వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రసంగం..
దిక్సూచి, మంథని: మంథని నియోజకవర్గానికి రూ.800 కోట్లు కాదు.. మరో రూ.800 కోట్లు ఇచ్చినా ఈ ప్రజల రుణం తీర్చుకోలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంథనిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
మంథని ప్రజల అదృష్టం కొద్దీ వారి ఎమ్మెల్యే, తమ అభిమాన నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. ఏదైనా సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని పనిని పూర్తి చేయగలిగిన నైపుణ్యం శ్రీధర్‌బాబుకు ఉందని ప్రశంసించారు.
తనకు శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుతో కలిసి అసెంబ్లీలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేశారు. శాసనసభ స్పీకర్‌గా ఎలా ఉండాలి, ఎలాంటి విలువలు, నైతిక బాధ్యతలతో వ్యవహరించాలి అనే విషయాలను శ్రీపాదరావును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన శ్రీపాదరావు వారసత్వాన్ని శ్రీధర్‌బాబు కొనసాగిస్తున్నారని చెప్పారు.
శ్రీధర్‌బాబు ఏ ముఖ్యమంత్రి హయాంలో ఉన్నా మంథని అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని తుమ్మల అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల సమయంలోనూ మంథని ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పట్టుదలతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేరుగా చెప్పడం కంటే శ్రీధర్‌బాబుకు సమస్యను చెప్పి పరిష్కారం పొందుతున్నామని అన్నారు.
శ్రీధర్‌బాబును ప్రజలు మరింతకాలం ఆశీర్వదించాలని తుమ్మల కోరారు. ఆయన మాటకు, గౌరవానికి, ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా వేదికపై ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. శ్రీధర్‌బాబు అప్పగించే అభివృద్ధి పనులను నాణ్యతతో, నిజాయితీగా, నిబద్ధతతో పూర్తి చేసి ఆయనకు ఎక్కడా మచ్చ రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ శ్రీధర్‌బాబుకు కుడిభుజంలా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రిని సైతం నిలదీసి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అడగగలిగే నాయకుడని కొనియాడారు. అందుకే ఆయనను మరోసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు.
అదేవిధంగా యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలను బలంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి వారసుడిగా వంశీకృష్ణ తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
ప్రజలు ఎన్నుకున్న శ్రీధర్‌బాబు, వంశీకృష్ణ వంటి నాయకులు తమ పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టి మరింత మెరుగ్గా పనిచేయాలని తుమ్మల ఆకాంక్షించారు. మంథని ప్రాంత అభివృద్ధిలో అందరూ భాగస్వాములై, ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.