Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

ఆదివారం, జులై 19, 2026

20.07.2026 సోమవారం ప్రధాన వార్తలు

 

శుభోదయం

20.07.2026 సోమవారం

ఈరోజు ప్రధాన వార్తలు

  • కరీంనగర్: ఎ​ల్నినో నుంచి  రైతులు, ప్రజలను కాపాడుకుందాం – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు

  • కరీంనగర్: కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు సూటి ప్రశ్న 

  • కరీంనగర్: సుడా చైర్మన్ గిరి ఎవరికో..?

  • ధర్మపురిలో వరుణ యాగం
  •  
  • కరీంనగర్: జువ్వాడి చొక్కారావుకు ఘన నివాళి
  •  
  • కరీంనగర్: ఏఐబీఈఏ జాతీయ అధ్యక్షుడు బీఎస్ రాంబాబుకు ఘన స్వాగతం
  •  
  • కరీంనగర్: 'ఉద్యోగ ప్రస్థానం' పుస్తకావిష్కరణ
  •  
  • రామగుండంలో వరుస చోరీల ముఠా అరెస్ట్
  •  
  • వికరాబాద్:​ రూ.511.87 కోట్లతో సుల్తాన్‌పూర్–బీజాపూర్ హైవే అభివృద్ధి శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీధర్​బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  •  

'ఉద్యోగ ప్రస్థానం' సమాజ చరిత్రకు ఆనవాలు

 


'ఉద్యోగ ప్రస్థానం' సమాజ చరిత్రకు ఆనవాలు

వేముల సత్యనారాయణ రచనను ఆవిష్కరించిన డాక్టర్ మచ్చా హరిదాసు

దిక్సూచి, కరీంనగర్:

రచయిత వేముల సత్యనారాయణ రచించిన 'నేను నా ప్రపంచం – ఉద్యోగ ప్రస్థానం' పుస్తకం సమాజపు ఆటుపోట్లు, విద్యారంగ పరిణామాలు, ఉద్యోగ జీవితానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లను నమోదు చేసిన విలువైన రచన అని ప్రముఖ సాహిత్య పరిశోధకులు డాక్టర్ మచ్చా హరిదాసు అన్నారు.

కరీంనగర్ ఫిలిం భవన్‌లో సాహిత్య సోపతి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సభలో వేముల సత్యనారాయణ స్వీయ రచన 'ఉద్యోగ ప్రస్థానం' పుస్తకాన్ని డాక్టర్ మచ్చా హరిదాసు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా 33 సంవత్సరాల పాటు సాగిన ఉద్యోగ జీవితంలోని అనుభవాలను, ఆ కాలంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను రచయిత ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. నిరంతర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగిన వేముల సత్యనారాయణ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నాళేశ్వరం భాస్కర్, ప్రముఖ కథా రచయిత డాక్టర్ బి.వి.ఎన్. స్వామి, ప్రముఖ కవులు జూకంటి జగన్నాథం, బూర్ల వెంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి తదితరులు పాల్గొని పుస్తక విశిష్టతను వివరించారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

 

వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

రూ.2.40 లక్షల నగదు, 11 గ్రాముల బంగారం, టీవీ స్వాధీనం

దిక్సూచి, రామగుండం:

రామగుండం పోలీసుల ప్రత్యేక చర్యల్లో భాగంగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.40 లక్షల నగదు, 11 గ్రాముల బంగారం, ఒక టెలివిజన్‌తో పాటు ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మహేష్ నిందితుల వివరాలను వెల్లడించారు. రామగుండం పరిధిలో వరుసగా చిల్లర చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

నిందితుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం వల్లే యువత చెడు అలవాట్లకు గురై నేరాల వైపు మళ్లే అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల కదలికలు, స్నేహాలు, అలవాట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

అదేవిధంగా ప్రజలు తమ కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకుందాం

 


ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకుందాం

:ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జాతీయ అధ్యక్షులు బీఎస్ రాంబాబు


దిక్సూచి, కరీంనగర్:

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన బీఎస్ రాంబాబుకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల బ్యాంకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

నగరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశంలో బీఎస్ రాంబాబు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల హక్కుల సాధనకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడేందుకు ఏఐబీఈఏ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

జూలై 19ను 14 ప్రధాన బ్యాంకుల జాతీకరణ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో సుమారు 500 మంది బ్యాంకు ఉద్యోగులు సమావేశమయ్యారని చెప్పారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని ఐదు జిల్లాలకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ఎలాంటి ప్రయత్నాలనైనా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, వాటిని బలహీనపరిచే నిర్ణయాలను సహించబోమన్నారు. అవసరమైతే దేశవ్యాప్తంగా ఆందోళనలు, సమ్మెలు చేపట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దివంగత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావుకు ఘన నివాళి

 


దివంగత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావుకు ఘన నివాళి

కాంగ్రెస్ నాయకులకు చొక్కారావు ఆదర్శప్రాయం: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు

దిక్సూచి, కరీంనగర్:

దివంగత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలో ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా మాజీ చైర్మన్ కోమట్‌రెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి జువ్వాడి చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మంత్రులు మాట్లాడుతూ, జువ్వాడి చొక్కారావు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. రాజకీయాల్లో పారదర్శకత, నీతి, నిజాయితీకి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. చొక్కారావు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాపాలన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన జీవితం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు ఉప్పుల ఆంజనేయ ప్రసాద్, ఎండీ తాజ్, ఆకుల భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్, రాజేందర్, మడుపు మోహన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని చొక్కారావు సేవలను స్మరించుకున్నారు.

ధర్మపురిలో వరుణ యాగం


వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం

ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం..

రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలే లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

దిక్సూచి, ధర్మపురి:

వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వైభవంగా వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాగంలో భాగంగా కలశ గణపతి పూజ, 108 కలశాల స్థాపన, వరుణ జపం, 108 కలశాలతో శ్రీ రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పించి వరుణ యాగం నిర్వహించినట్లు చెప్పారు.

ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అంతటా సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సుమారు 11 మంది వేదపండితులు పాల్గొని ప్రత్యేక రుద్రాభిషేకాలు, వరుణ యాగాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు లభించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చిలుమల లావణ్య లక్ష్మణ్, దేవస్థాన ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేదపండితులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

సుల్తాన్‌పూర్–బీజాపూర్ హైవే అభివృద్ధికి శ్రీకారం

 


రూ.511.87 కోట్లతో 152.59 కి.మీ మేర 12 హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన

దిక్సూచి ప్రతినిధి | పరిగి (వికారాబాద్)

తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆదివారం సుల్తాన్‌పూర్ చౌరస్తా–బీజాపూర్ హైవేపై రూ.511.87 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 152.59 కిలోమీటర్ల పొడవైన 12 హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారి వ్యవస్థను ఆధునికీకరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను మెరుగైన రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.

సుల్తాన్‌పూర్ చౌరస్తా–బీజాపూర్ హైవే అభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రమాదాల నివారణకు కూడా దోహదపడుతుందని చెప్పారు. ఈ రహదారి వికారాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ తదితర ప్రాంతాల మధ్య రాకపోకలకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని వివరించారు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన రహదారుల నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టు సంస్థలు నిర్దిష్ట కాలం పాటు నిర్వహిస్తాయని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రోడ్లు–భవనాల శాఖ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు సూటి ప్రశ్న

 


యువతను తప్పుదోవ పట్టించొద్దు  

దిక్సూచి, కరీంనగర్:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్​ కలెక్టరేట్​ లో ఎల్నినోపై సమీక్ష అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించిన తర్వాత, తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేదో ముందుగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

2014లో డిగ్రీ పూర్తిచేసుకున్న యువత 2024 వరకు గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని, వారి జీవితాల్లో పదేళ్లు వృథా చేసినందుకు బీఆర్ఎస్ నాయకత్వం ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, సుమారు 600 మంది గ్రూప్-1 అధికారులకు నియామకాలు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లలో కూడా ఈ నియామకాల ద్వారానే ఎంపికైన అధికారులు ఉన్నారన్నారు.

ఉద్యోగ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని కేటీఆర్‌కు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ అమలు దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు కోర్టు వివాదాల్లో చిక్కుకుని నిలిచిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి నియామక ప్రక్రియను పూర్తి చేస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు.

ఎల్‌బీ స్టేడియం వంటి బహిరంగ వేదికలపై నియామక పత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వ పారదర్శకతను చాటుతున్నామని పేర్కొన్నారు. యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలని కేటీఆర్‌కు సూచించారు.

రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఉద్యోగాల కలలను సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్​ చైర్మన్లు, మార్కెట్​ కమిటీ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

ఎల్నినో నుంచి రైతులు, ప్రజలను కాపాడుకుందాం


 ఎల్నినో నుంచి  రైతులు, ప్రజలను కాపాడుకుందాం

సమష్టిగా నిలబడి మిషన్ మోడ్‌లో సూపర్ ఎల్‌నినోను ఎదుర్కొందాం 

 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 * ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామ గ్రామానా రైతులకు అవగాహన కల్పించాలి

 *వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు... పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

 * రాజకీయాలకు అతీతంగా సూపర్ ఎల్‌నినో సవాల్‌ను ఎదుర్కొందాం

* జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లతో నిరంతర పర్యవేక్షణ**

*వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి... ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టాలి*

* ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే ప్రజల భాగస్వామ్యమే కీలకం... 

వర్షపు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి

* కరోనా స్ఫూర్తితో సూపర్ ఎల్‌నినోను అధిగమిద్దాం

* సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష సమావేశం

దిక్సూచి, కరీంనగర్,  జూలై 19:

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపనున్న **సూపర్ ఎల్‌నినో** పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కొని రైతులు, ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్‌లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.

 ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు అందరూ ఒక్కటై పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో **సూపర్ ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై **  నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి **దుద్దిళ్ల శ్రీధర్ బాబు**, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి **పొన్నం ప్రభాకర్**, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి **అడ్లూరి లక్ష్మణ్ కుమార్**, ప్రభుత్వ విప్‌లు **ఆది శ్రీనివాస్**, **చింతకుంట విజయ రమణారావు* స్పెషల్ చీఫ్ సెక్రటరీ **మహేష్ దత్ ఎక్కా**, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి **సురేంద్రమోహన్**, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.* 

సమావేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా, రైతులకు అవగాహన కార్యక్రమాలు, జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో చేపడుతున్న చర్యలను సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖల అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు.

**మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా **సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో**, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత **ఏప్రిల్ నెల నుంచే** రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న **రైతు నేస్తం** కార్యక్రమాలు, గ్రామసభల ద్వారా రైతులకు సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే రైతులకు వివరించి నష్టాలను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై కూడా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదుకాకపోవచ్చని, అందువల్ల ముందస్తు కార్యాచరణతోనే రైతులు, ప్రజలను రక్షించగలమన్నారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలపై పడే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని **ఏ రిజర్వాయర్ నుంచీ సాగునీటిని విడుదల చేసే పరిస్థితి లేదని**, రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో **10 మీటర్ల వరకు తగ్గిపోయాయని**, రాష్ట్రంలోని జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని అప్రమత్తం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.

ప్రస్తుతం పడుతున్న చిరు జల్లులను చూసి రైతులు తొందరపడి ఎక్కువ నీటి అవసరమయ్యే పంటల వైపు వెళ్లవద్దని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని **తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కందులు, నువ్వులు, వేరుశనగ, ఆయిల్‌ పామ్, ఉద్యానవన (హార్టికల్చర్) పంటలు** నేల స్వభావానికి అనుగుణంగా సాగు చేయాలని సూచించారు.

గ్రామ గ్రామాన రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి రైతుకు భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభలు, రైతు వేదికలు, రైతు నేస్తం కార్యక్రమాల ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని సూచించారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో **తాగునీటి వినియోగానికే అత్యధిక ప్రాధాన్యత** ఇస్తున్నామని, రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన **విత్తనాలు, ఎరువులు** రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచామని తెలిపారు.

వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించాలని ఆదేశించారు. **సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి**, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు.

తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటి వినియోగంలో పొదుపు పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని ఆదేశించారు.

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు వస్తాయనే ఆశతో రైతులు ఎవరూ **వరి నాట్లు వేయడానికి తొందర పడవద్దని** మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు పరిస్థితిని బాగా అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగును విరమించి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే **తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా** నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ ప్రకృతి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.


మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 

ఎల్‌నినో ప్రభావం రాష్ట్రం ముందున్న అతిపెద్ద సవాల్ అని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 రైతులు, ప్రజలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ముందస్తు ప్రణాళికతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందన్నారు. జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాలో ప్రత్యేక **కంట్రోల్ రూమ్** ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి రైతులు, ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి అందించి ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు గ్రామ గ్రామాన పర్యటిస్తూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సూచించారు.

ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా ఇదే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న శ్రీధర్ బాబు, వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సంక్షోభ నివారణ చర్యలను నిరంతరం కొనసాగిస్తూ, ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,

 సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా **ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని**, ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలో **రైన్‌వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి** చేయాలని  అధికారులకు సూచించారు.

 జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలందరూ ఇంకుడు గుంతలు నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనిని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా **ప్రజా ఉద్యమంగా** తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కలిసి ఉమ్మడి గొంతుకతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. ప్రకృతి విపత్తును సమిష్టిగా ఎదుర్కోవాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని **ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ** దేవాలయాల్లో **వరుణ యాగాలు, ప్రత్యేక పూజలు** నిర్వహించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రజలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు విడుదల చేసి రాష్ట్రానికి అండగా నిలవాలని మంత్రి కోరారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు.

**మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,**

కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమిష్టిగా పనిచేసి సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించినట్లే, ఇప్పుడు **సూపర్ ఎల్‌నినో** కారణంగా ఏర్పడుతున్న విపత్కర పరిస్థితులను కూడా అదే స్ఫూర్తితో సమన్వయంతో ఎదుర్కోవాలని  పిలుపునిచ్చారు.

 రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులు, ప్రజలను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, గ్రామ గ్రామాన రైతులకు సూపర్ ఎల్‌నినో ప్రభావం, వాస్తవ పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పరిస్థితులను దాచిపెట్టకుండా రైతులకు స్పష్టంగా వివరించి, శాస్త్రీయ సూచనలు అందించాలని పేర్కొన్నారు.

ఎక్కువ నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా **మొక్కజొన్న, కందులు, పప్పుధాన్యాలు, ఇతర తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు** సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే రైతులు పెద్దఎత్తున **ఆయిల్‌పామ్ సాగు** వైపు మొగ్గు చూపేలా అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజల్లో ధైర్యం నింపాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం రైతులు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

 *ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ*  గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రైతులను చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా కందుల సాగును ప్రోత్సహించాలని, ప్రస్తుతం మార్కెట్లో కందులకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆ దిశగా ఆలోచిస్తే ఆర్థికంగా లాభపడతారని అన్నారు.

మిడ్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 7.4 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పేర్కొన్న ఆయన, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్రహారం, రుద్రారం పంపింగ్ స్టేషన్లలో అదనపు మోటార్లు ఏర్పాటు చేసి స్టాండ్‌బై వ్యవస్థ సిద్ధంగా ఉంచాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

*ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ,* ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రకృతి విపత్తులు, కరువు పరిస్థితులపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామసభలు, రైతు వేదికల ద్వారా ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రాధాన్యాన్ని వివరించాలని సూచించారు. వరికి బదులుగా కందులు, నువ్వులు, జొన్నలు, పప్పుధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఆగస్టు వరకు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం ఉందని తెలిపారు.

పప్పుధాన్యాల కొరత ఉన్న నేపథ్యంలో కందులు, నువ్వులకు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల వరకు మద్దతు ధర లభిస్తోందని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిరంతరం అండగా ఉంటుందని, రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు **మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ కుమార్** తదితర ప్రజాప్రతినిధులు, మేయర్లు, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్,  సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సుడా చైర్మన్ గిరి ఎవరికో..?

సుడా చైర్మన్ పదవిపై కాంగ్రెస్‌లో హోరాహోరీ

రేసులో పలువురు నేతలు 

సామాజిక సమీకరణాలపై దృష్టి

దిక్సూచి ప్రతినిధి, కరీంనగర్:

కోమటిరెడ్డి నరేందర్​ రెడ్డి
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త చైర్మన్ నియామకంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఒకవైపు ప్రస్తుత చైర్మన్ నరేందర్ రెడ్డి మరోసారి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు పలువురు సీనియర్ నేతలు తమ రాజకీయ, సామాజిక సమీకరణాలు, పార్టీ సేవలను ప్రస్తావిస్తూ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నియామకంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభిప్రాయాలు కీలకంగా మారనున్నాయనే చర్చ జరుగుతోంది. 
ఆసంపల్లి శ్రీనివాస్​

గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినందుకు, టికెట్ త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ అధిష్ఠానం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి తొలి సుడా చైర్మన్‌గా అవకాశం కల్పించింది. ఇప్పుడు తన పనితీరును పరిగణనలోకి తీసుకుని మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీలోని మరో వర్గం అభిప్రాయపడుతోంది.

ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
ఈ నేపథ్యంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి, ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ఆకారపు భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకుడు రాచకొండ చక్రధర్ రావు, కార్పొరేటర్ మల్లిఖార్జున రాజేందర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుడిగా పేరున్న ఆసంపల్లి శ్రీనివాస్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తోనూ సత్సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సామాజిక సమీకరణలు అనుకూలించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. క్రీడా, సేవా సంస్థల్లో చురుకుగా పనిచేస్తూ ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు అదనపు బలంగా భావిస్తున్నారు. 





