పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి. సతీష్ చంద్ర
దిక్సూచి, పెద్దపల్లి, జూలై 13: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం జిల్లా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి. సతీష్ చంద్ర సూచించారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో సాధారణంగా 237.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 206.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై 13 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయని, ఇంకా నాట్లు వేయని రైతులు 120 రోజుల స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకుని జూలై 15లోగా నాట్లు పూర్తి చేయాలని సూచించారు. జూలై 15 తర్వాత నాట్లు వేసే రైతులు తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) రకాన్ని సాగు చేయాలని తెలిపారు.
పత్తి రైతులు జూలై 20లోగా విత్తనాలు వేయడం పూర్తి చేయాలని, మట్టిలో తేమను పరిశీలించి విత్తనం వేయాలని సూచించారు. పత్తిలో బోర్డర్ పంటలు, అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు.
మొక్కజొన్న రైతులు 90 నుంచి 100 రోజుల స్వల్పకాలిక లేదా 100 నుంచి 110 రోజుల మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకుని జూలై 16 నుంచి 31 మధ్య విత్తనాలు వేయాలని సూచించారు.
తక్కువ వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంది, పెసర, మినుము, అలసంద, జొన్న, సజ్జ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని తెలిపారు. స్వల్పకాలిక పంటలను సాగు చేయడం ద్వారా నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టి, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని డాక్టర్ బి. సతీష్ చంద్ర సూచించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి