జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
దేశభక్తిని చాటిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు..
మహిళా సంఘాలకు రూ.280 కోట్లకు పైగా ఆర్థికసాయం
దిక్సూచి ప్రతినిధి, హైదరాబాద్: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసు సిబ్బంది మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, ప్రజలకు మంత్రి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు జిల్లాలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు.
సంక్షేమ పథకాలపై శకటాలు.. అభివృద్ధి ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి, అటవీ, హౌసింగ్, సంక్షేమ, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్యం, విద్య, అగ్నిమాపక, ఐసీడీఎస్ తదితర శాఖలు ఏర్పాటు చేసిన శకటాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు తిలకించారు.
అనంతరం పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉద్యానవన, పౌరసరఫరాలు, విద్యుత్ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను అధికారులు మంత్రికి వివరించారు.
ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు
జిల్లా పరిపాలనలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వై. నితిన్‌తో పాటు ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
మహిళా సంఘాలకు రూ.280 కోట్లకు పైగా ఆర్థిక సహాయం
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంలో భాగంగా గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.261.52 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అదేవిధంగా మెప్మా పరిధిలోని పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.18.78 కోట్ల విలువైన చెక్కులను అందించారు.
మొత్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.280.30 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. మహిళలు కుటుంబ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించేలా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
దేశభక్తిని చాటిన చిన్నారులు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కేజీబీవీ మహేశ్వరం, ఏవీఎన్ ఇంటర్నేషనల్ స్కూల్, టీఎస్ మోడల్ స్కూల్ నేదునూర్, వివేక విద్యా భారతి ఆమనగల్, జడ్పీహెచ్ఎస్ తుక్కుగూడ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ప్రదర్శనలు ముగిసిన అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఘనంగా ముగిసిన వేడుకలు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్. రెడ్డి, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు డాక్టర్ కె. కిరణ్మయి, చంద్రా రెడ్డి, శంషాబాద్ డీసీపీ బి. రాజేష్, జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, కలెక్టరేట్ ఏఓ సునీల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి