యాయత

సందర్భానికి తగిన విధంగా పలకరించడం, హస్తదానం చేయడం వంటి చర్యలు అనుబంధాన్ని పెంచుతాయి. అయితే వ్యక్తిగత హద్దులను ఎల్లప్పుడూ గౌరవించాలి.

8. ఎప్పుడూ అందుబాటులో ఉండకపోవడం

సొంత లక్ష్యాలు, అభిరుచులు, పనులతో బిజీగా ఉండే వ్యక్తులు మరింత ఆసక్తికరంగా కనిపిస్తారు.

9. సహజమైన చిరునవ్వు

అవసరమైనప్పుడు నవ్వడం మరింత నిజాయితీగా అనిపిస్తుంది. బలవంతంగా ఎప్పుడూ నవ్వడం సహజంగా కనిపించదు.

10. ఆత్మవిశ్వాసంతో నిలబడడం

నిటారుగా నిలబడటం, భుజాలను సరిగా ఉంచడం, ఆత్మవిశ్వాసంతో నడవడం మంచి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

11. పూర్తిగా వినడం

మధ్యలో అడ్డుకోకుండా ఎదుటివారి మాట పూర్తిగా వినడం గొప్ప లక్షణం.

12. అందరితో మర్యాదగా ఉండడం

తెలిసినవారితోనే కాదు... హోటల్ సిబ్బంది, డ్రైవర్లు, కార్మికులు వంటి వారితో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

13. తప్పు ఒప్పుకోవడం

"ఈ విషయంలో నేను తప్పు చేశాను" అని అంగీకరించడం బలహీనత కాదు... అది పరిపక్వతకు నిదర్శనం.

14. ఒక అభిరుచి కలిగి ఉండడం

సంగీతం, పుస్తకాలు, విజ్ఞానం, క్రీడలు... ఏదైనా ఒక విషయంపై మక్కువ ఉండటం వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

15. సహజంగా అనుబంధం పెంచుకోవడం

ఎదుటివారి సంభాషణ శైలికి అనుగుణంగా సహజంగా స్పందించడం సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

16. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవడం

ఎప్పుడూ గాసిప్ చేసే వారిపై విశ్వాసం తగ్గుతుంది. ఇతరుల గురించి మంచిగా మాట్లాడేవారిపై గౌరవం పెరుగుతుంది.

17. సందర్భానికి తగిన దుస్తులు ధరించడం

ఖరీదైన దుస్తులు అవసరం లేదు. శుభ్రంగా, సరిగ్గా సరిపోయే దుస్తులు ధరించడం మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

18. మీతో మాట్లాడిన తర్వాత వారికి మంచి అనుభూతి కలిగించడం

ఇదే అత్యంత ముఖ్యమైన లక్షణం. మీతో మాట్లాడిన తర్వాత ఎదుటివారు ఆనందంగా, గౌరవించబడినట్లు, విలువైన వ్యక్తిగా భావిస్తే... మిమ్మల్ని వారు ఎప్పటికీ మర్చిపోలేరు.

నిపుణులు ఏమంటున్నారు?

మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆకర్షణ అనేది కేవలం శారీరక సౌందర్యంపై ఆధారపడదు. ఆత్మీయత, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, వినయంతో కూడిన ప్రవర్తన, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలు ఒక వ్యక్తిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. వీటిలో చాలా అలవాట్లు సాధన ద్వారా అలవర్చుకోవచ్చు.

అందం కళ్లకు కనిపించేది కావచ్చు... కానీ వ్యక్తిత్వం మనసును గెలుచుకుంటుంది. రూపం కాలంతో మారొచ్చు. అయితే మంచి ప్రవర్తన, గౌరవం, నిజాయితీ, సానుకూల దృక్పథం ఉంటే ఆ వ్యక్తి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.

– రజినీ రెడ్డి, విజయవాడ

మంగళవారం, జులై 14, 2026

డిగ్రీ ఫలితాల్లో వాగ్దేవి విద్యార్థిని ప్రతిభ..


10/10 జీపీఏతో మెరిసిన మనోజ్ఞ ను అభినందిస్తున్నకళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ

దిక్సూచి, కరీంనగర్‌: శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాల్లో కరీంనగర్ పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థిని కట్కూరి మనోజ్ఞ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జీపీఏ సాధించింది.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ మనోజ్ఞను అభినందించి, కళాశాల విద్యార్థులు ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంస్థకు గర్వకారణమని అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, నాణ్యమైన విద్యా ప్రమాణాలు, విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ ఏ. మునీందర్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను కూడా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

ఎల్నీనో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి


పూర్తి ఇంటర్వ్యూ కోసం.. కింది లింక్​ క్లిక్​ చేయండి..


దిక్సూచి,  పెద్దపల్లి ప్రతినిధి:
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఎల్నీనో (El Niño) వాతావరణ దృగ్విషయం, దాని ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగుకు అనువైన పంటల ఎంపిక వంటి అంశాలపై పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ దిక్సూచి ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నీనో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి అని వివరించారు. దీని ప్రభావంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో వర్షపాతం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొనడం లేదా వర్షాల పంపిణీలో అసమానతలు ఏర్పడే అవకాశముందని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవడం, నేలలో తేమను సంరక్షించే విధానాలను అనుసరించడం, నీటి వనరులను పొదుపుగా వినియోగించడం, అవసరమైతే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రస్తుతం వర్షపాతం పరిస్థితులు, భూసార లక్షణాలు, నీటి లభ్యత ఆధారంగా ఏ పంటలు సాగు చేయడం మంచిదో కూడా ఆయన ఇంటర్వ్యూలో వివరించారు. రైతులు వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ విడుదల చేసే తాజా సూచనలను అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

ఎల్నీనోపై శాస్త్రీయ అవగాహనతో పాటు రైతులకు ఉపయోగపడే పలు కీలక సూచనలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ వెల్లడించారు. పూర్తి ఇంటర్వ్యూను దిక్సూచి ఛానల్‌లో వీక్షించాలని ఆయన కోరారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు 17 వరకు పొడగింపు


- జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద

 దిక్సూచి, పెద్దపల్లి, జూలై  14:

 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, 2026-27 విద్యా సంవత్సరానికి  సంబంధించి అందించనున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు జూలై 17 వరకు  పొడగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   జిల్లాలోని సమస్త యాజమాన్యములలోని ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు  2026-27 విద్యా సంవత్సరమునకు గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుటకు గాను జూలై 17 లోపు ఆన్ లైన్ 'http://nationalawardstoteachers.education.gov.in అనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోని అట్టి (3) ప్రతిపాదనలను సంబంధిత ధృవపత్రాలతో జిల్లా విద్య శాఖాధికారి కార్యాలయం, పెద్దపల్లిలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద ఆ ప్రకటనలో పేర్కోన్నారు.

తెలంగాణకు తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 మణికిరీటం

 

: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

40–50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి.. రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్‌కు అవకాశం

దిక్సూచి,  తాడిచెర్ల :

తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 తెలంగాణ రాష్ట్రానికే మణికిరీటంగా నిలవనుందని, సింగరేణి చరిత్రలోనే ఇది అతిపెద్ద బొగ్గు గనిగా అభివృద్ధి చెందబోతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా తాడిచెర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

తాడిచెర్ల కోల్‌బ్లాక్ అంశం గత రెండు దశాబ్దాలుగా చర్చలో ఉన్న విషయమని, ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాల ద్వారా ఉపాధి, అభివృద్ధి సాధించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్‌బ్లాక్–2ను సింగరేణికి కేటాయిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఈ గనిలో సుమారు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, 40 నుంచి 50 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగే సామర్థ్యం ఉందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ గని ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యే అవకాశముందని వివరించారు.

కోల్‌బ్లాక్–2 ద్వారా 2,000 శాశ్వత ఉద్యోగాలు, 5,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభిస్తాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రి తెలిపారు. డ్రైవర్లు, హోటళ్లు, లాడ్జీలు, వాహనాల మరమ్మతు కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర అనుబంధ వ్యాపారాలు అభివృద్ధి చెంది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశంలోనే, తెలంగాణలోనే అతిపెద్ద కోల్‌బ్లాక్‌గా తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 నిలవబోతోందని, దీనిని **"బాహుబలి కోల్ మైన్"**గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.

అవసరమైన అన్ని పర్యావరణ, పరిపాలనా అనుమతులను త్వరితగతిన పూర్తి చేసి, సింగరేణి ద్వారా తవ్వకాల పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ ఏఈ


 రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సతీష్ వీడియో


దిక్సూచి ప్రతినిధి, పెద్దపల్లి | జూలై 14

పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా పనిచేస్తున్న సతీష్‌ను రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఉచ్చు వేసిన అధికారులు, డబ్బు స్వీకరిస్తున్న సమయంలో సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఏఈ సతీష్‌ను ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకుని, అనంతరం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించి సంబంధిత రికార్డులను పరిశీలించారు.

ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు మరోసారి హెచ్చరించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

సోమవారం, జులై 13, 2026

పెద్దపల్లి యువతులకు ఎయిర్ హోస్టెస్ శిక్షణ అవకాశం

కలెక్టర్ ఆధ్వర్యంలో ఆరు నెలల ఉచిత శిక్షణ, అర్హులైన అవివాహిత బాలికల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: పెద్దపల్లి జిల్లాకు చెందిన అర్హులైన అవివాహిత యువతులకు ఎయిర్ హోస్టెస్–ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ విభాగాల్లో శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ. సురేశ్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 17 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల అవివాహిత బాలికలకు మాత్రమే ఆరు నెలల శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

శిక్షణ మొత్తం వ్యయం రూ.1.42 లక్షలు కాగా, అభ్యర్థులు హాస్టల్ ఫీజుగా నెలకు రూ.5,500 చొప్పున ఆరు నెలలకు మొత్తం రూ.33 వేల మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మిగిలిన రూ.1.09 లక్షల శిక్షణ వ్యయాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భరిస్తారని వెల్లడించారు.

శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు విమానాశ్రయాల్లో ప్యాసింజర్ సర్వీస్ అసిస్టెంట్ (PSA), బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సర్వీస్ (BHS), డిజీ బడ్డి (Digi Buddy) తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండే అవకాశం ఉందన్నారు.

ఈ అవకాశాన్ని పెద్దపల్లి జిల్లాకు చెందిన అర్హులైన యువతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ. సురేశ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) కల్పన కోరారు. మరిన్ని వివరాలకు 99639 60063 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026