దిక్సూచి, మంథని:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం సేకరణతో పాటు విద్య, ఉద్యోగాల రంగంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను నాయకులు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, మెగా డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టిందని పేర్కొన్నారు.
‘మంథని అభివృద్ధికి శ్రీధర్‌బాబే దిక్సూచి’
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఓడేడు బ్రిడ్జి, మంథని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణాలపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మంథనిలో 50 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయం, వెజ్–నాన్‌వెజ్ మార్కెట్లు, విస్తృత రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతోందన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని నాయకులు హెచ్చరించారు. మంథని ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి