ఇందిరా చౌక్‌లో భారీ కేక్ కట్.. పేదలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ
కరీంనగర్, సెప్టెంబర్ 5: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా చౌక్ వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బాణాసంచా కాల్చి, డీజే పాటలతో కాంగ్రెస్ శ్రేణులు సందడి చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రూపురెడ్డి కశ్యప్‌రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఆహార ప్యాకెట్లను డా. మేడిపల్లి సత్యం పేదలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిందన్నారు. ఈ కాలంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 1000 రోజుల్లో 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మిగిలిన ఖాళీలకు కూడా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు.
1000 రోజులుగా ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నిరాశతో విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్‌బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్, ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి