: సీపీ అంబర్ కిషోర్ ఝా
నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
దిక్సూచి, రామగుండం, జూలై 13: పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో సీపీ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలపై స్టేషన్ అధికారులను ఆన్లైన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
లాంగ్ పెండింగ్ కేసులు, పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ సూచించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ 2.0లో నమోదైన ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని నిర్దేశిత గడువులోగా ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఎస్హెచ్ఓలు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి చార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి దశను నిర్ణీత సమయంలో సిస్టమ్లో అప్డేట్ చేయాలని, తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారాన్ని నమోదు చేయరాదని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసును గడువులోపు పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రాపర్టీ నేరాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో స్థానిక పోలీసులు, సీసీఎస్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, మహిళలకు సంబంధించిన తీవ్రమైన కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వెంటనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులు, కీలక పెండింగ్ నివేదికలను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పేకాట తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆస్తి, ఆర్థిక నేరాల్లో ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, అటాచ్మెంట్ ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, కేడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ప్రాపర్టీ ఆఫెండర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్హెచ్ఓలకు ఆదేశించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల్లో క్రిమినల్ అంశాలు ఉంటే వెంటనే కేసు నమోదు చేయాలని, ప్రతి ఫిర్యాదుపై పారదర్శక విచారణ జరిపి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ దేవాలయంతో సమానమని, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సీపీ సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించాలని, అరెస్టుల విషయంలో ఎస్ఓపీని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వవద్దని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.