వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం
ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం..
రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలే లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దిక్సూచి, ధర్మపురి:
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వైభవంగా వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాగంలో భాగంగా కలశ గణపతి పూజ, 108 కలశాల స్థాపన, వరుణ జపం, 108 కలశాలతో శ్రీ రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పించి వరుణ యాగం నిర్వహించినట్లు చెప్పారు.
ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అంతటా సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సుమారు 11 మంది వేదపండితులు పాల్గొని ప్రత్యేక రుద్రాభిషేకాలు, వరుణ యాగాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు లభించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చిలుమల లావణ్య లక్ష్మణ్, దేవస్థాన ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేదపండితులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి