Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, ఆగస్టు 19, 2026

మంథనికి ఎంత చేసినా ప్రజల రుణం తీర్చుకోలేం

 

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు ప్రసంగం..


దిక్సూచి, మంథని: మంథని నియోజకవర్గానికి రూ.800 కోట్లు కాదు.. మరో రూ.800 కోట్లు ఇచ్చినా ఈ ప్రజల రుణం తీర్చుకోలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంథనిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

మంథని ప్రజల అదృష్టం కొద్దీ వారి ఎమ్మెల్యే, తమ అభిమాన నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. ఏదైనా సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని పనిని పూర్తి చేయగలిగిన నైపుణ్యం శ్రీధర్‌బాబుకు ఉందని ప్రశంసించారు.

తనకు శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావుతో కలిసి అసెంబ్లీలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేశారు. శాసనసభ స్పీకర్‌గా ఎలా ఉండాలి, ఎలాంటి విలువలు, నైతిక బాధ్యతలతో వ్యవహరించాలి అనే విషయాలను శ్రీపాదరావును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన శ్రీపాదరావు వారసత్వాన్ని శ్రీధర్‌బాబు కొనసాగిస్తున్నారని చెప్పారు.

శ్రీధర్‌బాబు ఏ ముఖ్యమంత్రి హయాంలో ఉన్నా మంథని అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని తుమ్మల అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల సమయంలోనూ మంథని ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పట్టుదలతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేరుగా చెప్పడం కంటే శ్రీధర్‌బాబుకు సమస్యను చెప్పి పరిష్కారం పొందుతున్నామని అన్నారు.

శ్రీధర్‌బాబును ప్రజలు మరింతకాలం ఆశీర్వదించాలని తుమ్మల కోరారు. ఆయన మాటకు, గౌరవానికి, ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా వేదికపై ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. శ్రీధర్‌బాబు అప్పగించే అభివృద్ధి పనులను నాణ్యతతో, నిజాయితీగా, నిబద్ధతతో పూర్తి చేసి ఆయనకు ఎక్కడా మచ్చ రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్‌ శ్రీధర్‌బాబుకు కుడిభుజంలా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రిని సైతం నిలదీసి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అడగగలిగే నాయకుడని కొనియాడారు. అందుకే ఆయనను మరోసారి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు.

అదేవిధంగా యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్‌లో పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలను బలంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి వారసుడిగా వంశీకృష్ణ తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

ప్రజలు ఎన్నుకున్న శ్రీధర్‌బాబు, వంశీకృష్ణ వంటి నాయకులు తమ పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టి మరింత మెరుగ్గా పనిచేయాలని తుమ్మల ఆకాంక్షించారు. మంథని ప్రాంత అభివృద్ధిలో అందరూ భాగస్వాములై, ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

DIKHSOOCHI EPAPER 20.08.2026


 

మంగళవారం, ఆగస్టు 18, 2026

కళ్యాణం బహుముఖ ప్రజ్ఞ


సాహిత్యం, యానిమేషన్, చిత్రకళ, కృత్రిమ మేధ రంగాలలో బహుముఖ సేవలు

అమెరికన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్‌తో  మరో మైలురాయి 

కరీంనగర్ కు వన్నెతెస్తున్న శ్రీనివాస్


దిక్సూచి, కరీంనగర్ :

సాహిత్యం, చిత్రకళ, జర్నలిజం, కార్టూనింగ్, అనిమేషన్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంగీతం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్ నిర్మాణం... ఇలా ఒకే వ్యక్తిలో అనేక ప్రతిభలు మిళితమైన అరుదైన సృజనకారుడు కల్యాణం శ్రీనివాస్. తెలుగు సాహిత్యం, కళలు, అనిమేషన్ మరియు AI ఆధారిత సృజనాత్మక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ

గ్లోబల్ అచివర్స్ కౌన్సిల్, సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ (Global Achievers Council, South Western American University) సంయుక్తంగా ఆయనకు తెలుగు సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.  సాహిత్యంతో ప్రారంభమైన  శ్రీనివాస్ ప్రయాణం క్రమంగా విభిన్న రంగాలకు విస్తరించింది. చిన్ననాటి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న కల్యాణం శ్రీనివాస్ పదో తరగతి నుంచే కవిత్వ రచన ప్రారంభించారు. అనంతరం బి.ఏ. లిటరేచర్ పూర్తి చేసి,ఎం.ఏ. తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే "హృదయమన గేయ సంపుటి", "పిడికిలి కవితా సంపుటి" అనే రెండు పుస్తకాలను ప్రచురించి రచయితగా గుర్తింపు పొందారు. ఆయన రచించిన అనేక గేయాలు వివిధ వేదికల ద్వారా ప్రజల్లోకి చేరాయి.  200కు పైగా పుస్తకాలకు ముఖ చిత్రాలు వేయడం ద్వారా ప్రతిభావంతమైన చిత్రకారుడిగా ఆయన విశేష గుర్తింపు పొందారు.తద్వార  అనేక మంది రచయితల రచనలకు కళాత్మక రూపాన్ని అందించారు. 

జర్నలిజంపై ఆసక్తితో.. 

ఈనాడు, ఆంధ్రప్రభ దినపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు. అదే సమయంలో రాజకీయ కార్టూనిస్టుగా కూడా సేవలందిస్తూ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో కార్టూన్లు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు.  సంప్రదాయ 2D అనిమేషన్‌లో రెండు దశాబ్దాల అనుభవం సాధించారు.1996లో లక్ష్మీపతి స్కాలర్‌షిప్ లభించడంతో హైదరాబాద్‌లో అనిమేషన్ కోర్సు పూర్తి చేసిన ఆయన, అనంతరం దాదాపు 20 సంవత్సరాలకు పైగా Traditional 2D Animation Director గా అనిమేషన్ పరిశ్రమలో పనిచేశారు. సినిమా భాష, విజువల్ స్టోరీటెల్లింగ్, షాట్ కంపోజిషన్, స్క్రీన్‌ప్లే, కెమెరా వ్యాకరణం, ఎడిటింగ్ తదితర అంశాలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. 


అనిమేషన్ రంగంలో పనిచేస్తున్న సమయంలో "Lady Luck" అనే ప్రముఖ అనిమేషన్ సిరీస్‌లో సాధారణంగా 20 మంది సీనియర్ అనిమేటర్లు కలిసి రూపొందించాల్సిన ఒక పూర్తి ఎపిసోడ్‌ను, కల్యాణం శ్రీనివాస్ ఒక్కరే కేవలం 22 రోజుల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ అసాధారణ ప్రతిభను గుర్తించిన కెనడాకు చెందిన అంబర్ వుడ్(Amberwood Entertainment) సంస్థ ఆయనకు ప్రత్యేక ప్రశంసా పత్రం ప్రదానం చేసింది. ఈ ఘనత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అనిమేషన్, చిత్రకళ, కార్టూనింగ్ రంగాల్లో ఆయనకు అనేక అవార్డులు, ప్రశంసలు, సన్మానాలు లభించాయి.  


సంప్రదాయ సినీ నిర్మాణంపై ఉన్న అనుభవాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ, గత ఏడాది నుంచి AI ఆధారిత ఫిల్మ్ మేకింగ్ పై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వివిధ AI టూల్స్‌ను అధ్యయనం చేస్తూ, వాటి సామర్థ్యాలు, పరిమితులు, పూర్తి స్థాయి సినిమా నిర్మాణంలో వాటి వినియోగంపై నిరంతరం ప్రయోగాలు చేస్తున్నారు. AI ద్వారా సినిమా నిర్మాణానికి సంబంధించిన తన అనుభవాన్ని యూట్యూబ్, శిక్షణ కార్యక్రమాలు,ఇతర వేదికల ద్వారా వేలాది మందితో పంచుకుంటున్నారు.  AI సాంకేతికతను వినూత్నంగా వినియోగిస్తూ "పారిజాత" అనే  ఇన్‌ఫ్లూయెన్సర్‌ను సృష్టించి, ఆమెను కథానాయికగా ఉపయోగిస్తూ సంగీత వీడియోలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 50కు పైగా తెలుగు పాటలకు స్వయంగా సాహిత్యం రచించి, AI ద్వారా సంగీతాన్ని రూపొందించి, అదే AI సాంకేతికతతో ఫోటోరియలిస్టిక్ విజువల్స్‌ను సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన పాటల్లో "శ్రీ రాముడు మాదేవుడు", "ఏములాడ గుళ్లల్లా", "ఎండయ్యో శివయ్య", "అమ్మ పాట", "పార్వతే సతి జంగమా", "దూదు బసవన్నలు", "బతుకమ్మ పాట", "సంక్రాంతి పాట", "కొడుకుల్లారా", "ఎవరికీ అర్థం కాదు", "ఇంత సొగసు ఎక్కడిది", "యాదికొస్తావే", "మందు బాబులు", "సాఫ్ట్‌వేర్ సత్తి" వంటి అనేక గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి.

AI సంగీతాన్ని కేవలం తన సృజనలకు మాత్రమే పరిమితం చేయకుండా, అమెరికా, సింగపూర్, దుబాయ్, జాంబియా దేశాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది సాహితీవేత్తల పాటలకు పూర్తిగా ఉచితంగా AI సంగీతాన్ని అందిస్తూ వారి రచనలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రచురణలు, సంగీత రూపం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది సాహితీవేత్తల రచనలు ప్రజల్లోకి చేరడమే కాకుండా, స్థబ్దంగా ఉన్న వారి సాహిత్య సృజనకు కొత్త ఊపునిచ్చారు. AI సంగీతం ద్వారా కొత్త తరం రచయితలు, కవులు, గేయరచయితలను ప్రోత్సహిస్తూ సాహిత్య సేవలో విశేష పాత్ర పోషిస్తున్నారు. 

సాంకేతికతను ప్రతి తెలుగు వ్యక్తికి చేరవేయాలనే లక్ష్యంతో "AI Video Making Telugu" పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా AI సంగీతం, AI వీడియోలు, AI షార్ట్ ఫిల్మ్స్, AI సినిమా నిర్మాణం, ఆధునిక AI టూల్స్ వినియోగంపై వేలాది మందికి సులభమైన తెలుగులో అవగాహన కల్పిస్తున్నారు.

AI రంగంలో శిక్షణను మరింత విస్తరించేందుకు "Kalyanam Srinivas AI Film Making Academy" సంస్థను స్థాపించారు. AI Music, AI Film Making, AI Storytelling, Prompt Engineering, AI Visual Design, AI Short Films, AI Feature Film Production వంటి విభాగాల్లో సమగ్ర శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు యువతను ప్రపంచ స్థాయి AI సినీ సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ అకాడమీని అభివృద్ధి చేస్తున్నారు. 

ఇటీవల "వందే మాతరం" పేరుతో నిర్వహించిన AI షార్ట్ ఫిల్మ్ పోటీలో ఐదు నిమిషాల నిడివి గల AI షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించి విశేష ప్రశంసలు అందుకున్నారు. ఈ కృతికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అభినందన పత్రాన్ని అందుకున్నారు. అలాగే POCSO చట్టంపై అవగాహన కల్పించే ఐదు నిమిషాల AI షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే "శ్మశానం" అనే మరో AI షార్ట్ ఫిల్మ్‌ను కూడా నిర్మించారు. ప్రస్తుతం "మాయపుటలు" పేరుతో AI వెబ్ సిరీస్ నిర్మాణంలో నిమగ్నమై ఉన్న కల్యాణం శ్రీనివాస్, పూర్తిస్థాయి AI ఫీచర్ ఫిల్మ్ నిర్మాణానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, విజువల్ డిజైన్, పాత్రలు, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు AI సాంకేతికతను సమగ్రంగా వినియోగిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.   

సాహిత్యం, కళలు, జర్నలిజం, చిత్రకళ, అనిమేషన్, AI సంగీతం, AI సినిమా నిర్మాణం, సాంకేతిక విద్య ప్రచారం, యువతకు శిక్షణ ఇలా అనేక రంగాల్లో కల్యాణం శ్రీనివాస్ అందించిన సేవలకు గుర్తింపుగా  గ్లోబల్ అచివర్స్ కౌన్సిల్,సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ ఆయనకు  గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల సాహిత్య, కళా, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సంప్రదాయ కళలను ఆధునిక కృత్రిమ మేధస్సుతో మేళవిస్తూ, తెలుగు సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్న కల్యాణం శ్రీనివాస్ ప్రయాణం, నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.



నేడు మంథనిలో మంత్రుల పర్యటన

 

దిక్సూచి, మంథని, ఆగస్టు 18: మంథని నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రజా సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభిస్తారు. అనంతరం 12.45 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మంథని గంగాపురి వద్ద ఎన్‌ఏసీ స్కిల్ డెవలప్‌మెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 2.40 గంటలకు మంథని పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద నాలుగు మండలాల్లోని మైదుపల్లి, ఎక్లాస్‌పూర్, గుంజపడుగు, అడవి సోమనపల్లి, కేశనపల్లి, మచ్చుపేట, సుందిళ్ల, కమాన్‌పూర్, రాణాపూర్ గ్రామాలకు సీఎస్‌ఆర్ నిధులతో మంజూరైన తొమ్మిది వైకుంఠ రథాలను ప్రారంభిస్తారు.  మధ్యాహ్నం 3 గంటలకు మంథని బస్‌డిపో వద్ద రూ.164.64 కోట్లతో చేపట్టనున్న పలు రోడ్ల అభివృద్ధి పనులకు రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇందులో మంథని పట్టణంలో డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ, ఇతర వార్డుల రోడ్ల అభివృద్ధి పనులతో పాటు మంథని డిపో–డిగ్రీ కళాశాల రోడ్డు, డిపో–గోదావరి నాలుగు లేన్ల రోడ్డు, సూరయ్యపల్లి–కాకర్లపల్లి–సీతంపేట రోడ్డు, గుంజపడుగు–ఉప్పట్ల–విలోచవరం రోడ్డు, కూనారం–ముత్తారం రోడ్డు పనులు ఉన్నాయి. సాయంత్రం 3.30 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా నాలుగు మండలాలకు సంబంధించిన రేషన్ (స్మార్ట్) కార్డులు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.


ఖర్గేను అవమానించడంపై నిరసన


దిక్సూచి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొని బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌లో ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు ‘శుద్ధీకరణ’ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడం వంటి చర్యలు కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని శ్రీనుబాబు విమర్శించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ బీజేపీ వైఖరిని ఖండించారు.

సంగారెడ్డిలోని ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనుబాబు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.



కర్ణాటక ముఖ్యమంత్రితో శ్రీధర్​బాబు భేటీ


 దిక్సూచి, బెంగళూరు: 

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంతోషంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, హజ్, వక్ఫ్ శాఖ మంత్రి యూటీ ఖాదర్, భారీ–మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌తోనూ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమలు, మౌలిక వసతులు, వైద్య–ఆరోగ్య రంగాల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకుని, భవిష్యత్తులోనూ పరస్పర సహకారాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు.

శనివారం, ఆగస్టు 15, 2026

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

దేశభక్తిని చాటిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. 

మహిళా సంఘాలకు రూ.280 కోట్లకు పైగా ఆర్థికసాయం

దిక్సూచి ప్రతినిధి, హైదరాబాద్: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసు సిబ్బంది మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, ప్రజలకు మంత్రి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు జిల్లాలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు.

సంక్షేమ పథకాలపై శకటాలు.. అభివృద్ధి ప్రదర్శనలు

వేడుకల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి, అటవీ, హౌసింగ్, సంక్షేమ, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్యం, విద్య, అగ్నిమాపక, ఐసీడీఎస్ తదితర శాఖలు ఏర్పాటు చేసిన శకటాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు తిలకించారు.

అనంతరం పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉద్యానవన, పౌరసరఫరాలు, విద్యుత్ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను అధికారులు మంత్రికి వివరించారు.

ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు

జిల్లా పరిపాలనలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వై. నితిన్‌తో పాటు ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

మహిళా సంఘాలకు రూ.280 కోట్లకు పైగా ఆర్థిక సహాయం

మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంలో భాగంగా గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.261.52 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అదేవిధంగా మెప్మా పరిధిలోని పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.18.78 కోట్ల విలువైన చెక్కులను అందించారు.

మొత్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.280.30 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. మహిళలు కుటుంబ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించేలా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

దేశభక్తిని చాటిన చిన్నారులు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కేజీబీవీ మహేశ్వరం, ఏవీఎన్ ఇంటర్నేషనల్ స్కూల్, టీఎస్ మోడల్ స్కూల్ నేదునూర్, వివేక విద్యా భారతి ఆమనగల్, జడ్‌పీహెచ్‌ఎస్ తుక్కుగూడ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ప్రదర్శనలు ముగిసిన అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.


ఘనంగా ముగిసిన వేడుకలు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్. రెడ్డి, శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు డాక్టర్ కె. కిరణ్మయి, చంద్రా రెడ్డి, శంషాబాద్ డీసీపీ బి. రాజేష్, జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, కలెక్టరేట్ ఏఓ సునీల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

శుక్రవారం, ఆగస్టు 14, 2026

తెలంగాణ ముద్దుబిడ్డ – సువర్ణ ప్రభాకర్

స్వాతంత్య్ర సమరయోధుడు ప్రభాకర్ చీఫ్ ఇంజనీర్‌

దిక్సూచి ప్రత్యేక కథనం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని మండలానికి చెందిన ప్రభాకర్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజాహితవాదిగా, పరిపాలనా రంగంలోనూ విశిష్ట సేవలు అందించిన అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో జీవితాన్ని ప్రారంభించి, అనంతరం ప్రభుత్వ సేవలో ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజానికి సేవలందించిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

స్వాతంత్ర్యోద్యమంలో తొలి అడుగులు

కరీంనగర్ జిల్లా మంథని పట్టణంలో 1930 జనవరి 12న ప్రభాకర్ జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన అనంతరం 1947లో స్వాతంత్ర్యోద్యమ ప్రభావంతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల్లో పాల్గొని జాతీయ భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి చేశారు.

“స్వేచ్ఛాభారతం గళం ఎక్కడ వినిపించినా అక్కడ ప్రభాకర్ ఉండేవారు” అని సమకాలీనులు పేర్కొనేవారని పాత తరాల వారు గుర్తు చేసుకుంటారు.

సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర

నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న అణచివేత, వెట్టిచాకిరీ, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభాకర్ చురుకైన పాత్ర పోషించారు. గోదావరిఖని, మంథని, రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.

1947–48 మధ్యకాలంలో జరిగిన పోరాటాల్లో పాల్గొని నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లారు. గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేసి స్వేచ్ఛా భావాలను వ్యాప్తి చేయడంలో ముందుండేవారు.

ఉన్నత విద్య – ఇంజనీరింగ్ రంగంలో ప్రస్థానం

స్వాతంత్ర్యానంతరం విద్యను కొనసాగించిన ప్రభాకర్ ఇంజనీరింగ్‌ రంగాన్ని ఎంచుకున్నారు. ఉన్నత విద్యను పూర్తిచేసి ప్రభుత్వ సేవలో చేరారు. ప్రతిభ, కృషి, నిబద్ధతతో ఇరిగేషన్ శాఖలో ఎదుగుతూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

1955లో డిప్యూటీ ఇంజనీర్‌గా సేవలు ప్రారంభించిన ఆయన, 1964లో కార్యనిర్వాహక ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

చీఫ్ ఇంజనీర్‌గా సేవలు

ప్రభాకర్ చీఫ్ ఇంజనీర్‌గా నియమితులై రాష్ట్ర జలవనరుల అభివృద్ధికి విశేష కృషి చేశారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి నీటి సరఫరా అంశంలోనూ ఆయన సేవలు గుర్తింపు పొందాయి. వివిధ సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన సాంకేతిక నైపుణ్యం ప్రశంసలు అందుకుంది.

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యతను మేళవించి పనిచేసిన అధికారి అనే పేరును సంపాదించారు.

ప్రజా జీవితంలోనూ సేవ

ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ సేవలో కొనసాగారు. గ్రామీణాభివృద్ధి, సాగునీటి వనరుల పరిరక్షణ, రైతుల సంక్షేమం వంటి అంశాలపై నిరంతరం కృషి చేశారు.

1986లో పలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొని యువతకు మార్గనిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమై జీవించిన ఆయనను మంథని ప్రాంత ప్రజలు ఇప్పటికీ గౌరవంతో స్మరించుకుంటున్నారు.

తెలంగాణకు గర్వకారణం

స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రారంభమైన ప్రభాకర్ ప్రస్థానం, చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఉద్యమ స్ఫూర్తి, ప్రజాసేవ, పరిపాలనా సామర్థ్యం కలగలిపిన అరుదైన వ్యక్తిత్వంగా ఆయన నిలిచారు.

“స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడు... అభివృద్ధికి బాటలు వేసిన ఇంజనీర్... ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రభాకర్” అని మంథని ప్రాంత ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు.

– దిక్సూచి ప్రత్యేక కథనం

గోదావరి పుష్కర పనులు వచ్చే నెల ప్రారంభించాలి


* ఆగస్టు చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే

* నాణ్యతలో రాజీ పడొద్దు... ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి

* గోదావరి పుష్కరాలు – 2027' కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

దిక్సూచి, హైదరాబాద్​:

గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆ మేరకు టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డా.బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆయన అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినేట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేబినేట్ సబ్ కమిటీ ఛైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లు కేటాయించిందన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో... ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా అని... నాణ్యతలో రాజీ పడొద్దని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. వర్క్ ప్రోగ్రెస్ ను రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమష్ఠిగా పని చేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతం అవుతాయన్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలన్నారు. ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ మిస్ అయితే వెంటనే గుర్తించి, లోకల్ ఫండ్స్ నుంచి పనులు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను పుష్కర ఏర్పాట్లలో తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కేబినేట్ సబ్ కమిటీ సభ్యుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని... అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పుష్కర ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మంథని గడ్డపై స్వాతంత్య్ర సమర జ్వాలలు


సత్యాగ్రహం నుంచి సాయుధ పోరాటం వరకు.. నిజాం మెడలు వంచిన మంథని యోధులు

మంథని ప్రాంత స్వాతంత్య్ర–నిజాం వ్యతిరేక పోరాట యోధులు

సాయుధ పోరాటంలో పాల్గొన్నవారు

1. గులుకోట శ్రీరాములు


మంథని ప్రాంత సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ప్రముఖ యోధుడు. రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో పోరాటంలోకి వచ్చారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ (చాందా) ప్రాంతంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి యోధులకు శిక్షణ ఇప్పించినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. 1948లో కాళేశ్వరం, మహదేవపూర్‌, దామెరకుంట ప్రాంతాల్లో నిజాం పోలీసు స్థావరాలపై దాడుల్లో ఆయన బృందం పాల్గొంది. అనంతరం 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి ఎన్నికై మొదటి ఎమ్మెల్యేగా నిలిచారు.

2. పనకంటి కిషన్‌రావు


గులుకోట శ్రీరాములు నాయకత్వంలోని సాయుధ దళంలో పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్​ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా  పనిచేశారు.

3. సువర్ణ ప్రభాకర్

శ్రీరాములు బృందంతో కలిసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖలో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు.

4. చొప్పకట్ల చంటయ్య


సాయుధ పోరాటంలో పాల్గొని, అనంతరం డాక్టర్​గా విశేష సేవలందించారు.

5. డి. రాజన్న

6. రాంపెల్లి కిష్టయ్య



7. దామోదర్‌ థామన్​

8. శివనాద్రి శంకరయ్య గుప్త

9. నరహరి

10. ఎలిశెట్టి సీతారాం


వీరంతా గులుకోట శ్రీరాములు నాయకత్వంలో మంథని–మహదేవపూర్‌ ప్రాంతాల్లో జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్నట్లు 2025లో ప్రచురితమైన చారిత్రక కథనం పేర్కొంటోంది.


సత్యాగ్రహ ఉద్యమంలో మంథని యోధులు

11. రఘునాథ్‌ కాచే

మంథని ప్రాంతంలో నిజాం వ్యతిరేక సత్యాగ్రహ ఉద్యమానికి ప్రముఖ నాయకుడిగా రఘునాథ్‌ కాచే పేరు కనిపిస్తోంది. స్థానిక చారిత్రక ఆధారాల ప్రకారం కరీంనగర్‌ జిల్లాలో తొలి సత్యాగ్రహం చేసిన వారిలో ఆయన ప్రముఖుడు. స్వామి రామానంద తీర్థ పిలుపుతో ప్రజలను చైతన్యవంతం చేశారు.

ఆయన నాయకత్వంలో:

12. పి. గణపతిరావు
13. అవధానుల కిష్టయ్య


14. ఎం. గణపతి
15. మురళీధర్‌ కాచే
16. దేవళ్ల రాజేశ్వరరావు
17. గట్టు రామన్న
18. వెంకటరాజన్న
19. ఎస్. నర్సింహులు
20. వడవత విఠల్​రావు
21.  

నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నట్లు ఆధారాలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు జైలు శిక్ష కూడా అనుభవించారు.

 మంథని ఉద్యమాన్ని కేవలం పట్టణానికి పరిమితం చేయలేం. అప్పటి మంథని తాలూకా పరిధిలోని మహదేవపూర్‌, దామెరకుంట తదితర ప్రాంతాల్లోనూ ఉద్యమం తీవ్రంగా సాగింది.

దామెరకుంటకు చెందిన:

  • రాగం వెంకటయ్య
  • ఐత చిన్న పోచిరెడ్డి
  • పెద్ద పోచిరెడ్డి
  • ఐత రాజిరెడ్డి
  • బాసాని బక్కరాజయ్య
  • కోడిపల్లి వెంకటయ్య

తదితరులు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి.

ఐత చిన్న పోచిరెడ్డిని కాటారం మండలంలోని ధన్వాడ వద్ద రజాకార్ల దళాలు హతమార్చినట్లు కూడా అదే ఆధారం పేర్కొంటోంది.

మంథని ప్రాంత ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధాన కారణం సత్యాగ్రహంతో పాటు సాయుధ పోరాటం కూడా సాగడం. చంద్రాపూర్‌ ప్రాంతంలో శిక్షణ పొందిన శ్రీరాములు బృందం గోదావరి దాటి నిజాం సంస్థానంలోని గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహించింది. కాళేశ్వరం, మహదేవపూర్‌, దామెరకుంట ప్రాంతాల్లోని పోలీస్‌ స్థావరాలపై దాడులు జరిపినట్లు స్థానిక చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.  కాళేశ్వరం పోలీస్‌ ఔట్‌పోస్ట్‌పై జరిగిన దాడిలో గులుకోట శ్రీరాములు కాలికి తుపాకీ తూటా తగిలినా పోరాటాన్ని కొనసాగించారు.   నిజాం పాలనలో జాతీయ జెండా ఎగురవేయడం కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో, మంథని ప్రాంత ఉద్యమకారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 1948లో నిజాం పాలన అంతమైన తర్వాత మంథనిలో జరిగిన బహిరంగ సభలో రఘునాథ్‌ కాచే ఆధ్వర్యంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు స్థానిక చారిత్రక కథనం పేర్కొంటోంది.  మంథని స్వాతంత్య్రోద్యమ చరిత్ర 1940లతోనే మొదలైనది కాదు. స్థానిక చారిత్రక కథనాల ప్రకారం 1908లో సువర్ణ రఘురామయ్య, మార్పాక శేషయ్య తదితరులు మంథనిలో గణపతి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా జాతీయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాలు ప్రజలను ఒకచోట చేర్చే సామాజిక వేదికలుగా మారాయి. హైదరాబాద్‌ సంస్థానంలో ప్రజాస్వామ్యం, భారత యూనియన్‌లో విలీనం కోసం జరిగిన ఉద్యమానికి 1947–48లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ కూడా కీలకంగా పనిచేసింది; 1947 ఆగస్టు 7న “Join Indian Union” కార్యక్రమానికి పిలుపునిచ్చి జెండా ఎగురవేతలు, నిరసనలు నిర్వహించింది.

 

గురువారం, ఆగస్టు 13, 2026

కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడిగా అయిలి ప్రసాద్

* సరైన నాయకునికి మరోసారి అవకాశం
దిక్సూచి, మంథని:
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా అయిలి ప్రసాద్ రెండోసారి ఎన్నికయ్యారు, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఆయనకు మరోసారి ఈ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అయిలి ప్రసాద్ పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  పార్టీ బలోపేతానికి చేస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి మరోసారి ఈ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా అయిలి ప్రసాద్ మాట్లాడుతూ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంథని మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అయిలి ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

పార్టీ బలోపేతంపై దుద్దిళ్ల శ్రీనుబాబు చర్చలు

 

ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో సమావేశమైన శ్రీనుబాబు

హైదరాబాద్, గాంధీభవన్: సంఘటన్ సృజన్ అభియాన్‌ (SSA)లో భాగంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించిన వన్‌-టు-వన్‌ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో సమావేశమైన శ్రీనుబాబు పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలు, కమిటీల పనితీరు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. మంథని, మధిర, రామగుండం, స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ కార్యకలాపాల వివరాలను కూడా ఆయన వెల్లడించారు.

2025 జూన్‌ 29న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటి నుంచి నిర్వహించిన పార్టీ కార్యక్రమాలు, చేపట్టిన సంస్థాగత కార్యకలాపాలు, కమిటీల పనితీరుకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ కార్యదర్శికి సమర్పించారు. పార్టీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు.



శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పూజలు

 


ముద్ర, కరీంనగర్‌: కరీంనగర్‌ జ్యోతినగర్‌లోని వెంకటాద్రి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ నెల 14న సాయంత్రం 5.30 గంటలకు స్వామివారికి స్వామివారి అభిషేకం, గోదాదేవి అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, ప్రత్యేక హారతి నిర్వహించనున్నారు. 16న ఊయల పూలంగి సేవ, 17న గరుడ పంచమి సందర్భంగా గరుడ అలంకార సేవ చేపట్టనున్నారు.

21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం, సాయంత్రం 6 గంటలకు సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తారు. 22న సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, 26న ఉదయం 10 గంటలకు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

28న మూడవ శుక్రవారం సందర్భంగా ఉదయం 7.30 గంటలకు స్వామివారి అభిషేకం, సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన, 108 అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబర్‌ 4న బాలగోపాల శుక్రవారం సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఉట్టి కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 11న బద్రపద శుక్రవారం (అమావాస్య) సందర్భంగా చండనం అలంకరణ, అమ్మవారికి అభిషేకం, గోదాదేవి పుష్ప శుక్ల సేవ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

బుధవారం, ఆగస్టు 12, 2026

అసత్యాలతో కేటీఆర్‌ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు

 దిక్సూచి,  హైదరాబాద్‌, ఆగస్టు 12:

అసత్యాలతో కేటీఆర్‌ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎకరానికి రూ.90 లక్షల చొప్పున భూములు కేటాయిస్తే, తమ ప్రభుత్వం ఎకరానికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించిందని తెలిపారు. ఐదు ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు కేటాయించామని, కేటీఆర్‌ చెబుతున్న రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు.

హెచ్‌ఐఎల్‌టీ పాలసీతో హైదరాబాద్‌ ప్రజలకు మేలు జరుగుతుందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కేటీఆర్‌కు మంచిది కాదని సూచించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దని, ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించవద్దని అన్నారు.

నీటి వాటాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడబోమని, జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరై తెలంగాణ నీటి వాటాల కోసం బలంగా వాదిస్తామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

మంగళవారం, ఆగస్టు 11, 2026

సేవా చైతన్యానికి ప్రతీక.. గట్టు నారాయణ గురూజీ





 ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం

శ్రీ సీతారామ సేవా సదన్‌తో సేవా ప్రస్థానం..                                                 మంథని సంస్కృతి, ధర్మ పరిరక్షణకు విశేష కృషి

మంథని:
గోదావరి తీరాన వెలసిన మంథని పట్టణానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ నేలతో అనుబంధం పెంచుకున్న పలువురు తమదైన సేవా కార్యక్రమాలతో మంథని ప్రత్యేకతను మరింత ఇనుమడింపజేశారు. అలాంటి వ్యక్తుల్లో గట్టు నారాయణ గురూజీ ఒకరు. ఆధ్యాత్మిక చింతనను వ్యక్తిగత సాధనకే పరిమితం చేయకుండా సమాజ సేవకు అనుసంధానం చేసిన ఆయన.. మంథని ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందారు.

చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి, ప్రతిభతో రాణించిన నారాయణ గురూజీ మంథని హైస్కూల్‌లో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. జ్ఞాన సముపార్జనతో పాటు సమాజం పట్ల బాధ్యత, ఆధ్యాత్మిక చింతన ఆయన జీవన ప్రస్థానంలో క్రమంగా బలపడింది.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గట్టు నారాయణ ఎలక్ట్రీకల్​ ఇంజనీరింగ్​ డిప్లొమా పూర్తి చేసిన తరువాత వొల్టాస్​ కంపెనీలో మొదటిసారి ఉద్యోగం చేశారు. ఆ తరువాత ఏఎంఐఈ, ఎంబీఏ పూర్తి చేసి అనంతరం మరిన్ని డిగ్రీలు సొంతం చేసుకున్నారు. గుజరాత్​ రాష్ట్రంలోని బరోడాలో స్వయంగా కంప్యూటర్​ కంపెనీ స్థాపించి, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 18 కంపెనీలకు డైరెక్టర్​గా వ్యవహరిస్తూ, కంపెనీ అధినేతలకు మార్గదర్శకుడై, గురువుగా నిలిచి వాటి అభివృద్ధికి బాటలు వేశారు.

సేవే సాధనగా..

గట్టు నారాయణ గురూజీ జీవిత ప్రస్థానంలో మంథనికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ సీతారామ సేవా సదన్ను స్థాపించి, దాని ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక వేదికను ఏర్పాటు చేశారు.

మంథని తమ్మిచెరువు కట్ట వద్ద నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సీతారామ సేవా సదన్ కీలక పాత్ర పోషించింది. ముద్దు రామకృష్ణయ్య విగ్రహం, పుస్తకాలు, డీవీడీల ఆవిష్కరణ కార్యక్రమానికి నారాయణ గురూజీ అధ్యక్షత వహించారు. సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన మంథని ప్రాంతంలో అనేక కార్యక్రమాలను ముందుండి నడిపించారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సమాజంలోని అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం సీతారామ సేవా సదన్ కార్యకలాపాల్లో ప్రత్యేకతగా నిలిచింది.

మంథని సంస్కృతిపై ప్రత్యేక మమకారం

మంథని ప్రాంతంపై నారాయణ గురూజీకి ప్రత్యేకమైన మమకారం ఉంది. ఈ ప్రాంత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచనతో ఆయన అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించాలన్నది ఆయన ఆలోచనా విధానంలో ముఖ్యమైన అంశం. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, ప్రార్థనలకు పరిమితం కాకుండా.. మనిషిలో మానవత్వాన్ని పెంచడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడమేనన్న భావనతో ఆయన ముందుకు సాగారు.

గోపీజనవల్లభ ఆలయ నిర్మాణ సంకల్పం

మంథని ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరింత విస్తరించే దిశగా గోపీజనవల్లభ దేవాలయ నిర్మాణం చేపట్టాలన్న సంకల్పాన్ని కూడా నారాయణ గురూజీ వ్యక్తం చేశారు. మంథని ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి తగిన విధంగా దేవాలయ నిర్మాణం జరగాలన్నది ఆయన ఆకాంక్ష తీరింది. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా.. ధార్మిక, సాంస్కృతిక, సామాజిక చైతన్యానికి కేంద్రాలుగా ఉండాలన్నది ఆయన భావన.

ఆధ్యాత్మికతతో పాటు సాహిత్యాభిమానం

గురూజీ వ్యక్తిత్వంలో మరో విశిష్టమైన కోణం సాహిత్యం, జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక విషయాలపై అధ్యయనం చేయడంతో పాటు వాటిని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి ఆయన ఆసక్తి చూపారు.

పుస్తక ప్రచురణలు, ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలు, ధార్మిక చర్చలు వంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించారు. జ్ఞానం కొద్దిమందికే పరిమితం కాకుండా అందరికీ చేరాలన్న ఆలోచనతో సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.

సేవా సదన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు

శ్రీ సీతారామ సేవా సదన్ ద్వారా చేపట్టిన కార్యక్రమాల్లో సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం లభించింది. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం వంటి విభిన్న కార్యక్రమాలను సదన్ నిర్వహించింది.

మంథని ప్రాంతంలోని బ్రహ్మతీర్థం ముక్తిధామంలో గ్యాస్ ఆధారిత జ్వలన యంత్రం ఏర్పాటు చేయడంలోనూ సీతారామ సేవా సదన్ కీలక పాత్ర పోషించింది. దీంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలకు మరింత సౌకర్యం కలిగింది. సంప్రదాయ విలువలను కాపాడుతూనే ఆధునిక సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనకు ఇది ఉదాహరణగా నిలిచింది.

గృహస్థ జీవితంలోనూ ఆధ్యాత్మికత

గట్టు నారాయణ గురూజీ జీవితం ఆధ్యాత్మికత, కుటుంబ బాధ్యతలు, సామాజిక సేవల సమన్వయానికి ప్రతీకగా నిలిచింది. సతీమణి శ్రీమతి సుజనతో కలిసి ఆయన సాగించిన దాంపత్య జీవితం కూడా ఆయన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం.

ఆధ్యాత్మిక జీవితం అంటే కుటుంబానికి దూరంగా ఉండటం కాదని.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సమాజానికి సేవ చేయవచ్చని ఆయన జీవన విధానం తెలియజేస్తుంది.

తరాలకు స్ఫూర్తిగా..

కాలంతో పాటు మంథని పట్టణం రూపురేఖలు మారుతున్నా.. దాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలు మాత్రం నిలిచి ఉండాలని నారాయణ గురూజీ ఆకాంక్షించారు. అందులో భాగంగానే సేవా కార్యక్రమాలను కొనసాగించారు.

ఒక వ్యక్తి గొప్పతనం పదవుల్లో కాదు.. తాను జీవించిన సమాజానికి ఎంత మేలు చేశాడన్నదే అసలైన కొలమానం. ఆ కోణంలో చూస్తే గట్టు నారాయణ గురూజీ ప్రస్థానం మంథని చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.

మంథని నేలపై పుట్టిన అనుబంధం..
ఆధ్యాత్మికతలో పెరిగిన చైతన్యం..
సేవలో ఆచరణగా మారిన ఆలోచన..
సమాజమే కుటుంబంగా భావించిన తత్వం..

శ్రీ సీతారామ సేవా సదన్‌ను కేంద్రంగా చేసుకుని ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన గట్టు నారాయణ గురూజీ.. మంథని గడ్డపై సేవా చైతన్యానికి చిరునామాగా నిలిచారు.

— దిక్సూచి ప్రత్యేక కథనం

watch Guruji speaks of him.. open the link

https://youtu.be/ItPOzpKrfGU?si=j4m8I1qs5ytAHtz7










ఎంఎస్‌ఎంఈడీ సవరణతో పరిశ్రమలకు మరింత ప్రయోజనం


సకాలంలో చెల్లింపులు.. వేగవంతమైన వివాద పరిష్కారానికి అవకాశం

ప్రభుత్వ నిబంధనలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా పరిశ్రమల మేనేజర్ ఏ. కీర్తి కాంత్

దిక్సూచి, పెద్దపల్లి:

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు అందేలా చూడటం, వ్యాపార వివాదాలను వేగంగా పరిష్కరించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈడీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టిందని జిల్లా పరిశ్రమల మేనేజర్ ఏ. కీర్తి కాంత్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సవరణ ద్వారా పెట్టుబడి, వార్షిక వ్యాపార లావాదేవీల ఆధారంగా ఎంఎస్‌ఎంఈల వర్గీకరణతో పాటు ఉద్యమ్ నమోదును ఉచితంగా, స్వచ్ఛందంగా ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యమైనప్పుడు తలెత్తే వివాదాలను ఆన్‌లైన్ మధ్యవర్తిత్వం, మధ్యవర్తిత్వ తీర్పు ప్రక్రియ ద్వారా వేగంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రావాల్సిన బకాయిలను త్వరగా పొందేందుకు వీలవుతుందన్నారు.

ఆలస్య చెల్లింపులకు వేగవంతమైన పరిష్కారం

మధ్యవర్తిత్వ తీర్పును రద్దు చేయాలని దాఖలైన కేసు ఆరు నెలలకు మించి పెండింగ్‌లో ఉంటే, తీర్పు ద్వారా నిర్ణయించిన మొత్తంలో కనీసం 50 శాతం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించే అవకాశం ఉంటుందని కీర్తి కాంత్ తెలిపారు.

అదేవిధంగా మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన రాజీ ఒప్పందాలు, మధ్యవర్తిత్వ తీర్పులను భూ బకాయిల మాదిరిగా వసూలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ చర్యలు ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపుల విషయంలో మరింత భరోసా కల్పిస్తాయన్నారు.

వాణిజ్య బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యం

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు సంబంధించిన వాణిజ్య బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసి, వాటి నగదు లభ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాణిజ్య బిల్లుల ఎలక్ట్రానిక్ రాయితీ వ్యవస్థ ద్వారా చెల్లింపులు నిర్వహించే విధానం ప్రతిపాదించబడిందని తెలిపారు.

దీంతో పరిశ్రమలకు నిర్వహణ మూలధనం అందుబాటులోకి వచ్చి వ్యాపార కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

సదుపాయ మండళ్లతో వేగవంతమైన పరిష్కారం

ఆలస్యమైన చెల్లింపులకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్రాలు ఒకటి కంటే ఎక్కువ సూక్ష్మ, చిన్న పరిశ్రమల సదుపాయ మండళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. చిన్నపాటి నేరాలను క్రిమినల్ కేసులుగా కాకుండా పౌర జరిమానాల ద్వారా పరిష్కరించే విధానం కూడా ప్రతిపాదించబడిందన్నారు.

పెద్దపల్లి జిల్లాలోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యమైతే సమస్య పరిష్కారం కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమల సదుపాయ మండలి, కరీంనగర్ను ఆశ్రయించవచ్చని సూచించారు.

ఎంఎస్‌ఎంఈ యూనిట్లు తమ సంస్థలను ఉద్యమ్ నమోదు ద్వారా నమోదు చేసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలు, విధానాలు, వివాద పరిష్కార వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని కీర్తి కాంత్ కోరారు.

పెట్టుబడులు, ఉపాధికి దోహదం

ఎంఎస్‌ఎంఈడీ సవరణ బిల్లు–2026తో పరిశ్రమల నియంత్రణ వ్యవస్థ సరళీకృతం కావడంతో పాటు సకాలంలో చెల్లింపులు, వేగవంతమైన వివాద పరిష్కారం, మెరుగైన నగదు లభ్యతకు ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని ఎంఎస్‌ఎంఈలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో జిల్లాలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని జిల్లా పరిశ్రమల మేనేజర్ పేర్కొన్నారు.

బాధ్యతాయుత మైనింగ్‌కు బాటలు

 

మంథని నుంచి ఆస్ట్రేలియా వరకు..  ప్రొఫెసర్ మోహన్ ఎలిశెట్టి

మంథని బాలుడి బుర్రలో చిన్నప్పటి నుంచి తొలుస్తున్న ఆలోచన.. ఇప్పుడు ప్రపంచానికి బాధ్యతాయుతమైన గనుల తవ్వకానికి దిశానిర్దేశం చేస్తోంది..

(దిక్సూచి ప్రత్యేక కథనం)
తెలంగాణలోని చిన్న పట్టణం మంథనిలో పెరిగిన ఓ బాలుడు.. తన చుట్టూ మారుతున్న భూభాగాన్ని నిశితంగా గమనించాడు. బొగ్గు గనుల విస్తరణతో ఏర్పడుతున్న భారీ ఓపెన్‌కట్ గనులు, మట్టిదిబ్బలు, మారుతున్న కొండలు.. వాటి ప్రభావంతో అనిశ్చితిలో పడుతున్న వ్యవసాయ కుటుంబాలు.. ఇవన్నీ అతడి మనసులో చెరగని ముద్ర వేశాయి. అప్పటికి అతడు పరిశోధకుడు కాదు. తనకు తెలిసిన నేలలో జరుగుతున్న మార్పులను చూస్తున్న ఓ బాలుడు మాత్రమే.

ఆ బాలుడే నేడు ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలిశెట్టి. కీలక ఖనిజాలు, సుస్థిరమైన గనుల తవ్వకం రంగాల్లో ఆస్ట్రేలియాలో ప్రముఖ పరిశోధకుడిగా గుర్తింపు పొందారు.

“గనుల తవ్వకం చేయాలా? వద్దా? అన్నది ప్రశ్న కాదు. బాధ్యతాయుతంగా ఎలా తవ్వాలి? అన్నదే అసలు ప్రశ్న” అని ఆయన చెబుతారు.

గోవాలో కీలక అనుభవం

మైనింగ్ ఇంజినీరింగ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి, భారత్‌లో ఉన్నత పరిశోధనలు చేసిన అనంతరం మోహన్ ఎలిశెట్టి దాదాపు పదేళ్లు గోవాలో గడిపారు. అక్కడ గనుల పరిశ్రమతో పాటు ప్రభుత్వ విభాగాల్లోనూ పనిచేశారు.

ఖనిజం బొగ్గు కాకుండా ఇనుప ఖనిజం అయినప్పటికీ మంథనిలో చూసిన పరిస్థితులకు అక్కడి సమస్యలకు పెద్దగా తేడా లేదని ఆయన గుర్తించారు. గనుల కార్యకలాపాలతో పాటు వ్యవసాయం, జీవ వైవిధ్యం, పర్యాటకం కూడా కొనసాగాల్సిన పరిస్థితి ఉండేది. గనుల భవిష్యత్తు తమ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన స్థానిక ప్రజల్లో కనిపించేది.

యేల్ యూనివర్సిటీతో మలుపు

2014లో ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించిన ఎండీవర్ ఫెలోషిప్ లభించింది. దీంతో కొంతకాలం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా వనరుల సుస్థిరతపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ థామస్ ఈ. గ్రేడెల్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. 

ఈ అనుభవం తన ఆలోచనా పరిధిని విస్తరించిందని మోహన్ ఎలిశెట్టి చెబుతున్నారు. ముఖ్యంగా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, స్వచ్ఛ ఇంధన మార్పులో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం దోహదపడింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా, భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పలు దేశాల పరిశోధకులతో భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి.

భవిష్యత్ ఇంధన విప్లవానికి కీలక ఖనిజాలు

బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు, ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇలా ఆధునిక ప్రపంచానికి అవసరమైన అనేక ఉత్పత్తుల తయారీలో కీలక ఖనిజాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఈ ఖనిజాల విషయంలో ఆస్ట్రేలియాకు అపారమైన వనరులు ఉన్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలకు అవసరమైన పది కీలక ఖనిజ మూలకాలలో తొమ్మిదింటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉంది. లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలు అందులో ఉన్నాయి.

అయితే కేవలం ఖనిజాలను వెలికితీయడమే అవకాశంగా చూడకూడదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

“ఈ వనరులను బాధ్యతాయుతంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉండటంతో ప్రపంచం మనవైపు చూస్తోంది” అని ఆయన అంటున్నారు.

ప్రజల విశ్వాసమే ‘సోషల్ లైసెన్స్’

బాధ్యతాయుతమైన గనుల తవ్వకానికి స్థానిక ప్రజల విశ్వాసం అత్యంత కీలకమని ఆయన చెబుతున్నారు. మైనింగ్ రంగంలో దీనినే ‘సోషల్ లైసెన్స్’ అంటారు.

“గనుల ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రజలు, వర్గాల విశ్వాసాన్ని సంపాదించడం, దాన్ని కొనసాగించడం సోషల్ లైసెన్స్. కేవలం ప్రభుత్వ నిబంధనలు పాటించడం మాత్రమే సరిపోదు” అని ఆయన వివరిస్తారు.

ప్రాజెక్టుల రూపకల్పన నుంచే స్థానిక ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం, నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయడం, గనుల కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఎలా పునరుద్ధరించాలనే అంశాన్ని ముందుగానే ప్రణాళికలో చేర్చడం అవసరమని ఆయన సూచిస్తున్నారు.

80 వేలకుపైగా నిర్వీర్య గనుల గుర్తింపు

2020లో ప్రొఫెసర్ మోహన్ ఎలిశెట్టి, ఆయన బృందం **మైనింగ్ ఇన్సిడెన్స్ డాక్యుమెంటేషన్ అండ్ అసెస్‌మెంట్ స్కీమ్ (MIDAS)**ను అభివృద్ధి చేసింది.

దీని ద్వారా ఆస్ట్రేలియా వ్యాప్తంగా 80 వేలకు పైగా క్రియాశీలంగా లేని గనుల ప్రాంతాలను గుర్తించారు. వాటిలో అనేక ప్రాంతాలు ఇప్పటికీ పూర్తిస్థాయి పునరుద్ధరణకు నోచుకోలేదు.

గనుల కార్యకలాపాలు ముగిసిన తర్వాత కూడా వాటి ప్రభావం తరాలపాటు కొనసాగవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.

“గని మూసివేత, భూమి పునరుద్ధరణకు మొదటి నుంచే ప్రాధాన్యం ఇవ్వకపోతే.. మైనింగ్ ప్రభావాలు తరాలపాటు కొనసాగవచ్చు” అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

సాంకేతికతతో మరింత బాధ్యతాయుతమైన మైనింగ్

భవిష్యత్తుపై ఆయన ఆశావహంగా ఉన్నారు. తనను తాను **“డేంజరస్ ఆప్టిమిస్ట్”**గా అభివర్ణించుకునే మోహన్ ఎల్లిశెట్టి.. విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న పురోగతి గనుల పరిశ్రమకు మెరుగైన అవకాశాలను అందిస్తోందని చెబుతున్నారు.

కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్, ఆధునిక మ్యాపింగ్, డేటా విశ్లేషణ వంటి సాంకేతికతల ద్వారా గనుల ప్రణాళికను మెరుగుపరచడం, పర్యావరణ ప్రభావాలను తగ్గించడం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

అయితే సాంకేతికత ఒక్కటే పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు.

“బాధ్యతాయుతమైన మైనింగ్‌కు మంచి శాస్త్రీయ పరిశోధన, బలమైన పాలన, సమగ్ర ప్రణాళిక అవసరం. గని పనిచేసే కాలంలోనే దశలవారీగా పునరుద్ధరణ చేపట్టాలి. చివరికి ఆ భూమిని సురక్షితమైన, స్థిరమైన, స్వయం సమృద్ధి కలిగిన స్థితికి తీసుకురావాలి” అని ఆయన అంటున్నారు.

భారత్–ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి కొత్త దిశ

మోహన్ ఎలిశెట్టి పరిశోధనలో మైనింగ్ ఇంజినీరింగ్‌తో పాటు పర్యావరణ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ప్రజా విధానాలు సమన్వయమవుతున్నాయి.

ఆస్ట్రేలియా–భారత్ మధ్య పరిశోధన, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆస్ట్రేలియాకు అపారమైన ఖనిజ వనరులు ఉండగా భారత్ ప్రాసెసింగ్, తయారీ, సాంకేతిక రంగాల్లో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటోంది. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే భవిష్యత్తుకు అవసరమైన మరింత పటిష్టమైన ఖనిజ సరఫరా వ్యవస్థలను నిర్మించవచ్చని ఆయన భావిస్తున్నారు.

“ఇది ఒక తరంలో ఒకసారి వచ్చే అవకాశం. మనం సరిగ్గా ముందుకు సాగితే.. ప్రపంచ ఇంధన మార్పుకు ఆస్ట్రేలియా తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలు, మరింత సుస్థిరమైన భవిష్యత్తును సృష్టించగలదు” అని ఆయన అంటున్నారు.

ముడి ఖనిజాల ఎగుమతిని దాటి..

ఆస్ట్రేలియా కేవలం ముడి ఖనిజాలను ఎగుమతి చేయడం నుంచి ముందుకు వెళ్లి.. ప్రాసెసింగ్, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని ప్రొఫెసర్ ఎల్లిశెట్టి ఆకాంక్షిస్తున్నారు.

“మన భవిష్యత్ విజయాన్ని ఎంత ఖనిజాన్ని వెలికితీశామనే దానితో మాత్రమే కొలవకూడదు. మొత్తం ఖనిజ సరఫరా గొలుసులో ఎంత జ్ఞానం, సాంకేతికత, విలువను సృష్టించామన్నదే కీలకం” అని ఆయన చెబుతున్నారు.

మంథని బాలుడి కల..

ఒకప్పుడు తెలంగాణలోని మంథనిలో బొగ్గు గనులతో మారిపోతున్న కొండలను చూసిన బాలుడు.. నేడు ప్రపంచవ్యాప్తంగా బాధ్యతాయుతమైన మైనింగ్‌పై పరిశోధనలు చేస్తున్నాడు.

ఆ బాల్య అనుభవమే ఆయన పరిశోధనా ప్రయాణానికి బలమైన పునాది అయింది. ఆర్థికాభివృద్ధికి మైనింగ్ అవసరమే అయినా.. దాని వల్ల పర్యావరణం, వ్యవసాయం, ప్రజల జీవనంపై శాశ్వత నష్టం కలగకూడదన్నదే ఆయన ఆలోచన.

గనుల నుంచి ఆర్థిక విలువను మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన భూములను, బలమైన సమాజాలను, భవిష్యత్ తరాలు గర్వంగా అందుకునే వారసత్వాన్ని మిగిల్చే మైనింగ్ పరిశ్రమే లక్ష్యం కావాలన్నది మంథని బిడ్డ ప్రొఫెసర్ మోహన్ ఎల్లిశెట్టి సందేశం.

జెనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అతి పెద్ద పరిశోధన కేంద్రం


దిక్సూచి, హైదరాబాద్​:

గ్లోబల్‌ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ యామ్జెన్‌ (Amgen) హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.

అంతకుముందు యామ్జెన్‌ ఇండియా ప్రతినిధులు శ్రీధర్‌బాబుతో సమావేశమై హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. అనంతరం యామ్జెన్‌ ఇండియా ఎండీ నవీన్‌ గుళ్లపల్లి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న పరిశోధన కేంద్రంతో స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు తెలిపారు. ఇటీవల యామ్జెన్‌ 3 వేల మంది ఉద్యోగులతో భారీ గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఔషధ రంగ దిగ్గజ సంస్థలు తెలంగాణపై విశ్వాసం వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమన్నారు.

నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, జీనోమ్‌ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన జీవశాస్త్ర పరిశోధన పర్యావరణ వ్యవస్థతో తెలంగాణ ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని యామ్జెన్‌ యాజమాన్యాన్ని కోరారు.

దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామ్జెన్‌ క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, వాపు సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ, అరుదైన వ్యాధులకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తోంది.

కార్యక్రమంలో పరిశ్రమల కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ సర్వేశ్‌ సింగ్‌, యామ్జెన్‌ ఇండియా ఎండీ నవీన్‌ గుళ్లపల్లి, ఈడీ శ్రీను కొసరాజు తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026