బెంగళూరులో నిర్వహించిన న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ – సౌత్ ఎడిషన్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగిందని తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రానికి ప్రత్యేక బలమని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షిస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
సమ్మిట్లో విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, సాంకేతిక రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
సుస్థిర అభివృద్ధి, సమగ్ర వృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.