 


 


ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి కూడా సుడా రేసులో ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో ఉన్న సత్సంబంధాలు తనకు అనుకూలంగా మారతాయని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. యువజన కాంగ్రెస్ నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న ఆకారపు భాస్కర్ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్న కార్పొరేటర్ మల్లిఖార్జున రాజేందర్, సామాజిక సేవలో చురుకైన రాచకొండ చక్రధర్ రావు కూడా సుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. 

ఇప్పటికే ఆశావహులంతా రాష్ట్ర నాయకత్వంతో పాటు మంత్రులను కలిసి  తమ వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. దీంతో సుడా చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందన్న

 అంశం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. పార్టీ సేవలు, సామాజిక సమీకరణాలు, రాజకీయ సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 













శనివారం, జులై 18, 2026

కరీంనగర్‌లో సిటీ బస్సులు నడపాలి

 


రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం

దిక్సూచి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం సుమారు ఆరు లక్షల జనాభా కలిగిన కార్పొరేషన్‌గా విస్తరించిందన్నారు. నగరంలో మూడు వైద్య కళాశాలలు, శాతవాహన విశ్వవిద్యాలయం ఉండటంతో పాటు ఇటీవల 14 గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనమయ్యాయని వివరించారు.

ప్రభుత్వ సిటీ బస్సుల కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

వినతిపత్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అంజన్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిని తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కామిరెడ్డి రామ్ రెడ్డి, పెంట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చాతుర్మాస్యవ్రతం

 

చాతుర్మాస్యవ్రతం

         

 చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం. ఈ చాతుర్మాస్య ప్రాశస్త్యాన్ని వరాహ పురాణం పేర్కొంటుంది. చాతుర్మాస్య వ్రతవిధానాన్ని స్కంద మరియు భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి .** 

వేద కాలంలో వర్ష , హేమంత , వసంత ఋతువులు మాత్రమే ఉండేవి. ఈ మూడు ఋతువుల్లో ఒక్కో ఋతువులో నాలుగేసి మాసాలు ఉండేవి. సంవత్సరం వర్ష ఋతువుతో ప్రారంభమయ్యేది. అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది. కాగా ఆషాఢం సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. ప్రతి ఋతువు ఆరంభంలోనూ యజ్ఞ యాగాదులు చేసేవారు.

అప్పటి వ్యవస్థలో ఆషాఢం సంవత్సరంలో తొలి నెల కావటంతో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అయింది. ఇప్పటికీ మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగానే పిలుస్తున్నాం. ఈ తొలి ఏకాదశికే ప్రథమ ఏకాదశి , శయన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజునే సృష్టి , స్థితి , లయల్లో స్థితి కార్యాన్ని నిర్వహించే మహా విష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ విధంగా శయనించిన విష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి  ఉత్థాన ఏకాదశి అని పేరు. ఈ ఉత్థాన ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ధి ద్వాదశి. పూర్వం ఈ ద్వాదశి రోజునే దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మధించారు. అందుకే ఇది క్షీరాబ్ధి ద్వాదశి అయింది. పాల సముద్రం చిలక బడినందువల్ల ఈ రోజుకి చిలుకు ద్వాదశి అనే మరొక పేరు కూడా ఉంది.

చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం అని అర్థం. నాలుగు నెలల పాటు ఆచరింపబడే చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి అయిన తొలి ఏకాదశి రోజున ప్రారంభింపబడి, క్షీరాబ్ధి ద్వాదశిగా పిలవబడే కార్తిక శుద్ధ ద్వాదశి రోజు ముగుస్తుంది. అంటే విష్ణువు శయనించి ఉన్న ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య వ్రతం ఆచరింపబడుతుంది.

భగవంతుని పైన మనస్సును లగ్నం చేయటమే ఈ చాతుర్మాస్య వ్రతంలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ కాలంలో సన్యాసులు , యతులు మొదలైన వారు తమ పర్యటనలను నిలిపి ఒక చోటనే దీక్షతో అనుష్ఠానాలను కొనసాగిస్తారు. పీఠాధిపతులు కూడా ఈ కాలాన్ని జపతాపాలకు వినియోగిస్తారు. శిష్య ప్రభోదాలకు , అభ్యసనానికి ముఖ్యమైన కాలంగా ఈ నాలుగు నెలల కాలం చెప్పబడుతుంది.

విరాగులు ఆధ్యాత్మిక చింతన కోసం ఆచరించే ఈ వ్రతాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చు.  భీష్ముడు శేష ధర్మాలతో ఈ చాతుర్మాస్య వ్రతాన్ని స్త్రీలు కూడా ఆచరించాలని చెప్పాడు. చాతుర్మాస్య వ్రతాన్ని స్కంద పురాణం , భవిష్యోత్తర పురాణం , బ్రహ్మవైవర్త పురాణం పేర్కొంటున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి , ఈ వ్రతాన్ని ప్రారంభించాలని శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అయితే ఆషాఢ శుద్ధ ద్వాదశి నుండి చాతుర్మాస్యాన్ని ప్రారంభించాలని స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది.

ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాక వ్రతాన్ని ఆచరించాలి. ఈ శాక వ్రతంలో ఏవిధమైన ఆకుకూరలు గానీ , కాయగూరలు గానీ తినకూడదు. ఇక శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధి వ్రతాన్ని పాటించాలి. అంటే ఈ కాలములో పెరుగును తినకూడదు. అదే విధంగా భాద్రపద పౌర్ణమి నుండి  ఆశ్వయుజ పొర్ణమి వరకు క్షీర వ్రతాన్ని ఆచరించాలి. ఈ కాలంలో పాలు , పాల పదార్థాలు తినకూడదు. చివరగా ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతాన్ని ఆచరించాలి. ఈ ద్విదళ వ్రతంలో పప్పు పదార్థాలను తినకూడదు.

ఇంకా చాతుర్మాసంలో..

ఇతరుల ఇండ్లలో వండిన ఆహారాన్ని తినకూడదు. పచ్చళ్ళు , ఊరగాయలు తినకూడదు. బెల్లము , చింతపండు , రేగు పండు , వంకాయ , గుమ్మడికాయ , ముల్లంగి , పొట్లకాయ , ఉలవలు మొదలైనవి తినకూడదు. ఆహార పదార్థాలను భగవంతునికి నివేదించాలి.  నేల మీదనే నిదురించాలి. బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి.

చాతుర్మాస్యంలో కామ్య వ్రతం అనే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతంలో కొన్ని వస్తువులను మాత్రమే తినడమో , వదిలివేయడమో చేస్తారు. ఈ వ్రతంలో భాగంగా బెల్లాన్ని విడిచిపెడితే మధుర స్వరం , నూనెను వదిలి వేస్తే దేహ సౌందర్యం , తాంబూలాన్ని వదిలిపెడితే భోగ సిద్ధి లభిస్తాయి. చాతుర్మాస్యంలో యోగాభ్యాసం వలన బ్రహ్మపదం , విష్ణువును పూజించడం వలన గోదానఫలాన్ని పొందవచ్చు

‌‌– అవధాని మోహన శర్మ

బోన భాగ్యాలు


బోనభాగ్యాలు

ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యాథులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం.  కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మ వారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు.

భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. 

మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమైసమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమ ర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. 

ఈ పండుగకే బోనాల పండుగ అని పేరు.

ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి. కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి.

తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే!

మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆల యంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు ఆదివారం నాడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్ దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. దిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండుగకు వీడ్కోలు పలుకుతారు.

పరమాత్మలో చేరే జీవాత్మ

బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమా త్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవు లను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం.

– అవధాని మోహన్​ శర్మ 


శుక్రవారం, జులై 17, 2026

వాన శబ్దం ‌‌(అరుణ నారదబట్ల)


వాన శబ్దం

============ 

 అరుణ నారదభట్ల


తాపం భరించలేని ఆకాశం 

కోపంతో ఊగిపోయింది

పిట్టలు మాడినట్టు 

మబ్బులు అలిగి గుమిగూడి

నల్లముఖాలై భయకంపితం! 


ఘొల్లుమని నేలన పడి 

మట్టిగుండెను హత్తుకుని

బొబ్బలెక్కిన దేహానికి 

లేపనాల్ని రుద్దుకుంటున్నాయ్ చెట్లతో! 


చెవుల్లో అల్లరి హోరు

ఒక్క సారిగా దిగిన బంధువుల్లా

ఝల్లుమని చినుకులు

రివ్వుమంటూ ఈదురుగాలి


అంతా హడావిడి

ఆవిరి పాట

పొగలు గక్కుతున్న ఇళ్ళ దేహాలన్నీ 

చీకటి వేషం కట్టిన వైనం!  

డామ్ ఢామని పేలుతున్న  ట్రాన్స్ఫార్మర్ల విఘాత దాడికి

మౌనాన్ని  తొడుక్కున్న ప్రపంచం


విరుగుతున్న చెట్లకొమ్మలు

రాలి పరుగులు తీస్తున్న పండు ఎండు టాకులు

భూమిని ముద్దాడే పందెంలో  పాచికలాటల గవ్వలశబ్దం!


తునాతునకలవకున్నా

పగిలిపగిలి చెర్రలు విడి అతుక్కుంటున్న గగనం 

చీకటిముంత నుండి ఒలకబోసే వెలుగు వేర్ల పుంతల్తో 


ఇవాళ భూమికి స్నేహిత తిరిగొచ్చింది

ఎన్నెన్ని వాడిన హృదయాలను

సాంత్వనపరిచిందో... 

వాన చినుకులు కౌగిలింతలై!!




"వాన శబ్దం" కవి: అరుణ నారదభట్ల

 కవితా విశ్లేషణ :  నవీన్​

"వాన శబ్దం" కవితలో ప్రకృతి వైభవాన్ని, వర్షం రాకతో ఏర్పడే భావోద్వేగాలను కవయిత్రి అత్యంత సజీవంగా ఆవిష్కరించారు. మండే ఎండను తట్టుకోలేక ఆకాశమే కోపగించి వానగా కురిసినట్లు తొలి పాదాల్లో అద్భుతమైన ఊహను వ్యక్తం చేశారు.

మట్టిని హత్తుకునే వాన చినుకులు, బొబ్బలెక్కిన భూమికి చెట్లు లేపనం రాస్తున్నట్లుగా చెప్పిన రూపకం ఎంతో హృద్యంగా నిలుస్తుంది. ఒక్కసారిగా వచ్చిన చినుకులు, ఈదురుగాలి, ఇళ్లపై పడే వర్షం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలే శబ్దాలు—ఇవన్నీ కలిసి వర్షకాలపు వాతావరణాన్ని పాఠకుడి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తాయి.

విరిగే చెట్ల కొమ్మలు, రాలే ఆకులు, మెరుపులతో చీలిపోయిన ఆకాశం వంటి దృశ్యాల ద్వారా వానలోని ఉగ్రరూపాన్ని కూడా కవయిత్రి సమతుల్యంగా చిత్రించారు.

కవిత చివర్లో మాత్రం భావం పూర్తిగా మారుతుంది. "భూమికి స్నేహిత తిరిగొచ్చింది" అనే ఒక్క వాక్యంతో వానను జీవానికి ఊపిరినిచ్చే మిత్రురాలిగా ఆవిష్కరించారు. "వాన చినుకులు కౌగిలింతలై" అనే ముగింపు కవితకు ఆత్మగా నిలుస్తుంది. వాడిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చే ప్రేమస్పర్శగా వర్షాన్ని ప్రతీకాత్మకంగా చూపించారు.

ఈ కవితలో రూపకాలు, ధ్వన్యనుకరణలు, దృశ్యవర్ణనలు, భావోద్వేగాల సమ్మేళనం పాఠకుడిని వర్షపు అనుభూతిలో ముంచెత్తుతుంది. ప్రకృతిని మానవ భావాలతో మేళవించి రాసిన ఈ కవిత ఆధునిక తెలుగు వచన కవిత్వానికి ఒక చక్కని ఉదాహరణ.


శంకరవాణి

 

మనసే నిజమైన పుణ్యక్షేత్రం

(గంగా రాధాకిషన్​)

మనసు నిండా రాక్షస భావాలు, ఈర్ష్య, అసూయ, కుళ్లు బుద్ధులు నింపుకొని, ఆ పశుత్వాన్ని అరికట్టుకోకుండా ఎన్ని పుణ్యక్షేత్రాల యాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో పుష్కర స్నానాలు చేసినా, ఎన్ని పారాయణాలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు, ధార్మిక కర్మలు చేసినా అవన్నీ వ్యర్థమే అని మన పురాణాలు, ఆధ్యాత్మిక బోధనలు చెబుతున్నాయి.

స్వామి వివేకానందుల బోధనలోని ఒక చక్కని భావం ఏమిటంటే—దేవాలయాలకు వెళ్లడం మాత్రమే పుణ్యమైతే, ఒక పక్షి ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశ విదేశాల్లోని ఎన్నో దేవాలయాల శిఖరాలపై వాలుతుంది కదా! దానికి జ్ఞానం లేదా పుణ్యం లభించిందా?

అలాగే భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు వంటి పవిత్ర గ్రంథాలను బీరువాలు, ర్యాక్‌లు నిరంతరం మోస్తూనే ఉంటాయి. మరి వాటికి జ్ఞానం కలిగిందా? మోక్షం లభించిందా?

అందుకే మనం ఎక్కడికి వెళ్లాం అన్నది ముఖ్యం కాదు. మన మనసును ఎంత నిర్మలంగా ఉంచుకున్నాం? మనలోని పశుత్వాన్ని ఎంతవరకు అరికట్టుకున్నాం? స్వార్థాన్ని ఎంతవరకు త్యజించాం? ప్రేమతత్వాన్ని ఎంతగా పెంచుకున్నాం? అన్నదే అసలైన విషయం.

అప్పుడు మన హృదయమే మనకు కాశీ, అమర్‌నాథ్, మానస సరోవరం. సమస్త పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు మనలోనే ఉన్నాయని తెలుసుకుంటాం.

ఓ మానవా! నీవే భగవంతుని ప్రతిరూపం. అందుకే మన పెద్దలు “దైవం మానుష రూపేణ” అన్నారు. భగవంతుని మనలోనే దర్శించుకోవడానికి ఆత్మపరిశీలన, సాధన అవసరం. అప్పుడే మనసుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం, జీవితానికి సార్థకత చేకూరుతాయి.

హృదయంలో తలచుకున్నదే నోటితో చెప్పాలి. నోటితో చెప్పినదే ఆచరణలో చూపించాలి. మాట, మనసు, చేతల మధ్య ఏకత్వం ఉండటమే నిజమైన మానవతా విలువ.

ఆహార నియమాలు పాటించండి. శారీరక వ్యాయామం చేయండి. అనుభవజ్ఞుల మాటలు వినండి. సత్సంగంలో పాల్గొనండి. నామస్మరణ చేయండి, చేయించండి. సేవ చేస్తూ శారీరక, మానసిక ఆనందాన్ని పొందండి.

ఇంతకంటే గొప్ప సాధన మనిషి జీవితంలో మరొకటి లేదు.

🙏 శంకరవాణి — సంపూర్ణ యదార్థవాది
సాయిరామ్


చేసిన పుణ్యమే శాశ్వతం

(గంగా రాధాకిషన్​)

"ఇల్లు మిగలదు… ఇల్లాలు మిగలదు… నాదనుకున్నది ఏదీ మిగలదు… చివరకు మిగిలేది చేసిన పుణ్యం. అది చేయగలిగినా బ్రతుకే ధన్యం."

ఈ భావం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన గీతంలోని చిరస్మరణీయమైన సందేశం.

ఈ భూమిపై మనమందరం అతిథులమే. ఇది ఒక సత్రం వంటిది. మనకంటే ముందు పండితులు, పామరులు, అధికారులు, అనధికారులు, ఆస్తికులు, నాస్తికులు, ధనవంతులు, పేదవారు, మహామేధావులు… ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపోయారు. ఒకరోజు మనం కూడా ఈ ప్రయాణాన్ని ముగించాల్సిందే. అయితే ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.

అయినా మనం శాశ్వతంగా ఇక్కడే ఉంటామని భావించడం మానవ మోహం. కానీ జీవితం యొక్క నిజమైన విలువ ఆస్తులు కూడబెట్టడంలో కాదు; మనం వెళ్లిపోయిన తర్వాత కూడా పదిమంది ప్రేమతో, గౌరవంతో గుర్తుచేసుకునేలా జీవించడంలో ఉంది.

పశుపక్షులకు కూడా ఆకలి, నిద్ర, భయం, సంతానం ఉంటాయి. కానీ మనిషికి వాటికి మించిన గొప్ప వరం వివేకం, దయ, ధర్మం. అందుకే భగవద్గీతలో "జాతస్య హి ధ్రువో మృత్యుః" అని చెప్పబడింది. జన్మించిన ప్రతి ఒక్కరికీ మరణం అనివార్యం. కాబట్టి జీవితం ఉన్నంతకాలం మంచి పనులు చేస్తూ, ఇతరులకు ఉపయోగపడుతూ, ఆత్మసంతృప్తితో జీవించడం మన కర్తవ్యం.

మన వద్ద ఎంత ధనం ఉందన్నది కాదు ముఖ్యం. ఆ ధనాన్ని ఎంతమందికి మేలు చేసేలా వినియోగించామన్నదే అసలు విలువ. నిస్వార్థ సేవ, దానం, ధర్మం, మానవత్వం – ఇవే మనిషిని మహోన్నతుడిగా నిలబెడతాయి. అలాంటి వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

"వస్తా వట్టిదే… పోతా వట్టిదే… ఆశ ఎందుకన్నా… చేసిన ధర్మం చెడని పదార్థం… చేరును నీ వెంట."

మనిషి వెనుక మిగిలేది సంపద కాదు… సత్కార్యాలు. పేరు కాదు… పరులకు చేసిన మేలు. అందుకే ప్రతి రోజూ ఒక మంచి పని చేస్తూ, మానవత్వాన్ని నిలబెడుతూ జీవిద్దాం. అదే జీవితానికి నిజమైన సార్థకత.

– శంకర వాణి
సాయిరామ్ 🙏

============================================================

సంసారం – సుఖమా? దుఃఖమా?

(గంగా రాధాకిషన్​)

అనివార్యంగా అనిపిస్తున్న ఈ సంసారం అనే చక్రంలో నిజంగా శాశ్వతమైన సుఖం, సంతృప్తి, ఆనందం ఉన్నాయా? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, వాటికి స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమే.

దుఃఖాలు వరుసగా వస్తూనే ఉంటాయి. వాటి మధ్యలో కొద్దిసేపు మనకు సుఖం కలిగినట్లు అనిపిస్తుంది. అయితే అది నిజమైన సుఖమా? లేక కేవలం దుఃఖం కొద్దిసేపు లేకపోవడమేనా? అనే సందేహం కలుగుతుంది.

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.

ఒక బలమైన వ్యక్తి భుజంపై బరువైన ధాన్యపు బస్తాను మోసుకుంటూ నడుస్తున్నాడు. కొంతసేపటికి ఒక భుజం నొప్పి పెరగడంతో ఆ బస్తాను మరో భుజంపైకి మార్చుకుంటాడు. అప్పుడు అతనికి కాస్త ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. కానీ ఆ ఉపశమనం శాశ్వతం కాదు. కొంతసేపటికే రెండో భుజం కూడా నొప్పి పెడుతుంది. మళ్లీ మొదటి భుజంపైకి మార్చుకోవాల్సి వస్తుంది.

మన సంసార జీవితం కూడా ఇలాగే ఉండవచ్చేమో! మనం సుఖంగా భావించేది, నిజానికి ఒక బాధ నుండి మరో బాధకు మారే మధ్యలో కలిగే తాత్కాలిక ఉపశమనమే కావచ్చు.

అందుకే ఆచార్యులు ఇలా చెప్పారు:

"సంసారసాగరం దుఃఖం."

అంటే, సంసారం అనేది సముద్రంలా అపారమైన దుఃఖాలతో నిండి ఉందని అర్థం.

మరి ఈ సంసారసాగరాన్ని ఎలా దాటాలి?

భగవంతుని మనసా, వాచా, కర్మణా శరణు వేడుకోవాలి. "ప్రభూ! ఈ సంసారసాగరాన్ని దాటించి, నన్ను ఉద్ధరించు" అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. భక్తి, ధర్మాచరణ, సత్సంగం, ఆత్మవిచారణ అనే మార్గాల్లో నడుస్తూ ఆయన అనుగ్రహాన్ని కోరాలి.

ఇదే మానవ జన్మకు సార్థకమైన మార్గమని నా అభిప్రాయం.

ఓం తత్ సత్.

— శంకర వాణి

సంపూర్ణ యదార్థవాది
సాయిరామ్ 🌹🙏

======================

మిమ్మల్ని మీరు నమ్మండి... 

విజయం మీ వెంట నడుస్తుంది!

కొందరు మీ విజయాన్ని చూసి తట్టుకోలేరు. మీ మంచితనాన్ని అంగీకరించలేరు. మీ కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతుంటే ఓర్వలేరు. మీరు నిస్వార్థంగా చెప్పే మంచి మాటలను, విలువైన సూచనలను అనుసరించి కొందరు జీవితంలో ముందుకు సాగుతూ, కృతజ్ఞతతో మిమ్మల్ని ప్రశంసిస్తుంటే కూడా కొందరికి అది నచ్చదు.

వారికి తెలియని నిజం ఒక్కటే... వారు ఎంత విమర్శించినా, మీ స్థాయిని అందుకోలేరు. విమర్శలు చేసే వారు చాలాసార్లు ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయపడేవారే.

"ఏనుగు ముందుకు సాగుతుంటే కుక్కలు మొరిగినా, ఏనుగు వెనుదిరిగి చూడదు."
అలాగే మనం కూడా ప్రతి విమర్శకు స్పందిస్తూ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు.

మంచిని చెడుగా మాట్లాడేవారి గురించి బాధపడకండి. వారి మాటలు వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి, మీ విలువను కాదు. "కుక్క కరిచిందని మనం తిరిగి కుక్కను కరవము" అన్నట్లుగా, మన స్థాయిని ఎప్పుడూ కాపాడుకోవాలి.

అనవసరంగా కాలహరణం చేసే, ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. సమయం జీవితంలో అత్యంత విలువైన సంపద. దాన్ని మీ లక్ష్యాల కోసం, మీ ఎదుగుదల కోసం వినియోగించండి.

మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సామర్థ్యాన్ని విశ్వసించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దైవ పరీక్షలు ఎదురైనా, మీరు నమ్ముకున్న లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేయండి. ఒకరోజు ప్రపంచమే మీ శక్తిని, మీ విలువను గుర్తిస్తుంది.

మన జీవన విధానం, మన క్రమశిక్షణ, మన శారీరక వ్యాయామమే మనకు దైవ రక్ష.








– శంకర వాణి
సంపూర్ణ యదార్థవాది
సాయిరామ్ 🙏

మంథనికి న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్

 

మంథనికి న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్  

భవన నిర్మాణానికి రూ.20 కోట్లు

మంథని, జూలై 17 (దిక్సూచి): పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు–భవనాల (టీఆర్‌అండ్‌బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మారుతున్న నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్య శిక్షణను యువతకు అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది. ఇక్కడ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులు నిర్వహించబడతాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధితో పాటు దేశీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

మంథనికి ఈ ప్రతిష్ఠాత్మక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేటాయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తర తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించే కేంద్రంగా మంథని ఎన్‌ఏసీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం, జులై 16, 2026

యుకె కు ఎగుమతులు పెంచుతాం


యుకె కు ఎగుమతులు పెంచుతాం

ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, హైదరాబాద్​, జూలై 16, 

భారత్- యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సిఇటిఏ) వల్ల తెలంగాణా గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యుకె సుంకాలను తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. యుకె డిప్యూటి ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కె అయర్ (Chandru K Iyer) ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. రెండు దేశాల మధ్య రూ.3.25 లక్షల కోట్ల (25 Billion Pounds) వాణిజ్యానికి అవకాశం ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణాలో పారిశ్రామిక వస్తూత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్, చిప్ ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వృద్ధి చేసామని, యుకె పారిశ్రామికవేత్తలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రం నుంచి యుకెకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. కొత్త ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాల వల్ల ఎగుమతులను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం తెలంగాణాలోనే జరుగుతున్నాయని, వ్యాక్సిన్ ఎగుమతుత్లో 30 శాతం రాష్ట్రానిదేనని శ్రీధర్ బాబు తెలిపారు. విమానయాన రంగానికి అవసరమైన ప్రిసిషన్ విడిభాగాల ఉత్పత్తిలో తెలంగాణా అగ్రస్థానంలో ఉందని గుర్తు చేసారు. ప్రపంచ ప్రఖ్యాత ఏవియేషన్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్, విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీస్, డసో (Dassault) ఏవియేషన్ ఉత్పత్తి చేసే రఫేల్ విమానాల విడిభాగాల తయారీ, ఓవర్ హాలింగ్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, సఫ్రాన్ ఏవియేషన్ సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. హైదరాబాద్ లో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా పలు ప్రఖ్యాత సంస్థలు 450 జిసిసి కేంద్రాలను ఏర్పాటు చేసాయని చెప్పారు. యుకెకు ఎగుమతి చేయగలిగే వస్తువుల తయారీపై స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి సిఇటిఏ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆధిత్యకు శ్రీధర్ బాబు సూచించారు. యుకె నుంచి భారత్ పర్యటించే మేయర్ల బృందాన్ని హైదరాబాద్ ను కూడా సందర్శించేలా చూడాలని చంద్రు కె అయర్ ను మంత్రి కోరారు. అధికారులతో కలిసి యుకెను సందర్శించి అక్కడ పారిశ్రామిక, వాణిజ్య ఎకోసిస్టంను పరిశీలించాలని చంద్రు అయర్ శ్రీధర్ బాబును ఆహ్వానించారు. యుకె ప్రతినిధి బృందంలో సిద్దార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ స్సెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.



ఆషాఢం - నవ దంపతులు

ఆషాఢంలో నవ దంపతులకు ఎడబాటు ఎందుకు !?

 ఆషాడం అంటే అందరికీ ఇష్టమైనా,  కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాఢంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్త గారు ఒకేచోట ఉండకూడదు. ఒకరికి ఒకరు ఎదురు పడకూడదని చెబుతూ ఉంటారు.  అంతేకాకుండా, సాగు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు. కాబట్టి, కొత్త అల్లుడికి మర్యాదల  విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశ్యంతో కూడా ఎడబాటుగా ఉంచుతారు.

 ఆషాఢమాసంలో కొత్త దంపతులు కలిసి ఉండరాదనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు?  దీనివల్ల కలిగే అనర్థం ఏమిటి?  అసలు కలిసి ఉంటే ఏమవుతుంది?  

ఆషాడ మాసం కాదిది, - నవదంపతుల సరస శృంగారాల సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల, విరహాల ఆరూఢమాసం అంటూ ఓ కవి దీనిని వర్ణించాడు.

ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటలకు ఎడబాటు తప్పదు.  అత్తా-అల్లుడు ఎదురు పడకూడదనే ఆచారం ఉంది.  అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలసి ఉండకూడదని అంటారు. దీనివెనుక కూడా ఒక అర్థం ఉంది. 

పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం.  సంపాదన మాట అటుంచి, తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని,  కొత్త వలపు మోజులోపడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టారు.

అంతే కాదు, ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణంవల్ల బ్యాక్టీరియా, వైరస్ లు అంటువ్యాధులుగా బాగా ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్ళికూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డమీద వాటి ప్రభావం ఉంటుంది అనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి.  కావున ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండడమే  క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు.  

ఈ ఆషాఢాన్ని అనారోగ్యమాసంగా పేర్కొంటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. కాలువలలోనూ, నదులలోనూ ప్రవహించే నీరు  అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.  ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులోని పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది.

అలాగే, ఆషాడం తరువాత వచ్చే శ్రావణమాసంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచిరోజులే వుంటాయి. ఆ శుభ ఘడియలలో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు.  ఆషాఢంలో గర్భం దాల్చితే 9 నెలలకు అంటే చైత్రానికి పూర్తవుతుంది. ఆ సమయంలో ఎండకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్డుకోలేరని ఈ నియమం పెట్టారు.  అలాగే ఒక నెల వియోగం తరువాత కలుసుకుంటే, అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు అని కూడా అంటారు. 

పూర్వ కాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది.  కష్టపడి పని చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే, వ్యవసాయ పనులు జరుగవు.  వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడి పోవాల్సిందే.  

అందుకే కొత్త కోడలు  పుట్టింటిలో ఉండాలి. అల్లుడు అత్తారింటివైపు చూడకూడదని నియమం పెట్టారు.

– అవధాని మోహన శర్మ  

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026