Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, జులై 13, 2026

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి

 


: సీపీ అంబర్ కిషోర్ ఝా

నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

దిక్సూచి, రామగుండం, జూలై 13: పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో సీపీ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలపై స్టేషన్ అధికారులను ఆన్‌లైన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

లాంగ్ పెండింగ్ కేసులు, పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ సూచించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ 2.0లో నమోదైన ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఎస్‌హెచ్‌ఓలు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి దశను నిర్ణీత సమయంలో సిస్టమ్‌లో అప్‌డేట్ చేయాలని, తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారాన్ని నమోదు చేయరాదని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసును గడువులోపు పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాపర్టీ నేరాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో స్థానిక పోలీసులు, సీసీఎస్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, మహిళలకు సంబంధించిన తీవ్రమైన కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వెంటనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్‌డీపీఎస్ కేసులు, కీలక పెండింగ్ నివేదికలను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.

గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పేకాట తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆస్తి, ఆర్థిక నేరాల్లో ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, అటాచ్‌మెంట్ ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, కేడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ప్రాపర్టీ ఆఫెండర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల్లో క్రిమినల్ అంశాలు ఉంటే వెంటనే కేసు నమోదు చేయాలని, ప్రతి ఫిర్యాదుపై పారదర్శక విచారణ జరిపి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ దేవాలయంతో సమానమని, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సీపీ సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించాలని, అరెస్టుల విషయంలో ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వవద్దని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

 

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్

గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సోమవారం పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, బీమా, రోడ్డు పన్నుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదని, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడరాదని హెచ్చరించారు. అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముందున్న వాహనాలను నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయకుండా రహదారికి ఎడమవైపున ప్రయాణించాలని సూచించారు.

జీబ్రా క్రాసింగ్‌లు, పాఠశాలల సమీప ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జే. రవీందర్, అధ్యాపకులు, విద్యార్థులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.



హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ గణేష్ అరెస్ట్

 


దిక్సూచి, బెల్లంపల్లి, జూలై 13: బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ రసబత్తుల గణేష్ (ఏ1)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ కేసులో ఇప్పటికే ఏ2 నుంచి ఏ5 వరకు నలుగురు నిందితులను జూలై 11న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గణేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుంచి దాడికి ఉపయోగించిన ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసు ఛేదన

కర్ణాటకకు చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు చూపిస్తున్న పోలీసులు

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితులు లతేశ్ మగ్గెకవల్ రంగన్న అలియాస్ లతేశ్ ఎం.ఆర్. (24), తండ్రి రంగన్న, హసన్ జిల్లా అరకలగూడ్ మండలం మగ్గెకవల్ శ్రీరాంపుర గ్రామానికి చెందినవాడు. మరో నిందితుడు సుదీప్ మగ్గెకవల్ శేఖర్ (24), తండ్రి శేఖర్, ఇదే గ్రామానికి చెందినవాడు.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు బాధితురాలిని జ్యోతిష్యం, ప్రత్యేక పూజల పేరుతో నమ్మించి, మాంగల్య దోషం తొలగిస్తామని విశ్వాసం కల్పించారు. అనంతరం పూజల పేరుతో ఆమె దృష్టి మరల్చి రెండు తులాల బంగారు పుస్తెల త్రాడు, రెండు గ్రాముల బంగారు కమ్మలను అపహరించారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన ఇతర కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలు అపరిచితుల మాటలను నమ్మి మోసపోవద్దని, జ్యోతిష్యం, పూజల పేరుతో దృష్టి మరల్చే ప్రయత్నాలు జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

శనివారం, జులై 11, 2026

మూగబోయిన కోకిల గానం

జానకమ్మ ఇక లేరు..

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక స్వర్ణయుగానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయనీ ఎస్. జానకి ఇక లేరు. ఎనిమిది దశాబ్దాల పాటు తన అపూర్వ గానమాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.

1957లో సినీ గానరంగంలో అడుగుపెట్టిన జానకమ్మ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. ప్రేమ, విరహం, భక్తి, జానపదం, శృంగారం, విషాదం... ఏ భావాన్నైనా తన గాత్రంలో జీవింపజేయడం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా "దక్షిణ భారత కోకిల" అని పిలిచేవారు.

తెలుగు సినీ సంగీతంలో ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల వంటి దిగ్గజాలతో కలిసి ఆమె ఆలపించిన ఎన్నో పాటలు నేటికీ ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉన్నాయి. సంగీత దర్శకులు చక్రవర్తి, కె.వి. మహదేవన్, ఇళయరాజా, ఎం.ఎం. కీరవాణి వంటి ప్రముఖుల స్వరాలకు ఆమె గాత్రం ప్రాణం పోసింది.

నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు ఆమెను వరించాయి. పురస్కారాల కంటే ప్రజల ప్రేమనే గొప్ప అవార్డుగా భావించిన జానకమ్మ తన నిరాడంబర వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జానకమ్మ మరణం ఒక గాయని మరణం మాత్రమే కాదు... ఒక సంగీత యుగానికి ముగింపు. కానీ ఆమె పాడిన ప్రతి పాట, ప్రతి స్వరం, ప్రతి భావం సంగీతాభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.

నేటి సాంకేతిక యుగంలో ఎన్నో గొంతులు వినిపిస్తున్నా, జానకమ్మలాంటి భావవ్యక్తీకరణ, పదాల స్పష్టత, రాగాలపై పట్టు, భాషలపై ఆధిపత్యం కలిగిన గాత్రాలు అరుదుగా కనిపిస్తున్నాయి. కొత్త తరానికి ఆమె పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు, సంగీతానికి ఒక పాఠశాల. కాలం మారినా, తరాలు మారినా, జానకమ్మ గానం మాత్రం భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

"గళం నిశ్శబ్దమైనా... గానం శాశ్వతం. జానకమ్మ పాటలు ఎప్పటికీ మన హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయి."

- సంతోష రూప

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

 

టీ-వర్క్స్‌లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

దిక్సూచి, హైదరాబాద్, జూలై 11,

*సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. జపాన్‌కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ (Toho Koki Seisakusho Co. Ltd.) సహకారంతో టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు*. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ లక్ష్య సాధనలో తాజాగా ప్రారంభించిన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో వాఫర్‌ను సమతలంగా మార్చేందుకు ఉపయోగించే ఈ సీఎంపీ ప్యాడ్లను ప్రస్తుతం పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ హబ్ ఏర్పాటుతో ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ తొలిసారిగా దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమలకు ఈ కేంద్రం ద్వారా శిక్షణతో పాటు పరిశోధనలు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యంతో వచ్చే 18 నుంచి 24 నెలల్లో సీఎంపీ ప్యాడ్లను దేశంలోనే తయారు చేసేలా సంయుక్త పరిశోధనలు చేపడతామని వివరించారు. సెమీకండక్టర్ రంగంలోని అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు జపాన్ లాంటి దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. పరిశోధన నుంచి చిప్‌ల తయారీ వరకు అవసరమైన సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి టకుయా నిషిమురా, జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ స్వస్తిక్ కులకర్ణి, ఇండోబాక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డైసుకే టాంజి, జపాన్ ఇండియా బిజినెస్ బ్యూరో ఛైర్మన్ షిగెమారో యాసుయి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-వర్క్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.




శుక్రవారం, జులై 10, 2026

తయారీ రంగానికి తెలంగాణ అనుకూలం

* రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి

* జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో భేటీలో మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, హైదరాబాద్, జూలై 10:

తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు*. పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బవేరియన్(జర్మనీ) మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్, రీజినల్ డెవలప్‌మెంట్ అండ్ ఎనర్జీ వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్‌హార్ట్ నేతృత్వంలోని జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం శుక్రవారం డా.బీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో ‘తెలంగాణ – జర్మనీ’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఏరో స్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ, ఏఐ, డిజిటల్ హెల్త్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, క్లీన్ ఎనర్జీ, జీసీసీలు, ఇండస్ట్రీ 4.o తదితర రంగాల్లో తెలంగాణలో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. అత్యాధునిక సాంకేతికత, పరిశోధన, ఇన్నోవేషన్, స్కిల్లింగ్‌కు ప్రాధాన్యమిస్తూ... ఈ రంగాల్లో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘తెలంగాణ–జర్మనీ’ మధ్య భాగస్వామ్యాన్ని పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలకూ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, హైదరాబాద్‌లో జర్మనీ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, బవేరియా ఆర్థిక శాఖ ఈడీ ఉల్రికే హాఫ్‌మన్, బవేరియా ఇండియా కార్యాలయ ఈడీ జాన్ కొట్టాయిల్ తదితరులు పాల్గొన్నారు.



గురువారం, జులై 09, 2026

మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్ధన్ రెడ్డి కి నివాళి


దిక్సూచి, మంథని, జూలై 10:

మాజీ MLC, మంథని మేధావి ,కవి, రచయిత నిరంతర రాజకీయ పోరాటయోధుడు స్వర్గీయ గీట్ల జనార్ధన్ రెడ్డి 88వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న గీట్ల విగ్రహానికి సీనియర్ న్యాయవాది రఘోత్తం  రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పిఎసిఎస్ డైరెక్టర్ ఆకుల రాజ బాపు, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గీట్ల జనార్ధన్ రెడ్డి  బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన లాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో జన్మించడం చాలా గర్వకారణం అని ఆయన ప్రజల కోసం నిత్యం తపన పడే వారని మంథని అభివృద్ధి చెందడానికి చాలా కృషి చేశారని ఆయన లాంటి వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

బాధితులకు మంత్రి పరామర్శ


దిక్సూచి, కరీంనగర్, జూలై, 10:

కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురిని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం రాత్రి పరామర్శించారు.

హైదరాబాద్ లో పలు సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నేరుగా కరీంనగర్ కు వచ్చి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నియోజక వర్గానికి చెందిన బాధితులను పరామర్శించి తిరిగి వెళ్లారు.

మంథని నుంచి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా గాడుదల గండి గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన కలకొండ తిరుపతిరెడ్డి, బట్టుపల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ ఆయిలీ రాజేశ్వరిని  కరీంనగర్‌లోని కే.సీ. డయాగ్నస్టిక్ సెంటర్ లో పరామర్శించారు.

అలాగే..

కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంథని పట్టణానికి చెందిన  నల్మాస్ ప్రభాకర్  వదిన రజిత అనారోగ్యంతో ఉండగా వారిని పరామర్శించారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకునీ, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న హరీష్​రావు

హైదరాబాద్ లో అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయరమణ రావు 


 
క‌న్నెప‌ల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఇవ్వొచ్చున‌ని హ‌రీష్ రావు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు 

కాళేశ్వ‌రం ప్రాజెక్టును ల‌క్షా నాలుగువేల కోట్లు పెట్టి నిర్మించిన రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల్గ‌లేదు.. 

ప్రాణ‌హిత కు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలోనే ప్రాణం పోశారు 

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రైతులను మోసం చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.38 వేల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని విమర్శించారు.

2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని, ఉమ్మడి రాష్ట్రంలో రూ.5,523 కోట్లు, అనంతరం కేసీఆర్ ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కూడా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును విరమించారని తెలిపారు. రూ.1.04 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఆశించిన ప్రయోజనం అందించలేదని ఆరోపించారు.

ప్రాణహిత ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూపం వచ్చిందని పేర్కొన్న ఆయన, బీఆర్ఎస్ పాలనలో నాలుగేళ్లలో కాళేశ్వరం ద్వారా కేవలం 162 టీఎంసీల నీటినే ఎత్తిపోశారని, అందులో 63 టీఎంసీలను తిరిగి నదిలోకి వదిలేశారని చెప్పారు. నికరంగా 74 టీఎంసీల నీటినే వినియోగించారని, ఎల్లంపల్లి నీటిని కూడా కాళేశ్వరం నీటిగా చూపించారని ఆరోపించారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచే ఉత్తర తెలంగాణకు నీరు అందించవచ్చని మాజీ మంత్రి హరీశ్ రావు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం బ్యారేజీలు పనికిరావని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఇచ్చిందని, 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ 19వ పిల్లర్ కుంగిపోయిన తర్వాత వచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు.

కాళేశ్వరం ద్వారా కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని, ఏ నియోజకవర్గానికి ఎంత నీరు అందిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల్లో ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.33,574 కోట్ల అసలు, రూ.417 కోట్ల వడ్డీ చెల్లించిందని, కేవలం 74 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూ.9 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు.

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లి జలాశయానికి తరలిస్తామని విజయరమణ రావు చెప్పారు. రైతులకు సాగునీరు అందించడం, కాళేశ్వరం బ్యారేజీల రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని అన్నారు.

భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

 


రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్

మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే

డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ సాంకేతికతతో పారదర్శక సర్వే

60 రోజులకు మించి భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు

రీ సర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి

భూముల రీ సర్వే, నక్ష భూములపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ శాఖ కార్యదర్శి

 

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 9:

 భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే,నక్ష భూముల అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. డీజీపీఎస్ ,రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు.రీసర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ఆయా గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయాలని సూచించారు. రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా సమగ్ర శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు.  జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.రీ సర్వే పూర్తయ్యే వరకు రెగ్యులర్ సర్వేయర్లలో 25 శాతం మందిని రొటేషన్ పద్ధతిలో విధుల్లో వినియోగించాలని తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పనితీరును శాఖ సర్వేయర్లు నిరంతరం పర్యవేక్షించాలని, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో రీ సర్వే నాణ్యతతో నిర్వహించాలని, సర్వేలో ఉపయోగించే ఆధునిక పరికరాల వినియోగాన్ని సాంకేతికంగా పర్యవేక్షించే వ్యవస్థ అందుబాటులో ఉందని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. రీ సర్వేలో పాల్గొనే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుందని తెలిపారు.భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో అసాధారణ జాప్యం పై ఉన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సాధారణ విధులు నిర్వహించడానికి కోర్టు ఆదేశాలు అవసరమా అని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతి అధికారి వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై హైకోర్టు  వివరణ కోరుతోందని, స్పందించేందుకు నాలుగు వారాల గడువు లభించిందన్నారు. రెవెన్యూ కార్యాలయంలోనూ భూ భారతి దరఖాస్తులు 60 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదని, పెండింగ్ దరఖాస్తులను అత్యంత త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,  జిల్లాలో రెండు కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాలకు పరిపాలనా అనుమతులు లభించాయని, ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ డిఆర్ఓ రాజేశ్వరి కలెక్టరేట్ ఏవో బి ప్రకాష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ సోమేశ్వర్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి

వీడియో కాన్ఫరెన్స్​లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,   ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు


పెద్దపల్లి కలెక్టరేట్​లో వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ శ్రీహర్ష,  జిల్లా అధికారులు


సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయవద్దు

తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను విస్తృతంగా ప్రోత్సహించాలి

జూలై 15 తర్వాత జలాశయాల నీటి నిల్వల ఆధారంగా పంటలపై రైతులకు మార్గదర్శకాలు

మహారాష్ట్ర, కర్ణాటక వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి

సూపర్ ఎల్‌నినోను పంటల వైవిధ్యీకరణకు అవకాశంగా మలుచుకోవాలి

వ్యవసాయం, సాగునీరు, వర్షపాతం పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్  

 

దిక్సూచి, పెద్దపల్లి జూలై  9:

సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జూలై 9 నాటికి రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, ఇప్పటివరకు ఎగువ రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రవాహం రాలేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తాగునీటికి మాత్రమే సరిపడా నీరు అందుబాటులో ఉందన్నారు. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇప్పటివరకు వరద రాలేదని, వచ్చే వారం రోజులపాటు భారీ వర్షాల అవకాశాలు లేవని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో ఆగస్టులో మాత్రమే సాధారణానికి సమీపంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, జూలైలో 25 శాతం, ఆగస్టులో 9 శాతం, సెప్టెంబరులో 42 శాతం, అక్టోబరులో 55 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే వరదలపైనే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఆధారపడి ఉందని, ఆ అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయని తెలిపారు. గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదలకు ప్రణాళికలు లేవని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని మంత్రి ఆదేశించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల పరిధిలో సాధ్యమైన మేరకు నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేయవద్దని స్పష్టమైన సందేశం ఇవ్వాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతు వేదికలు, ప్యాక్స్‌ల ద్వారా రైతులకు నీటి లభ్యత, వర్షపాతం అంచనాలపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి రైతు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పంటలు సాగు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం, జలాశయాల్లో నీటి కొరతపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,  వాతావరణం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులు, రైతులకు సమాచారం అందించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా విత్తనాల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జూలై 15 తర్వాత జలాశయాల్లో నీటి నిల్వలను సమీక్షించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరద పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తే వెంటనే నీటిని ఎత్తిపోసేలా పంపింగ్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని, అప్పటివరకు అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ,  సూపర్ ఎల్‌నినో పరిస్థితి వాస్తవమని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 132 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 55 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందన్నారు.

 జిల్లాలోని నీటి వనరుల పరిస్థితిని పరిశీలించి పంటల వైవిధ్యీకరణను విస్తృతంగా ప్రోత్సహించాలని, ఆయిల్‌పామ్, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకు అనుకూల పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, రైతులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బుధవారం, జులై 08, 2026

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్

– తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, హైదరాబాద్, జూలై 8:
మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట సిటీ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డా. వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.

వై.ఎస్.ఆర్ కు నివాళి

*వై.ఎస్.ఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన కొనసాగుతోంది

డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

*వైఎస్సార్ పోరాటస్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలి

దిక్సూచి, కరీంనగర్, జూలై 8:

*మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరై, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అతి చిన్న వయసులో శాసనసభకు ఎన్నికై మంత్రిగా పీసీసీ  అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సేవలు చేసినారు, 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడిన వ్యక్తి .. రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోనే సంక్షేమం అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారు, వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, మరి ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద కాలువల నిర్మాణం చేపట్టి రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి. వారి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ చొప్పదండి నియోజకవర్గం లో జేఎన్టీయూ లాంటి ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నేటికీ కీర్తించబడుతున్నారు, వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు అందించవలసి ఉండేది కానీ దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసముద్రంలో ముంచినారు, తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారు, రాజశేఖర్ రెడ్డి చూపిన పోరాటపటిమను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి,  ప్రజలకు వారు చేసిన సేవలను స్మరించుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న, బానోతు శ్రావన్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి ముదుగంటి,గంట శ్రీనివాస కళ్యాణి, కాంతాల జగన్ రెడ్డి,చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దిండిగాల మధు,మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజు కుమార్,కల్వల రామ్ చందర్,షబానా మహమ్మద్, పోరండ్ల  రమేష్,గడప శ్రీనివాస్, మంద మహేష్, శిల్ప, స్వప్నశ్రీ, అందే  శంకర్, తోట అంజయ్య, భారీ, మూల కృష్ణారెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, హైమద్, మహమ్మద్ చాంద్, గన్ను మహేందర్ రెడ్డి, హనీఫ్, జొన్నల రమేష్, ముక్క భాస్కర్, సత్తినేని శ్రీకాంత్, విక్టర్, శారద, కట్టెకోల ప్రభాకర్, జ్యోతి రెడ్డి, కాంపల్లి  కీర్తి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మంథని లో..

మంథని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గోట్కారి కిషన్ జి, గోపాల్ పూర్ మాజీ సర్పంచ్ గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రు రాజమల్లు మాట్లాడుతూ మహానేతను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది అలాగే మంథని ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు గాని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ లు, గ్రామ ఉప సర్పంచ్ లు, కౌన్సిలర్స్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌లో 27 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశం

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*37 మందిలో ఇంటర్వ్యూలలో 27 మంది ఎంపిక

*జూలై 22 నుంచి హైదరాబాద్‌లో మూడు నెలల ఉచిత శిక్షణ

*ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్న సంస్థ

*శిక్షణ అనంతరం ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యకు అవకాశం

*ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన  కలెక్టర్

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 8:

జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలలో 27 మంది విద్యార్థులు ఎంపికైనట్లు *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*  జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన మొత్తం 37 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 27 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

 ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) పెద్దపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) మంథని, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) పెద్దపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) గోదావరిఖని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మారం, మైనారిటీ జూనియర్ కళాశాల (బాలికలు) మంథని, మోడల్ స్కూల్ధర్యాపూర్ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి హైదరాబాద్‌లో మూడు నెలల పాటు ఉచిత భోజనం, వసతితో కూడిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

 పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ శిక్షణ ఉండనున్నదని చెప్పారు.

శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఉన్నత విద్యను కొనసాగించేందుకు కూడా కంపెనీ అవసరమైన సహకారం అందించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను జిల్లాకు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 27 మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి సంస్థలో మంచి ప్రతిభ కనబరచడంతో పాటు తమ కుటుంబాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన,జిల్లా యువజన  క్రీడల అధికారి సురేష్ ,గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హెచ్‌ఆర్ మేనేజర్ ఎం. ప్రభాకర్ రావు, హెచ్‌ఆర్ ప్రతినిధి ఖలీల్, , తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం, జులై 07, 2026

ప్రజల గుండెల్లో పదిలం.. రాజన్న

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు ప్రత్యేక స్థానం సంపాదించింది. రైతు, పేద, సామాన్యుడి కష్టాన్ని తన రాజకీయ అజెండాగా మార్చుకున్న నాయకుడిగా ఆయనను లక్షలాది మంది ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. అందుకే ప్రజలు ప్రేమగా ఆయనను “రాజన్న” అని పిలిచారు.

2003లో చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ జీవితానికి మలుపు తిప్పింది. గ్రామాల గుండా నడుస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆయన, 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పలు పథకాలను అమలు చేశారు.

ఆయన పాలనలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఉచిత విద్యుత్ రైతులకు ఊరట ఇచ్చింది. జలయజ్ఞం పేరుతో భారీ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారు. ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం, పెన్షన్ పథకాల విస్తరణ వంటి చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు బలమైన ఆదరణ తెచ్చిపెట్టాయి.

రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని మరో విశేషం ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేయడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది.

2009లో రెండోసారి ఘన విజయం సాధించిన కొద్ది కాలానికే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందడం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆ వార్త విన్న అనేక మంది అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన మరణానంతరం కూడా రాష్ట్ర రాజకీయాల్లో “రాజన్న” పేరు ప్రభావవంతంగానే కొనసాగింది.

నేడు ఆయనను అభిమానించే వారు ఒక మాట చెబుతుంటారు — “పదవి ముగిసింది కానీ ప్రజల హృదయాల్లో రాజన్న స్థానం ఎప్పటికీ చెరగదు.” అందుకే ఆయన పేరు ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయింది.

(దహగం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు)

గ్రీన్ టెక్నాలజీ పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం

గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

స్థిరమైన ఏఐ అభివృద్ధికి ప్రభుత్వం–పరిశ్రమల భాగస్వామ్యం కీలకం

దిక్సూచి, హైదరాబాద్, జూలై 8: 

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC)లో నిర్వహించిన **గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ (Green Growth Economic Summit - GGE)**లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొని స్థిరమైన కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు, సవాళ్లపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తక్కువ విద్యుత్ వినియోగం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం, పర్యావరణ హిత విధానాలు కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సుస్థిర ఏఐ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలంటే ప్రభుత్వాలు, పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు పరస్పర భాగస్వామ్యంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం సుస్థిర సాంకేతిక పెట్టుబడులకు రాష్ట్రాన్ని అత్యంత అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రగతిశీల విధానాలు, విశ్వసనీయ విద్యుత్ సరఫరా, అత్యాధునిక డిజిటల్ కనెక్టివిటీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలతో కూడిన యువశక్తి తెలంగాణ ప్రత్యేకతగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

హరిత అభివృద్ధి (Green Growth) మరియు బాధ్యతాయుత సాంకేతిక ఆవిష్కరణల ద్వారా కృత్రిమ మేధస్సు రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణతో పాటు సమగ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

తెలంగాణ–కెనడా భాగస్వామ్యానికి కొత్త ఊపు


కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక భేటీ

దిక్సూచి,  హైదరాబాద్, జూలై 8: 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర సచివాలయంలో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా తెలంగాణ–కెనడా మధ్య సాంకేతికత, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, పరిశోధన మరియు ఉన్నత విద్య వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక సదుపాయాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను మంత్రి శ్రీధర్ బాబు హైకమిషనర్‌కు వివరించారు. ఈ రంగాల్లో కెనడా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

కెనడాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో తెలంగాణ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ఇరువురు పరస్పర ప్రయోజనకరమైన కార్యక్రమాలను అమలు చేసి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ–కెనడా సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ నాయకుల చేరిక





కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు

దిక్సూచి, హైదరాబాద్, జూలై, 7:

హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్లో మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్ కుమార్ తో పాటు పాలకవర్గం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు 20 మందితో కలిసి మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో చేరారు. అనంతరం సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే మంథని నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర దిక్సూచి, విద్యావంతుడు నిరంతరం రాష్ట్ర మరియు మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారు అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం అందించి ఒక ఇంటి పెద్దకొడుకు లాగా అయిండని రోడ్లు ప్రభుత్వ హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు కల్పించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని  గారు అన్నారు.

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి

బడుగుల అభ్యున్నతి కోసం  కృషి చేసిన మహా నాయకుడు జగ్జీవన్ రామ్

డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  

 దిక్సూచి, కరీంనగర్, జూలై 6:

మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరై కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పుల అంజన్ ప్రసాద్ తో పాటు పలువురు నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం కార్యక్రమాన్ని విదేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా మరియు అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం,  పరిముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ .  ఇందిరాగాంధీ  ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో - పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి అనేక విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్, అయిన జీవించినంత కాలం ఈ దేశం కోసం, దళిత జాతి కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి ఈరోజు వర్ధంతి సందర్భంగా వారికి యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, వెన్న రాజ మల్లయ్య, సురేందర్ రెడ్డి, వంగల విద్యాసాగర్, కళ్ళపల్లి బాలరాజు, వెన్నం రజిత రెడ్డి, ఫహద్, కంకణాల అనిల్ కుమార్, మనోజ్, మాదాసు శ్రీనివాస్, జీడి రమేష్, ఇమ్రాన్, జూపాక సుదర్శన్, వీర దేవేందర్, ఇమ్రాన్ ఘని, సుంకరి గణపతి, సరిల్లా రతన్ రాజు, సత్తినేని శ్రీకాంత్, కిరణ్ రెడ్డి, షబానా మహమ్మద్ అనీఫ్, ఇమామ్, మాలోతు మహాలక్ష్మి, బషీరుద్దీన్, పాషా, శిల్ప, పెంట శేఖర్, కర్రె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026