హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలిని (ట్రస్ట్ బోర్డు) అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ కొత్త పాలక మండలిలో మెట్రో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీ. విజయ రాజంకు సభ్యురాలిగా అవకాశం కల్పించింది. ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో పాటు పలువురు ప్రముఖులకు కూడా బోర్డులో స్థానం దక్కింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎం. సత్యనారాయణ రెడ్డిని పాలక మండలి ఛైర్మన్గా నియమించింది. సభ్యులుగా వినోద్ వెంకటస్వామి (ఎమ్మెల్యే), విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతామణి, ఎం. రాఘవేందర్ రావు, సీ. విజయ రాజంలను నామినేట్ చేసింది. అలాగే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ వ్యవస్థాపక ట్రస్టీ గా కొనసాగనున్నారు.
దేవస్థానం పాలనలో భాగంగా పలువురు ఉన్నతాధికారులు ఎక్స్-ఆఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (దేవాదాయ శాఖ) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, వైస్ చైర్మన్, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో), స్థానాచార్య సీనియర్ ప్రధాన అర్చకులు సభ్యులుగా ఉంటారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఛైర్మన్తో పాటు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం నియామక తేదీ నుంచి రెండేళ్లు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, ఏది ముందుగా అమల్లోకి వస్తే అప్పటి వరకు కొనసాగుతుంది. అయితే ఎక్స్-ఆఫిషియో సభ్యులు, వ్యవస్థాపక ట్రస్టీకి ఈ నిబంధన వర్తించదు.
కొత్తగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులతో పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయించే బాధ్యతను యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో)కి ప్రభుత్వం అప్పగించింది.
యాదాద్రి దేవస్థానం తెలంగాణలో అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఈ పాలక మండలి కీలక పాత్ర పోషించనుంది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి