ఆ భూతం పేరు.. ఎల్ల్నినో
(దహగాం శ్రీనివాస్)
ఆకాశ వీధుల్లో అహంకారాల ఆట సాగుతోంది.
ఓ అదృశ్య భూతం చెరలో చిక్కుకున్న మేఘమాలలు విలవిల్లాడుతున్నాయి. వాటి హృదయ ఘోష ఉరుముల రూపంలో వినిపిస్తున్నా, కన్నీటి చినుకులు మాత్రం నేలను తాకలేకపోతున్నాయి.
ప్రకృతి వికృతంగా మారింది.
ఆకాశమంతా కారుమబ్బులు కమ్ముకుని వర్షిస్తాయనే ఆశ కలిగిస్తాయి. కానీ క్షణాల్లోనే ఎవరో మంత్రం వేసినట్లు చెదిరిపోయి మాయమవుతున్నాయి.
అగ్నిగుండంలా మండుతున్న భూగోళం తన దాహం తీర్చుకోవడానికి ఎదురుచూస్తోంది.
వేసవి తాపంతో అల్లాడుతున్న భూమాత ఒక వర్షపు చుక్క కోసం నోరు తెరిచి ఎదురుచూస్తోంది. కానీ కనికరం లేని ఆ భూతం మేఘాలను అష్టదిగ్బంధనం చేసి, వర్షం కురవకుండా అడ్డుకుంటోంది.
మరోవైపు నిండు గర్భిణిలా ప్రసవ వేదనతో అలమటిస్తున్న మేఘమాలలు...
వరుణుడి ఆదేశాలు పాటించాలని తహతహలాడుతున్నా, పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్నా, సుఖప్రసవంలా భూమిపై జలధారలు కురిపించాలని ఆరాటపడుతున్నా... ఆ భూతం వాటిని పురిటిలోనే బంధించి వేస్తోంది.
ఆ భూతం పేరు ఎల్నినో.
సముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో ఏర్పడే అసాధారణ మార్పులతో పుట్టుకొచ్చే ఈ అదృశ్య శక్తి ప్రపంచ వాతావరణాన్ని తారుమారు చేస్తుంది. భారత రుతుపవనాలపై దీని ప్రభావం పడితే, మేఘాలు వచ్చినా వర్షాలు తగ్గిపోతాయి. రైతు ఆశలు ఆవిరవుతాయి. భూమి దాహం తీరదు. చెరువులు వెలవెలబోతాయి. జీవజాలం నీటి కోసం పరితపిస్తుంది.
ప్రకృతితో మనిషి చేసిన చెలగాటం, పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ వంటి పరిణామాలు ఎల్నినో ప్రభావాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మేఘాలు శత్రువులు కావు...
వర్షం కురవకపోవడం వాటి తప్పు కాదు...
ఆకాశాన్ని బంధించిన ఎల్నినో అనే అదృశ్య భూతం ఆడుతున్న ఆటలో ప్రకృతి, భూమి, మనిషి ముగ్గురూ బలైపోతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి