మంథనికి న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
భవన నిర్మాణానికి రూ.20 కోట్లు
మంథని, జూలై 17 (దిక్సూచి): పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు–భవనాల (టీఆర్అండ్బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మారుతున్న నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్య శిక్షణను యువతకు అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది. ఇక్కడ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులు నిర్వహించబడతాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధితో పాటు దేశీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
మంథనికి ఈ ప్రతిష్ఠాత్మక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కేటాయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తర తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించే కేంద్రంగా మంథని ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి