ప్రజాప్రయోజనాల కోసం సొంత షాపును స్వచ్ఛందంగా తొలగించిన వైస్ చైర్మన్
దిక్సూచి, మంథని, జూలై 13: మంథని పట్టణ అభివృద్ధిలో కీలకమైన 100 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ పనులకు మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది.
పట్టణంలోని ప్రధాన రహదారిపై కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను మున్సిపల్ అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారు. రహదారి విస్తరణకు అవసరమైన స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి ప్రజాప్రయోజనాల దృష్ట్యా తన సొంత షాపును స్వచ్ఛందంగా తొలగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్తో కలిసి రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లక్ష్యంగా పెట్టుకున్న మంథని పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగానే ఈ రహదారి విస్తరణ చేపట్టినట్లు మున్సిపల్ ప్రతినిధులు తెలిపారు. రహదారి విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, వ్యాపారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి