రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు
*అధికారులు బాధ్యత, పారదర్శకతతో పని చేయాలి
*ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
*ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై శ్వేతపత్రం సిద్ధం చేయాలి
*యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికి ఆదర్శం.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి
*అభివృద్ధి పనులు, భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
*సన్న వడ్లు సాగు చేసి బోనస్ పొందాలి
* ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి
* జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
దిక్సూచి. పెద్దపల్లి, జూలై, 04:
సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
శనివారం పెద్దపల్లి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రోటోకాల్ & ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్ , ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పెద్దపెల్లి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఇరిగేషన్ , పంచాయతీరాజ్,పట్టణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, వైద్య శాఖ, విద్యా శాఖ, ఎస్సి, తీసి, మైనారిటీ సంక్షేమ శాఖ, పరిశ్రమల, రెవెన్యూ శాఖ, వి.బి.జి రామ్ జి, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా , అటవీ శాఖ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా పదవీకాలం ఉందని, ఈ కాలంలో ప్రతి అధికారి మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలని మంత్రి అన్నారు.
ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలను ఓపికగా వినాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి విసుగు లేకుండా ప్రతి దరఖాస్తును పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుల్లో లోపాలు ఉంటే లేదా ఏదైనా పని ఆలస్యం అవుతుంటే దానికి గల కారణాలను ప్రజలకు స్పష్టంగా, వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని ఆదేశించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. చిన్న సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. తెలిసి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా స్థాయిలో సమగ్ర శ్వేతపత్రం (వైట్ పేపర్) సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు, సూచన, అభిప్రాయం ప్రభుత్వానికి చేరేలా చర్యలు తీసుకోవాలని, వాటి ఆధారంగా లోపాలు, పెండింగ్ అంశాలు, బ్యాక్లాగ్లను గుర్తించి వెంటనే సరిదిద్దే కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా పరిపాలన, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నాయకత్వంలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సేవల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు.
రైతుల కోసం పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రతి అర్హ రైతుకు అవసరమైన సమయంలో యూరియా తప్పనిసరిగా అందేలా చూడాలని, అవసరం లేని వారికి యూరియా పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి పంటల సాగును విస్తరించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలోని రైతు వేదికల్లో ఆ ఏడు రకాల విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన విత్తన మేళా తరహాలో రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు రైతులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పంటలను పర్యవేక్షించాలని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని తెలిపారు.
అనధికారిక, నాణ్యతలేని విత్తనాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని, భూసేకరణ ప్రక్రియలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పారదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు.
*ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ,* వానాకాలంలో సన్న రకాల వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయం, గత ప్రభుత్వం రైతుబంధు కింద అందించిన మొత్తాన్ని మించిందని అన్నారు.
రైతులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సన్న రకాల వరిని సాగు చేసి అధిక లాభాలు పొందాలని పిలుపునిచ్చారు.
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏడు రకాల వరి వంగడాలను ప్రభుత్వం ముందుగానే గుర్తించి వాటికి బోనస్ ప్రకటించిందని తెలిపారు.
రైతులు కూడా ఆయా ఏడు రకాల వరి వంగడాలనే సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గతంలో రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత కూడా 45 రోజుల వరకు చెల్లింపులు అందని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తోందని తెలిపారు.
రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు నాణ్యమైన విత్తనాలతో ప్రభుత్వం సూచించిన వరి వంగడాలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ప్రభుత్వ విప్ పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ యూరియా యాప్ వినియోగంతో గత యాసంగిలో జిల్లాలో యూరియా వినియోగం 19 శాతం తగ్గిందని తెలిపారు. వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 21,126 మంది రైతులకు యాప్ ద్వారా 2,453 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని అన్నారు.
సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, గత మూడు సంవత్సరాల్లో 3,572 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా రూ.5.43 కోట్ల సబ్సిడీ అందించామని చెప్పారు.
పీఎం కుసుమ్ పథకం కింద నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎలిగేడు వద్ద ప్రపంచ స్థాయి గోదాముల నిర్మాణానికి భూమి కేటాయించామని తెలిపారు.
గత యాసంగిలో రికార్డు స్థాయిలో 65,129 మంది రైతుల నుంచి 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,057 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో 6,276 ఇళ్లను మంజూరు చేయగా 1,909 గృహప్రవేశాలు పూర్తయ్యాయని, రూ.130.24 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రెండో విడతకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందన్నారు.
మంచిర్యాల–వరంగల్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, మేడిపల్లి పరిశ్రమల పార్కు, శ్రీపాద మార్గం–మంథని నాలుగు లైన్ల రహదారి, పెద్దపల్లి బైపాస్ తదితర ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఎస్ఐఆర్లో 90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని చెప్పారు. అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రతి నెల ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 14 లక్షలకుపైగా ఉపాధి దినాలు కల్పించామని, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, ఉపాధి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన పనులను చేపట్టామని, చెరువుల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు.
వైద్య రంగంలో మంథని 50 పడకల ఆసుపత్రి, రామగుండం మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో అవార్డులు సాధించిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఓపీ, ఇన్పేషెంట్లు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.
ఎఫ్ఆర్ఎస్ ఆధారిత విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు పైలట్ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తూ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, మెగా జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు.
పోషకాహార లోపం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి ఫలించిందన్నారు.
పట్టణాభివృద్ధి కార్యక్రమాల కింద అమృత్–2.0, టీయూఎఫ్ఐడీసీ తదితర పథకాల ద్వారా తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ఎక్కువ శాతం పూర్తిచేశామని పేర్కొన్నారు.
సమీక్ష సమావేశానికి ముందు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఉద్యమ అమరవీరులు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణలో నూతన అంబులెన్స్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించి, ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించే దిశగా ఈ అంబులెన్స్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్ డి వో లు సురేష్, గంగయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎ. అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్. మల్లయ్య, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.