Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, సెప్టెంబర్ 07, 2026

మంథనిలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన సంబరాలు

 


సంబరాల వీడియోలకు Dtv చూడండి..

దిక్సూచి,  మంథని: 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని మండలంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం సేకరణతో పాటు విద్య, ఉద్యోగాల రంగంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను నాయకులు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, మెగా డీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోలీస్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టిందని పేర్కొన్నారు.

‘మంథని అభివృద్ధికి శ్రీధర్‌బాబే దిక్సూచి’

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఓడేడు బ్రిడ్జి, మంథని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణాలపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మంథనిలో 50 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయ సముదాయం, వెజ్‌–నాన్‌వెజ్‌ మార్కెట్లు, విస్తృత రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతోందన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని నాయకులు హెచ్చరించారు. మంథని ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ 1,000 రోజుల పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం, సెప్టెంబర్ 06, 2026

సెప్టెంబర్ 2026 ముఖ్యమైన రోజులు, పండుగలు

 


  • సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి
  • సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం (Teacher's Day)
  • సెప్టెంబర్ 14: వినాయక చతుర్థి (గణేష్ చతుర్థి)
  • సెప్టెంబర్ 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం (World Ozone Day)
  • సెప్టెంబర్ 17: విశ్వకర్మ పూజ
  • సెప్టెంబర్ 18: ప్రపంచ వెదురు దినోత్సవం (World Bamboo Day)
  • సెప్టెంబర్ 21: అంతర్జాతీయ శాంతి దినోత్సవం మరియు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం
  • సెప్టెంబర్ 22: రోజ్ డే (క్యాన్సర్ రోగుల సంక్షేమం) & ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం
  • సెప్టెంబర్ 25: అనంత చతుర్దశి (గణేష్ విసర్జన)
  • సెప్టెంబర్ 27: మహాలయ అమావాస్య / పితృపక్షం ప్రారంభం

తెలంగాణ సిలికాన్‌ ఫోటోనిక్స్‌ మిషన్‌కు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌

 


దిక్సూచి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ సభ్యుడు డా. వీకే సారస్వత్‌ ఆదివారం డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సిలికాన్‌ ఫోటోనిక్స్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ‘తెలంగాణ సిలికాన్‌ ఫోటోనిక్స్‌ మిషన్‌’కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ రూపొందించడంపై చర్చించారు.

ఫోటోనిక్స్‌ వ్యాలీ కార్పొరేషన్‌ భవిష్యత్‌ కార్యాచరణతో పాటు ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌–2.0తో తెలంగాణ మిషన్‌ను అనుసంధానించే అవకాశాలను సమీక్షించారు. పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీ వరకు డిజైన్‌, తయారీ, ప్యాకేజింగ్‌, టెస్టింగ్‌, సరఫరా వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ఎకోసిస్టమ్‌ ఏర్పాటు చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

అధునాతన ఫోటోనిక్‌ ప్యాకేజింగ్‌, కో-ప్యాకేజ్డ్‌ ఆప్టిక్స్‌ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో భాగస్వామ్యం కావాలని సారస్వత్‌ను ఆహ్వానించారు. ఫోటోనిక్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌పై ఏర్పాటు చేయనున్న అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించాలని కోరారు.

ఫోటోనిక్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌ రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సారస్వత్‌ తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యానికి సహకరిస్తానన్నారు. సమావేశంలో ఐటీఈ&సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, ఫోటోనిక్స్‌ వ్యాలీ కార్పొరేషన్‌ సీఈవో ఏఎస్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: శ్రీధర్‌బాబు

 


దిక్సూచి, హైదరాబాద్:

ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. 

వెయ్యి రోజుల ప్రజాపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు. పదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరై మాట్లాడితే ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆయన సలహాలు, సూచనలను కూడా స్వీకరిస్తామని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరారు.



శనివారం, సెప్టెంబర్ 05, 2026

కరీంనగర్‌లో సంబరాలు

 


ఇందిరా చౌక్‌లో భారీ కేక్‌ కట్‌.. పేదలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 5: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా చౌక్‌ వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాణాసంచా కాల్చి, డీజే పాటలతో కాంగ్రెస్‌ శ్రేణులు సందడి చేశారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రూపురెడ్డి కశ్యప్‌రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఆహార ప్యాకెట్లను డా. మేడిపల్లి సత్యం పేదలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిందన్నారు. ఈ కాలంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 15 లక్షల కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 43 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 1000 రోజుల్లో 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మిగిలిన ఖాళీలకు కూడా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు.

1000 రోజులుగా ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్‌ తక్షణమే రాజీనామా చేయాలని మేడిపల్లి సత్యం డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు నిరాశతో విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ వైపే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్‌ హుస్సేన్‌, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్‌, ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

 


ఇందిరా చౌక్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ

దిక్సూచి, కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కరీంనగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌ వద్ద కార్యక్రమం నిర్వహించి, అనంతరం నగరంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు.

ఇందిరా చౌక్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్‌ చౌక్‌, గాంధీ చౌక్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ చౌక్‌ మీదుగా అంబేద్కర్‌ చౌక్‌ వరకు కొనసాగింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. గతంలో మాదిరిగా ఫామ్‌హౌస్‌ పాలన కాకుండా ప్రజల గడప వద్దకు పాలన చేరిందని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఆల్‌ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

 


పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

దిక్సూచి, హైదరాబాద్‌:

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’ ఏర్పాట్లపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శనివారం ఆబిడ్స్‌లోని ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమ్మిట్‌ ఏర్పాట్లు, రోడ్‌షోలు, ఎంవోయూలు, ప్రచారం, లాజిస్టిక్స్‌, ప్రోటోకాల్‌ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను పెట్టుబడులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్‌ సమ్మిట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిపేలా కొత్త విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా దేశీయ, విదేశీ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సమ్మిట్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతంలో కుదిరిన ఎంవోయూలు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా, పరిశ్రమలుగా రూపుదిద్దుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఎంవోయూపై ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఫాలోఅప్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రంగా
లకు సమ్మిట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్‌, ప్రోటోకాల్‌, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్‌లైన్లు నిర్దేశించామని, ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మిట్‌ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులో అన్ని పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.


వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు

 



5 నుంచి ప్రారంభం

నిర్వహణ, వసతులు, భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష

దిక్సూచి ప్రతినిధి, హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమావేశాల నిర్వహణ, శాసనసభ్యులకు అవసరమైన వసతులు, భద్రతా చర్యలు, ఇతర శాఖల సమన్వయంపై శనివారం ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.  

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులు, సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక వసతులు, సభ్యులకు కల్పించాల్సిన సౌకర్యాలు, సభా ప్రాంగణంలో నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

అదేవిధంగా సమావేశాల సందర్భంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. శాసనసభ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయడంతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల రాకపోకలు, ప్రజలు, సందర్శకుల భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొనసాగిస్తూ సమావేశాలు ప్రశాంతంగా, సమర్థవంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, వివిధ అంశాలపై చర్చకు వేదిక కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.. నూతన గృహప్రవేశం

 


దిక్సూచి, మంథని, సెప్టెంబర్‌ 5: 

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశీస్సులతో మంథని నియోజకవర్గం కాకర్లపల్లి గ్రామానికి చెందిన దివంగత దొబ్బల చంద్రయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో శనివారం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని అయిలి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.   

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఎవరూ లంచం ఇవ్వొద్దని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే క్యాంపు కార్యాలయంలో లేదా తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రజలకు తెల్ల రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, రూ.2 లక్షల రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సోషల్‌ మీడియా ఇన్‌చార్జి ఆరెల్లి కిరణ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ ఆకుల ప్రత్యూష సాయి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కన్నెబోయిన ఓదెలు, మాజీ చైర్మన్‌ ఆకుల కిరణ్‌, కాంగ్రెస్‌ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2026

నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

 


కాటారం: నిరుద్యోగ యువతకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. మంథని నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు–మన కోచింగ్‌ సెంటర్‌’ కార్యక్రమంలో భాగంగా కాటారం మండల కేంద్రంలోని సువిద్య స్కూల్‌లో శ్రీ విశ్వ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. పోలీస్‌ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న యువతకు నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. యువతలోని ప్రతిభను వెలికితీసి, వారు కోరుకున్న ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించడమే ఉచిత కోచింగ్‌ ప్రధాన ఉద్దేశమన్నారు.

మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలతో పాటు మంథని నియోజకవర్గానికి గర్వకారణంగా నిలవాలని శ్రీను బాబు కోరారు.

ఉట్టి కొట్టి ఉత్సాహం నింపిన దుద్దిళ్ల శ్రీను బాబు

 


దిక్సూచి,  మహాదేవపూర్: 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని శ్రీను బాబు అన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అనంతరం వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో శ్రీను బాబు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టారు. దీంతో వేడుకల ప్రాంగణంలో సందడి నెలకొంది. యాదవ సంఘం ప్రతినిధులు, నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



కృష్ణాష్టమి వేడుకల్లో భక్తుల సందడి

 


మంథని: మున్సిపల్‌ పరిధిలోని రావులచెరువు కట్ట ప్రాంతంలోని శ్రీ మంత్రకూట గోపిజన వల్లభ మందిరంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, వేదమూర్తులు అవుదానుల శ్రీకాంత్‌ శర్మ మాట్లాడుతూ.. ఈ మందిరం ఎంతో పవిత్రమైనదని, శ్రీకృష్ణుడి మహోన్నత మహిమకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ప్రతి కృష్ణాష్టమి రోజున స్వామివారికి ప్రత్యేకంగా వెన్నను నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు. ఆ వెన్నను మూడు నెలల అనంతరం తిరిగి తీస్తామని, అప్పటివరకు అది కరగకుండా ముద్దగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది శ్రీకృష్ణుడి లీలా మహిమకు నిదర్శనమని, ఆలయంలో ఎన్నో అద్భుతాలను స్వయంగా చూశామని తెలిపారు.

కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించగా, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

గురువారం, సెప్టెంబర్ 03, 2026

కొండా సురేఖకు ఉద్వాసన?

బర్తరఫ్‌ తర్వాత బీసీ మహిళలకు కీలక పదవులపై కాంగ్రెస్‌ కసరత్తు!

దిక్సూచి ప్రత్యేక కథనం

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ కలకలం రేగుతున్నదా..? మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై అధిష్ఠానం కీలక నిర్ణయానికి చేరుకుందా..? సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే లోక్‌భవన్‌కు బర్తరఫ్‌ లేఖ పంపే అవకాశముందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

కొండా సురేఖ వ్యవహారంపై గత కొంతకాలంగా పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు తదుపరి పరిణామాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బర్తరఫ్‌ జరిగితే దాని ప్రభావం పార్టీపై ఎలా ఉంటుంది? వరంగల్‌ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలు మారతాయి? కొండా వర్గం స్పందన ఎలా ఉండొచ్చు? అనే అంశాలపై సీనియర్‌ నేతల నుంచి అధిష్ఠానం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

బర్తరఫ్‌ తర్వాతే అసలు లెక్కలు?

సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే పరిస్థితి ఏర్పడితే.. కేవలం ఒక మంత్రి మార్పుతోనే వ్యవహారం ముగించకుండా, దాని ద్వారా ఏర్పడే రాజకీయ ఖాళీని ఎలా భర్తీ చేయాలనే దానిపై కూడా కాంగ్రెస్‌ పెద్దలు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రత్యేకంగా బీసీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే మహిళలు, బీసీలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరంపై పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ పరిణామాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే వ్యూహంపై కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురు బీసీ మహిళలు.. మూడు కీలక పదవులు?

బీసీ మహిళా నేతలకు మూడు కీలక అవకాశాలు కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఒక బీసీ మహిళకు అవకాశం కల్పించడంతో పాటు.. పార్టీ, ప్రభుత్వంలో మరో రెండు కీలక పదవులను బీసీ మహిళలకు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీకి చేసిన సేవలు, రాబోయే ఎన్నికల రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకుని పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

చిన్నారెడ్డి స్థానంలోనూ బీసీ మహిళ?

ఇక మరో ఆసక్తికరమైన అంశం ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి.

ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో మార్పులు చోటుచేసుకుంటే.. చిన్నారెడ్డి స్థానంలో బీసీ మహిళను నియమించే అవకాశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అంటే కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకే పరిమితం కాకుండా.. నామినేటెడ్‌ పదవుల్లోనూ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా కాంగ్రెస్‌ వ్యూహం ఉండవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అధిష్ఠానం ఆరా.. నేతల నుంచి సమాచారం

ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక పరిణామం.. రాష్ట్రంలోని సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాలను అధిష్ఠానం సేకరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం.

ఎవరికి ప్రజల్లో ఆదరణ ఉంది? ఎవరు పార్టీకి ఉపయోగపడతారు? ఏ నియామకం ఏ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుంది? బీసీ మహిళలకు ప్రాధాన్యం ఇస్తే పార్టీకి వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటి? వంటి అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

సురేఖ ఎపిసోడ్‌.. విస్తృత వ్యూహంలో భాగమేనా?

అందుకే కొండా సురేఖ అంశాన్ని కేవలం ఒక మంత్రి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారంగా చూడటం సరిపోదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒకవైపు సురేఖపై చర్య.. మరోవైపు బీసీ మహిళలకు కీలక పదవులు.. ఈ రెండింటినీ కలిపి చూస్తే సామాజిక సమీకరణాలను కొత్తగా మలచే ప్రయత్నం జరుగుతోందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అయితే బర్తరఫ్‌ లేఖ, కొత్త నియామకాలు, పేర్ల ఖరారు వంటి అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే చూడాల్సి ఉంటుంది.

ఇక సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది?
లోక్‌భవన్‌కు బర్తరఫ్‌ లేఖ వెళ్తుందా?
ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు దక్కుతాయా?
కొండా సురేఖ ఎపిసోడ్‌ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తుందా?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలే హాట్‌టాపిక్‌గా మారాయి.

బుధవారం, సెప్టెంబర్ 02, 2026

గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి

* దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూ కేటాయింపు

* ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కు ఆహ్వానం

* ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

దిక్సూచి ప్రతినిధి , న్యూ ఢిల్లీ: 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం భేటీ అయ్యారు.

 భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. స‌దస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.  ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. రక్షణ ఎక్స్‌పో లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌ని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు త‌మ ప్రభుత్వం ఎదురుచూస్తోందని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. 


రక్షణ ఎక్స్‌పో-2026ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహక‌రించాల‌న్నారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేయాల‌ని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగ‌స్వాములు కావాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.


హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. 


ఆదిలాబాద్ విమానాశ్ర‌యానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 750 ఎక‌రాలు భూ సేక‌ర‌ణ చేపట్టింద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ర‌క్ష‌ణ శాఖ కోరిన‌ట్లు మొత్తం 1500 ఎక‌రాలు కోరినందున‌, మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించే ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి అంగీకారం తెలిపారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్‌) ఆధ్వర్యంలో చేప‌ట్ట‌నున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్ప‌టికే టీజీఐఐసీ అంగీక‌రించింద‌ని రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవ‌స‌ర‌మైతే దానిని మ‌రో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర శ‌క్తి శాఖ మంత్రి జి.వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీలు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, డాక్ట‌ర్ మ‌ల్లు రవి, సురేశ్ షెట్కార్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ప్రొటోకాల్‌) హ‌ర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.

మంగళవారం, సెప్టెంబర్ 01, 2026

పేదల గుండెల్లో చెరగని ముద్ర.. వైఎస్ఆర్

 


నేడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి

దిక్సూచి, హైదరాబాద్‌:

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్‌) వర్ధంతి నేడు. 2009 సెప్టెంబర్‌ 2న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో వైఎస్ఆర్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆయన మరణించి 17 ఏళ్లు గడిచినా.. రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్‌ అందించిన పాలన, ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రైతులు–పేదల పట్ల ఆయన అనుసరించిన విధానం ఇప్పటికీ రాజకీయ చర్చల్లో కనిపిస్తూనే ఉన్నాయి.

పాదయాత్రతో ప్రజల్లోకి..

వైఎస్ఆర్‌ రాజకీయ ప్రస్థానంలో 2003లో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కీలక మలుపుగా నిలిచింది. మండుటెండల్లో వేల కిలోమీటర్లు నడుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, పేదల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

ఆ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన వైఎస్ఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాజ్యసభ నివాళి సందర్భంగా కూడా ఆయన పాదయాత్ర, రైతులు–బలహీన వర్గాల కోసం పనిచేసిన నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రైతే రాజు అన్న నినాదానికి ఆచరణ

2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్‌ తొలి రోజుల్లోనే రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే నిర్ణయం తీసుకున్నారు. రైతుల బకాయిలను మాఫీ చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు.

రైతులకు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జలయజ్ఞం ఆయన ప్రభుత్వానికి ప్రధాన కార్యక్రమంగా నిలిచింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు.

ఆరోగ్యం.. విద్యకు కొత్త దిశ

పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం భారంగా మారకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం వైఎస్ఆర్‌ పాలనలో కీలక నిర్ణయంగా గుర్తింపు పొందింది.

అదే సమయంలో ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి కార్యక్రమాలు అమలు చేశారు.

ఈ రెండు కార్యక్రమాలు తరువాతి ప్రభుత్వాల పాలనలో కూడా కొనసాగడం.. వాటి సామాజిక ప్రభావాన్ని సూచిస్తుందని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా పేర్కొంది.

సంక్షేమమే రాజకీయ బ్రాండ్‌గా..

వైఎస్ఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు రాజకీయానికి ప్రధాన అజెండాగా మారాయి. రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేదలకు గృహాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలు ఆయన పాలనకు గుర్తింపుగా నిలిచాయి.

ప్రజలతో ఆయనకు ఉన్న వ్యక్తిగత అనుబంధం కూడా వైఎస్ఆర్‌ రాజకీయ శైలిలో మరో ప్రత్యేకత. సాధారణ ప్రజలను ఆప్యాయంగా పలకరించడం, వారి సమస్యలను వినడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.

రాజకీయ ప్రత్యర్థులు.. విమర్శలు కూడా

అయితే వైఎస్ఆర్‌ పాలన పూర్తిగా వివాదరహితం కాదు. ఆయన ప్రభుత్వ కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, భూకేటాయింపులు, ప్రాజెక్టులు, పారిశ్రామిక అనుమతులపై రాజకీయ విమర్శలు వచ్చాయి. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలపై తరువాత దర్యాప్తులు, న్యాయపరమైన పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి.

అందువల్ల వైఎస్ఆర్‌ రాజకీయ వారసత్వాన్ని అంచనా వేయాలంటే కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా.. ఆయన పాలనపై వచ్చిన విమర్శలు, ఆర్థిక విధానాలు, పరిపాలనా నిర్ణయాలు, రాజకీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఆకస్మిక మరణం.. రాజకీయ ప్రకంపనలు

2009 సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన ప్రభుత్వ హెలికాప్టర్‌ నల్లమల ప్రాంతంలో అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య భారీ గాలులు, దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా భారీ శోధన చేపట్టారు. సెప్టెంబర్‌ 3న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు, అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు.

వైఎస్ఆర్‌ ఆకస్మిక మరణం అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను తీవ్రంగా కుదిపేసింది. ఆయన మృతితో కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. అనంతర కాలంలో వైఎస్ఆర్‌ రాజకీయ వారసత్వం చుట్టూ కొత్త రాజకీయ శక్తులు కూడా ఏర్పడ్డాయి.

తెలంగాణలోనూ ప్రత్యేక గుర్తింపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్‌కు తెలంగాణ ప్రాంతంలోనూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌, రైతు సంక్షేమం వంటి పథకాల లబ్ధిదారుల్లో ఆయన పాలనపై ఇప్పటికీ సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది.

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా పలు సందర్భాల్లో వైఎస్ఆర్‌ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, ఆయన పాలనలోని కొన్ని విధానాలను కొనసాగిస్తున్నామని చెబుతోంది.

ఒక నాయకుడు.. అనేక జ్ఞాపకాలు

వైఎస్ఆర్‌ను అభిమానించే వారికి ఆయన “మహానేత”. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన నాయకుడు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన ముఖ్యమంత్రి. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపిన నేత.

అయితే ఆయన రాజకీయ జీవితాన్ని విమర్శనాత్మకంగా చూసేవారికి ఆయన పాలనలోని కొన్ని నిర్ణయాలు, వివాదాలు కూడా గుర్తుకొస్తాయి.

కానీ ఒక విషయం మాత్రం స్పష్టం..

వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది.

అధికారంలో ఉన్న సమయం ఎక్కువ కాకపోయినా.. ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన కొన్ని సంక్షేమ విధానాలు, రైతు–పేదలతో ఆయన ఏర్పరచుకున్న అనుబంధం, ఆయన ఆకస్మిక మరణం కారణంగా వైఎస్ఆర్‌ రాజకీయ జ్ఞాపకం ఇప్పటికీ సజీవంగానే ఉంది.

వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్‌ను స్మరించుకోవడం అంటే.. ఒక వ్యక్తిని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు; సంక్షేమ రాజకీయాలు, రైతు సమస్యలు, పేదల ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక కీలక రాజకీయ ప్రయోగాన్ని మరోసారి చర్చించుకోవడం కూడా.



























FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026