కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక భేటీ
దిక్సూచి, హైదరాబాద్, జూలై 8:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర సచివాలయంలో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ–కెనడా మధ్య సాంకేతికత, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, పరిశోధన మరియు ఉన్నత విద్య వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక సదుపాయాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను మంత్రి శ్రీధర్ బాబు హైకమిషనర్కు వివరించారు. ఈ రంగాల్లో కెనడా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
కెనడాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో తెలంగాణ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో ఇరువురు పరస్పర ప్రయోజనకరమైన కార్యక్రమాలను అమలు చేసి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ–కెనడా సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి