సీపీ అంబర్ కిశోర్ ఝా
తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో కాళేశ్వరం జోన్‌కు 48 పతకాలు
దిక్సూచి, రామగుండం, జూలై 13: ప్రతిభ కలిగిన పోలీస్ క్రీడాకారులను శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏ పోటీల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏలోని 14 ఈవెంట్లు ఇటీవల విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధన, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం వల్లే ఈ స్థాయి విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం జోన్ క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.
పోలీస్ ఉద్యోగంలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్రీడలు ఈ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల నిర్వహణ వరకు ప్రతి బాధ్యతలో జట్టు సమన్వయం విజయానికి దోహదపడుతుందని చెప్పారు.
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని సమిష్టిగా పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, క్రీడలకు సమయం కేటాయించే పోలీస్ అధికారులు, సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ పోటీల్లో కాళేశ్వరం జోన్ నుంచి 51 మంది పాల్గొనగా, 31 మంది క్రీడాకారులు మొత్తం 48 పతకాలు సాధించారు. వీటిలో 8 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 24 కాంస్య పతకాలు ఉన్నాయి. పతక విజేతల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన నలుగురు, ములుగు జిల్లా నుంచి ముగ్గురు, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి తొమ్మిది మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 15 మంది ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, జూన్ సూపరింటెండెంట్ సందీప్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేష్, కాసిరామ్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి