విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
దిక్సూచి, హైదరాబాద్:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆల్వాల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్) సహకారంతో ఏర్పాటు చేసిన ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నేటి ప్రపంచంలో విజ్ఞానం, సాంకేతికతే అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనా దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వం, ప్రయోగాలు చేసే ఆసక్తి, సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించే దృక్పథం అలవడితేనే భవిష్యత్తులో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తయారవుతారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక, శాస్త్రీయ నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి సైన్స్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్) విద్యా రంగానికి అందిస్తున్న సహకారం అభినందనీయమని శ్రీధర్‌బాబు కొనియాడారు. సమాజాభివృద్ధికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఎఫ్డీఆర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి