కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరణ
దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరిలో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సమస్యలను విన్నారు. అందిన ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు చట్టపరంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతర్గం మండలం గోలివాడ గ్రామానికి చెందిన కాంపల్లి పద్మ తమకు సర్వే నంబర్ 243లో ఉన్న రెండు ఎకరాల ఒక గుంట భూమిని భర్త మరణానంతరం తమ పేరుపై వారసత్వ పట్టాగా మార్చారని, అయితే ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ చేయాలని కోరుతూ వినతి సమర్పించారు. దీనిపై సంబంధిత తహసీల్దార్‌కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
రామగుండం నగరంలోని లక్ష్మీపురానికి చెందిన మినుగు పృథ్వీరాజ్ మున్సిపల్ అధికారులు తమ నివాస గృహాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు కలెక్టర్ సూచించారు.
ధర్మారం మండలానికి చెందిన నూనె వెంకట నర్సయ్య బొమ్మారెడ్డి గ్రామ శివారులోని సర్వే నంబర్ 168/1లో ఉన్న తన 2 ఎకరాల 30 గుంటల భూమికి వెళ్లే దారిని కొందరు అడ్డుకుంటున్నారని, భూమి సరిహద్దు గుర్తులను తొలగించారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి