అసత్యాలతో కేటీఆర్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. బుధవారం గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.90 లక్షల చొప్పున భూములు కేటాయిస్తే, తమ ప్రభుత్వం ఎకరానికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించిందని తెలిపారు. ఐదు ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కేటాయించామని, కేటీఆర్ చెబుతున్న రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు.
హెచ్ఐఎల్టీ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కేటీఆర్కు మంచిది కాదని సూచించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దని, ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించవద్దని అన్నారు.
నీటి వాటాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడబోమని, జీఆర్ఎంబీ సమావేశానికి హాజరై తెలంగాణ నీటి వాటాల కోసం బలంగా వాదిస్తామని శ్రీధర్బాబు స్పష్టం చేశారు.