మంథని: మున్సిపల్ పరిధిలోని రావులచెరువు కట్ట ప్రాంతంలోని శ్రీ మంత్రకూట గోపిజన వల్లభ మందిరంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, వేదమూర్తులు అవుదానుల శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ.. ఈ మందిరం ఎంతో పవిత్రమైనదని, శ్రీకృష్ణుడి మహోన్నత మహిమకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ప్రతి కృష్ణాష్టమి రోజున స్వామివారికి ప్రత్యేకంగా వెన్నను నైవేద్యంగా సమర్పిస్తామని చెప్పారు. ఆ వెన్నను మూడు నెలల అనంతరం తిరిగి తీస్తామని, అప్పటివరకు అది కరగకుండా ముద్దగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది శ్రీకృష్ణుడి లీలా మహిమకు నిదర్శనమని, ఆలయంలో ఎన్నో అద్భుతాలను స్వయంగా చూశామని తెలిపారు.
కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించగా, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి