Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

గురువారం, జూన్ 25, 2026

రామగుండం అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు


 

 సమీక్షిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష


డీఎంఎఫ్‌టీలో నిధుల కొరత లేదు.. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలి

జూలై రెండో వారానికల్లా మెజారిటీ అభివృద్ధి పనులకు గ్రౌండింగ్ పూర్తి చేయాలి

 పరిశుభ్రత, ప్రతి ఇంటికి తాగునీరు, బ్లాక్ స్పాట్ నిరోధించడమే తొలి ప్రాధాన్యత

రామగుండం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్


పెద్దపల్లి:

రామగుండం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని, మంజూరైన ప్రతి పనిని వేగంగా క్షేత్రస్థాయిలో ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జె. అరుణశ్రీతో కలిసి రామగుండం అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగామాట్లాడుతూ డీఎంఎఫ్‌టీలో నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ స్మశానవాటికలు, మహిళా శక్తి భవనాలు, విద్యాసంస్థల అభివృద్ధి పనులు, తాగునీటి పనులు, ఇతర మౌలిక వసతుల పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంజినీరింగ్ అధికారి రోజు వారీగా పనులను పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయిలో నిర్మిస్తున్న మహిళా సంఘ భవనాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియల్లో జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని సూచించారు. రూ.5 లక్షల విలువైన చిన్న పనులు కూడా ఏడాది గడిచినా పూర్తికాకపోవడం అధికారుల పనితీరును ప్రతిబింబిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై రెండో వారానికల్లా మంజూరైన మెజారిటీ అభివృద్ధి పనులకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోర్టు భవనం నిర్మాణానికి సంబంధించిన సవరించిన అంచనాలకు ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం వచ్చేలా నిరంతరం ఫాలోఅప్ చేయాలని, మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ అంచనాలను తక్షణమే ఖరారు చేయాలని ఆదేశించారు. 2 బీహెచ్‌కే గృహాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విద్యుత్, సెప్టిక్ ట్యాంకులు, తాగునీటి వంటి మౌలిక వసతుల పనులను వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు కూడా అందజేసి వెంటనే గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్లు జారీ చేయాలని ఆదేశించారు. రామగుండంలోని విద్యాసంస్థల్లో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, నరేగా ద్వారా చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను జూన్ 30లోపు పూర్తి చేసి బిల్లులు క్లెయిమ్ చేయాలని సూచించారు. నరేగా నిధుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పలుమార్లు సూచించినా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి అవసరమైతే మంజూరు రద్దుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మొదటి విడతలో మిగిలిన గృహాల మంజూరుకు అవసరమైన సర్వే పూర్తి చేసి ఒకే రోజు పెద్ద ఎత్తున మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రామగుండం నగరంలో గృహ నిర్మాణాలు, తాగునీటి పనులు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రామగుండంలో సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంకా కాగితాలకే పరిమితమై ఉన్నాయని, వాటిని అత్యవసరంగా గ్రౌండ్ చేసి అమలు దశకు తీసుకురావాలని సూచించారు. నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రామగుండం నగరంలో పారిశుద్ధ్య పరిస్థితిని పూర్తిగా మెరుగుపర్చాలని, ప్రతి నెల రూ.2 కోట్ల వరకు పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ రహదారులపై చెత్త కనిపించడం అంగీకారయోగ్యం కాదన్నారు. నగరంలో ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా  వీధి దీపాల ఏర్పాటు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ అందించడం ప్రాధాన్యతగా తీసుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శిశు మరణాల రేటు తగ్గింపే లక్ష్యం

 


మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్ కుమార్

ముద్ర, పెద్దపల్లి: జిల్లాలో శిశు మరణాల రేటు (IMR), నవజాత శిశు మరణాల రేటు (NMR)ను సింగిల్ డిజిట్ స్థాయికి మరింత తగ్గించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచించారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని చాంబర్‌లో “సంకల్ప్” కార్యక్రమం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో గర్భిణీలను ప్రారంభ దశలోనే నమోదు చేయడం  హై రిస్క్ గర్భధారణలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ కల్పించడం, అవసరమైన సందర్భాల్లో యాంటెనాటల్ స్టెరాయిడ్స్ వినియోగం, ప్రసవం అనంతరం తల్లి పాలను వెంటనే ప్రారంభించడం, ప్రసవ సమయంలో భ్రూణ గుండె స్పందనను నిరంతరం పర్యవేక్షించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

అలాగే ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం (SNCU) సేవలను మరింత బలోపేతం చేయడం, ప్రతి హై రిస్క్ గర్భధారణకు బర్త్ ప్లానింగ్ రూపొందించడం, ఇంటి వద్ద నవజాత శిశు సంరక్షణ సందర్శనలను పటిష్టం చేయడం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో నవజాత శిశు మరణాల రేటు3.3, శిశు మరణాల రేటు 4.2గా నమోదైందని తెలిపారు. ఈ సూచీలను మరింత మెరుగుపరిచేందుకు వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ కిరణ్ కుమార్, ప్రోగ్రామ్ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులు, వైద్యాధికారులు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

రామగుండం: డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

 








మాట్లాడుతున్న డీసీపీ బి. రామ్ రెడ్డి

రామగుండం: డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.

రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తూ తమ ఆశయాలను పిల్లలపై ఉంచి పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని ఆయన హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అదే అవగాహనను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా చేరవేయాలని కోరారు.

ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇందుకోసం అత్యవసర సహాయ సంఖ్య 100 లేదా సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలన ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరిస్తేనే డ్రగ్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా విద్యార్థులు ముందుండి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారిని కూడా మాదకద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా చూసేందుకు కృషి చేస్తామని, డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి అంకితభావంతో పనిచేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వభారతి స్కూల్స్ డైరెక్టర్ యాదగిరి గౌడ్, నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి గౌడ్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ జోసెఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డీ-అడిక్షన్ సెంటర్‌లో ఆటవస్తువుల పంపిణీ

గంజాయి,ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన బాధితులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడం,వారి మానసిక స్థితి, ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావడం లక్ష్యంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్‌ను పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి,వారికి అందుతున్న వైద్య సేవలు,చికిత్స పురోగతి గురించి వైద్యులు,సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గంజాయి,ఇతర మత్తు పదార్థాల వ్యసనానికి గురైన వ్యక్తులు తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా అవసరమైన వైద్య, మానసిక,సామాజిక సహాయాన్ని అందించేందుకు పోలీసులు,వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.చికిత్స పొందుతున్న బాధితుల కాలక్షేపం, మానసిక ఉల్లాసం, ఆలోచనా విధానంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అందించిన క్యారమ్ బోర్డులు,చెస్ బోర్డులు తదితర ఆటవస్తువులను డీసీపీ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గంజాయి,ఇతర మత్తు పదార్థాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడేందుకు వైద్య చికిత్సతో పాటు మానసిక ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం,సమాజం నుంచి నిరంతర మద్దతు కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. వ్యసనానికి గురైన వారిని చిన్నచూపు చూడకుండా,వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.










43 ఏళ్ల క్రితం భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చిన ప్రపంచకప్ విజయం

 


1983 జూన్ 25: లార్డ్స్‌లో ఎగిరిన త్రివర్ణ పతాకం

భారత క్రికెట్ చరిత్రలో 1983 జూన్ 25 ఒక స్వర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం, ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ భారత జట్టు తొలి సారిగా ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ 1983ను కైవసం చేసుకుంది. అప్పటి వరకు క్రికెట్‌లో అజేయ శక్తిగా పేరొందిన వెస్ట్ ఇండీస్ ను ఓడించి, భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.



అండర్‌డాగ్‌గా బరిలోకి భారత్

1983 ప్రపంచకప్ ప్రారంభమైనప్పుడు భారత జట్టును టైటిల్ ఫేవరెట్‌గా ఎవరూ పరిగణించలేదు. అంతకుముందు జరిగిన రెండు ప్రపంచకప్‌ల్లో భారత్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే కెప్టెన్ కపిల్ దేవ్ నాయకత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు అంచనాలను తారుమారు చేసింది.

టోర్నమెంట్‌ను మలుపు తిప్పిన 175 పరుగులు

జింబాబ్వేతో జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కపిల్ దేవ్ అద్భుతంగా ఆడి 175 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా అది ఇప్పటికీ గుర్తించబడుతోంది.

సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

సెమీఫైనల్లో ఆతిథ్య జట్టు ఇంగ్లండు ను భారత్ ఓడించి ఫైనల్‌కు చేరింది. దీంతో ప్రపంచ క్రికెట్ దృష్టి భారత జట్టుపై పడింది.

లార్డ్స్‌లో చరిత్ర

ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్  లో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 183 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ స్కోరు చూసి వెస్టిండీస్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు.

అయితే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్‌ను 140 పరుగులకే కుప్పకూల్చారు. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిచిపోలేని క్యాచ్

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ వివెన్ రిచర్డ్స్ ప్రమాదకరంగా ఆడుతున్న సమయంలో కపిల్ దేవ్ వెనక్కి పరుగెత్తి పట్టిన క్యాచ్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ క్యాచ్ ఇప్పటికీ ప్రపంచకప్ చరిత్రలో గొప్ప క్యాచ్‌లలో ఒకటిగా చెప్పుకుంటారు.



ఫైనల్ హీరోలు

  • మోహిందర్ అమర్నాథ్ – 26 పరుగులు, 3 వికెట్లు

  • మదన్ లాల్ – కీలక వికెట్లు

  • కపిల్ దేవ్ స్ఫూర్తిదాయక నాయకత్వం

  • బల్వీందర్ సింగ్ సధూ – గ్రీనిడ్జ్ వికెట్‌తో కీలక ఆరంభం

భారత క్రికెట్‌కు కొత్త యుగం

1983 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ రూపురేఖలను మార్చేసింది. దేశవ్యాప్తంగా క్రికెట్‌కు అపార ఆదరణ లభించింది. వేలాది మంది యువకులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఈ విజయం ప్రేరణగా నిలిచింది. తర్వాత భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడానికి కూడా 1983 విజయం బలమైన పునాది వేసింది.

విశేషాలు

  • ప్రపంచకప్ గెలిచిన తొలి ఆసియా దేశం భారత్.

  • ఫైనల్‌లో భారత్ చేసిన 183 పరుగులే అప్పటి ప్రపంచకప్ ఫైనల్ విజేత జట్టు చేసిన అతి తక్కువ స్కోరు.

  • కపిల్ దేవ్ 175* ఇన్నింగ్స్‌కు టెలివిజన్ రికార్డింగ్ అందుబాటులో లేదు.

  • 1983 జట్టు విజయగాథ ఆధారంగా 83 చిత్రం రూపొందింది.

"183 పరుగులు... 11 మంది ఆటగాళ్లు... ఒక కల... ఒక దేశం. 1983 జూన్ 25న భారత క్రికెట్ ప్రపంచాన్ని జయించిన రోజు."

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026