Dtv updates
శుక్రవారం, ఆగస్టు 28, 2026
మంథని లో ఘనంగా జంధ్యాల పౌర్ణమి
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి శ్రీధర్‌బాబు
దిక్సూచి, హైదరాబాద్:
గుండె శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజా సేవలో కొనసాగాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు.
గురువారం, ఆగస్టు 27, 2026
రక్షాబంధన్.. రక్తసంబంధాన్ని మించిన అనుబంధానికి ప్రతీక
(దిక్సూచి ప్రత్యేక కథనం)
అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే పండుగ.. రక్షాబంధన్. చేతికి కట్టే ఓ చిన్న రాఖీ వెనుక అపారమైన ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యత దాగి ఉంటాయి. అందుకే ఇది కేవలం ఓ పండుగ కాదు.. తరాలు మారినా తరగని కుటుంబ బంధానికి ప్రతీక.
చిన్ననాటి అల్లరి నుంచి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకుల వరకు అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రత్యేకమైనది. ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా.. రాఖీ రూపంలో ఆ భావాన్ని వ్యక్తం చేస్తారు. చెల్లెలు లేదా అక్క తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, అతని సంతోషం, ఆరోగ్యం, క్షేమాన్ని కోరుకుంటుంది. సోదరుడు ఆమెకు అండగా ఉంటాననే భరోసాను ఇస్తాడు.
రాఖీ వెనుక ఉన్న సంప్రదాయం
‘రక్ష’ అంటే కాపాడటం.. ‘బంధన్’ అంటే బంధం. ఈ రెండు పదాల కలయికే రక్షాబంధన్. పురాణ కాలం నుంచి సోదర–సోదరీ బంధానికి రక్షణ, ప్రేమ, బాధ్యతలను జోడించిన సంప్రదాయంగా ఇది కొనసాగుతున్నదని విశ్వసిస్తారు. కాలానుగుణంగా రాఖీ కట్టే విధానాలు మారినా.. దాని వెనుక ఉన్న ఆత్మ మాత్రం మారలేదు.
పల్లె నుంచి పట్టణం వరకు..
ఒకప్పుడు రాఖీ పండుగ అంటే పల్లెల్లో ప్రత్యేక సందడి. అక్కాచెల్లెళ్లు దూర ప్రాంతాల నుంచి సోదరుల ఇళ్లకు చేరుకునేవారు. ఇంటిల్లిపాదీ కలిసి పండుగ జరుపుకునేవారు. ఇప్పుడు నగర జీవనశైలి, ఉద్యోగాలు, విదేశీ వలసల కారణంగా సోదరులు–సోదరీమణులు దూరంగా ఉన్నా.. రాఖీ బంధం మాత్రం దూరం కాలేదు.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సోదరుడికి కొరియర్ ద్వారా రాఖీ పంపడం.. వీడియో కాల్లో రాఖీ కట్టడం.. ఆన్లైన్లో బహుమతులు పంపడం వంటి కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతికత మారినా.. భావోద్వేగం మాత్రం అదే.
బహుమతుల కంటే విలువైన బంధం
రాఖీ పండుగ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ పండుగ అసలు సందేశం బహుమతుల్లో కాదు.. బంధంలో ఉంది. కష్టకాలంలో సోదరుడికి సోదరి, సోదరికి సోదరుడు అండగా నిలవడం.. జీవితంలో విజయాలను కలిసి పంచుకోవడం.. బాధల్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడమే రక్షాబంధన్ స్ఫూర్తి.
మారుతున్న కాలంలో మరింత అవసరం
నేటి వేగవంతమైన జీవనంలో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు కొంత దూరమవుతున్నాయి. వ్యక్తిగత జీవితాలు, ఉద్యోగ ఒత్తిళ్లు, నగర జీవనం కారణంగా బంధువులతో కలిసే సమయం తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్షాబంధన్ వంటి పండుగలు కుటుంబ బంధాలను మరోసారి గుర్తు చేస్తాయి.
రాఖీ మణికట్టుకు కట్టే దారం మాత్రమే కాదు.. ‘నేను ఉన్నాను’ అనే భరోసా. ‘నువ్వు ఒంటరివి కాదు’ అనే ఆప్యాయత. ‘ఏ పరిస్థితుల్లోనైనా నీకు అండగా ఉంటాను’ అనే నమ్మకం.
రాఖీ.. ఓ జ్ఞాపకం
బాల్యంలో సోదరి చేతికి కట్టిన రాఖీ.. పెరిగేకొద్దీ ఒక మధుర జ్ఞాపకంగా మారుతుంది. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా చిన్ననాటి అనుబంధాన్ని గుర్తు చేసే రోజు రక్షాబంధన్. అందుకే ఈ పండుగకు వయసుతో సంబంధం లేదు.. దూరంతో సంబంధం లేదు.. కాలంతో సంబంధం లేదు.
రాఖీ దారం చిన్నదే కావచ్చు.. కానీ అది కలిపే బంధం మాత్రం ఎంతో పెద్దది.
రక్షాబంధన్ అంటే చేతికి రాఖీ కట్టడం కాదు.. హృదయానికి హృదయాన్ని కట్టడం.
రక్షాబంధన్‌కు చారిత్రక రంగు అద్దిన రోక్సానా–పోరస్ గాథ
క్రీ.పూ. 326లో భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ ది గ్రేట్‌కు, భారత రాజు పోరస్కు మధ్య జరిగిన హైడస్పెస్ యుద్ధం చరిత్రలో ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధానికి సంబంధించి రక్షాబంధన్‌తో ముడిపడిన ఓ ఆసక్తికరమైన గాథ తరతరాలుగా ప్రచారంలో ఉంది.
ప్రసిద్ధ కథనం ప్రకారం.. అలెగ్జాండర్ భార్య రోక్సానా, యుద్ధానికి ముందు భారత రాజు **పోరస్ (పురు)**కు పవిత్రమైన రాఖీని పంపిందట. తన భర్త అలెగ్జాండర్‌ను సోదరుడిగా భావించి, యుద్ధంలో అతని ప్రాణాలకు హాని చేయవద్దని కోరిందని గాథ చెబుతుంది.
రాఖీని స్వీకరించిన పోరస్ ఆ బంధానికి గౌరవం ఇచ్చాడని చెబుతారు. యుద్ధభూమిలో అలెగ్జాండర్ తనకు చిక్కిన సమయంలో, అతని చేతికి ఉన్న రాఖీని చూసి తాను ఇచ్చిన మాటను గుర్తు చేసుకున్నాడని.. అందుకే అతని ప్రాణాలను కాపాడాడని ఈ గాథలోని ప్రధాన ఘట్టం.
బుధవారం, ఆగస్టు 26, 2026
స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌లో భాగస్వామ్యం అవ్వండి
* స్కిల్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు కలిసి రండి
* పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
దిక్సూచి, హైదరాబాద్:
తెలంగాణను స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్ఎల్ఎఫ్), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘బోయింగ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్ కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆధునిక, పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించేందుకు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అకడమిక్ కరిక్యులమ్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడంతో పాటు అనేక కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకుంటూ భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ప్రతినిధులు ప్రవీణ, యశోద, రష్మీ ప్రభ మిశ్రా, బితుపాన్ బోరా, రత్న శేఖర్ రెడ్డి, ఓం దేవ్, డా. విజయ్ కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలి: దుద్దిల్ల శ్రీనుబాబు
దిక్సూచి, గోదావరిఖని:
ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రెండో దశపై బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనుబాబు మాట్లాడుతూ.. సర్వేలో ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శిక్షణలో అందించిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుని బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏ పట్టణ, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలన్నారు. మన ఓట్లను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్వే విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించిన ఆయన, ఈ అంశాలపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రతినిధులపై ఉందని నొక్కిచెప్పారు. కొందరు బూత్ స్థాయి ఏజెంట్ల పనితీరుపై ఇబ్బందులు ఎదురైన అంశం సమావేశంలో ప్రస్తావనకు రాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెంట్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పరిశీలకులు దీపక్ రాథోడ్, ప్రభాకర్‌రెడ్డి, ఫహీం, కాంగ్రెస్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో దుద్దిళ్ల శ్రీను బాబు
దిక్సూచి, మంథని:
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరిపై ఆదివరాహ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీను బాబు ఆకాంక్షించారు.
జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవల్లో విశేషంగా పాల్గొన్న వారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో మెమెంటోలను దుద్దిళ్ల శ్రీను బాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
మంగళవారం, ఆగస్టు 25, 2026
త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌కు ఘన సన్మానం
దిక్సూచి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి భారత కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌లను మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కలిసి క్రీడాకారిణులను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పార్టీ బలోపేతానికి పెద్దపీట
హైదరాబాద్ గాంధీభవన్‌లో మంగళవారం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్, మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేరవేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించాల్సిన అవసరాన్ని నేతలు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే దిశగా నాయకులు సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఏఐసీసీ ప్రతినిధులు, జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల సమన్వయంతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌కు మరింత పటిష్టమైన పునాది వేయడమే లక్ష్యంగా పీఏసీ సమావేశం సాగింది.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
సోమవారం, ఆగస్టు 24, 2026
మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు
పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పిల్లల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేందుకు అల్పాహార పథకం
సుమారు రూ.7.5 కోట్ల సింగరేణి సీఎస్ఆర్ నిధులతో ఆధునిక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు
గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం
దిక్సూచి, మంథని, ఆగస్టు 24:
పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2011లో హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.
హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద 10 మైళ్ల పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలను చేపడుతోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలో కూడా అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన సూచనల మేరకు సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో మంథనిలో ఆధునిక యంత్రాలతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక్కడ గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు.
విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని మంత్రి తెలిపారు. వారానికి కనీసం మూడు సార్లు విద్యార్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. పిల్లలకు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం కాకుండా వివిధ రకాల టిఫిన్లను అందిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థిని గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరయ్యే పరిస్థితి ఉండేదని తన కష్టాలను మంత్రితో పంచుకుంది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత సాధించడంతో పాటు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదల పొందుతారని మంత్రి అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని కలెక్టర్ తెలిపారు. తాజాగా ప్రారంభించిన అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
జిల్లాలో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఫిన్లాండ్లో శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారని, భవిష్యత్తులో మరింత మంది ఉపాధ్యాయులు విదేశాల్లో శిక్షణ పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్ట పునాది వేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్ జి.3.జి యం, తహసిల్దార్ ఆరిపోద్దిన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం, ఆగస్టు 23, 2026
ఆకలికి సెలవు.. చదువుకు వెలుగు
40 వేల మంది పేద పిల్లల కోసం మంథనిలో ‘ఒకే వంటిల్లు’.. యంత్రాల వెనుక ఓ మానవీయ ఆలోచన
దిక్సూచి ప్రత్యేక కథనం | మంథని
ఉదయం పాఠశాల గంట మోగుతుంది.
చేతిలో పుస్తకాలు.. వీపుపై బ్యాగులు.. కళ్లల్లో భవిష్యత్తు కలలు.
కానీ ఆ కలల మధ్య ఓ చిన్న సమస్య పెద్ద అడ్డంకిగా మారుతుంది—ఆకలి.
ఖాళీ కడుపుతో పాఠం వినడం ఎంత కష్టం? పుస్తకం ముందున్నా మనసు భోజనం వైపు మళ్లితే చదువుపై ఏకాగ్రత ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నకు మంథని ఓ వినూత్న సమాధానం చెబుతోంది.
“ముందు పిల్లల కడుపు నింపాలి.. ఆ తర్వాత వారి కలలకు రెక్కలు ఇవ్వాలి.”
ఈ ఆలోచనకు రూపమే మంథని మార్కెట్ యార్డులో ఏర్పాటైన భారీ సెంట్రలైజ్డ్ కిచెన్.
ఇది వంటిల్లు కాదు.. ఆకలిపై యుద్ధం
సుమారు 8 ఎకరాల్లో విస్తరించిన ఈ కిచెన్‌ను బయట నుంచి చూస్తే మరో భారీ నిర్మాణంలా కనిపిస్తుంది. కానీ దాని లోపలికి అడుగుపెడితే ఓ కొత్త ప్రపంచం కనిపిస్తుంది.
పొయ్యి పొగ లేదు.
వంట పాత్రలతో హడావుడి లేదు.
గంటల తరబడి కూరగాయలు తరిగే పరిస్థితి లేదు.
అన్నీ యంత్రాల ఆధారంగా జరుగుతాయి.
గంటకు 5,400 ఇడ్లీలు.
ఆటోమేటిక్ దోశ మిక్సింగ్, తయారీ.
పూరీల కోసం ప్రత్యేక మిషన్.
కూరగాయల వాషింగ్, కటింగ్ యూనిట్లు.
మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్.
ఆర్వో వాటర్ ప్లాంట్.
సెంట్రల్ గ్యాస్ బ్యాంక్.
పాత్రలు శుభ్రం చేసే ఆటోమేటిక్ వ్యవస్థ.
అంటే.. ఇది సంప్రదాయ వంటశాల కాదు.
ఓ పారిశ్రామిక స్థాయి ‘ఫుడ్ ప్రొడక్షన్ సిస్టమ్’.
కానీ ఇక్కడ తయారయ్యేది మాత్రం అమ్మకానికి కాదు.
40,052 మంది పిల్లల కోసం.
40 వేల కడుపులు.. ఒకే వంటిల్లు
పెద్దపల్లి, మంథని, రామగుండం ప్రాంతాల్లో ఇప్పటివరకు పాఠశాలల వారీగా వంట చేయడం వల్ల సమయం, నాణ్యత, సిబ్బంది వంటి అనేక సవాళ్లు ఉండేవి.
ఇప్పుడు ఆ విధానానికి భిన్నంగా ఒకే చోట భారీ స్థాయిలో ఆహారం తయారవుతుంది.
పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఈ వ్యవస్థ ద్వారా ఆహారం అందనుంది.
వందలాది పాఠశాలలు.. వేలాది కుటుంబాలు.. 40 వేలకుపైగా విద్యార్థులు..
కానీ వంటిల్లు మాత్రం ఒక్కటే.
ఇదే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
‘టిఫిన్ టైమ్’ మారాలి.. పిల్లల టైమ్ వృథా కాకూడదు
వంట ఆలస్యమైతే భోజనం ఆలస్యం.
భోజనం ఆలస్యమైతే తరగతులపై ప్రభావం.
ఈ గొలుసును తెంచడమే సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.
ఉదయం 8 గంటలకే టిఫిన్, సాంబార్, కూరలను సీల్డ్ కంటైనర్లలో పాఠశాలలకు పంపేలా వ్యవస్థను రూపొందించారు.
పిల్లల సమయం వంట కోసం కాదు.. చదువు కోసం.
ఈ ఒక్క మార్పే వేలాది విద్యార్థుల దైనందిన జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
‘సింగరేణి’ కథలో మరో అధ్యాయం
మంథని ప్రాంతం అంటే సింగరేణి కూడా గుర్తుకు వస్తుంది.
ఇన్నాళ్లు భూగర్భంలో బొగ్గును వెలికితీసిన సింగరేణి.. ఇప్పుడు అదే ప్రాంతంలోని పిల్లల భవిష్యత్తుకు పరోక్షంగా బలమిస్తోంది.
సింగరేణి సహకారంతో, ప్రభుత్వం–హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఆధునిక వంటశాల రూపుదిద్దుకుంది.
బొగ్గుతో పరిశ్రమలకు ఇంధనం ఇచ్చిన సింగరేణి..
ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు ఆహారం అందించే కార్యక్రమంలో భాగమైంది.
ఇది ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన మలుపు.
యంత్రాలు వంట చేస్తాయి.. నాణ్యతను మనుషులే కాపాడాలి
ఆటోమేషన్ ఎంత పెరిగినా.. వేలాది మంది పిల్లలకు ఆహారం అందించే వ్యవస్థలో అసలు సవాలు నాణ్యత.
ఒక ఇంట్లో వండే వంటకు, 40 వేల మందికి వండే వంటకు తేడా చాలా ఉంది.
అందుకే పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వంట ప్రక్రియ, ప్యాకింగ్, రవాణా—ప్రతి దశ కీలకమే.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కిచెన్‌ను పరిశీలించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు.
యంత్రాలు తప్పు చేయకపోవచ్చు.. కానీ వ్యవస్థను నడిపించే మనుషుల పర్యవేక్షణే విజయానికి కీలకం.
శ్రీధర్ బాబు ‘ఆలోచన’ నుంచి ‘ఆచరణ’ వరకు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమానికి ముందడుగు వేశారు.
ఆయన ఆలోచనలోని అసలు సారాంశం ఒక్కటే—
పేద పిల్లవాడి పరిస్థితి అతని చదువుకు అడ్డంకి కాకూడదు.
ఇంటి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా.. పాఠశాలలో అతనికి కనీసం ఒక పూట మంచి ఆహారం దొరకాలి.
ఎందుకంటే..
కడుపు నిండిన పిల్లవాడి చేతిలో పుస్తకం బలంగా ఉంటుంది.
పుస్తకం బలంగా ఉంటే.. భవిష్యత్తు కూడా బలపడుతుంది.
ఇది భోజన పథకం కాదు.. భవిష్యత్తు పథకం
మంథని వంటిల్లు గురించి మాట్లాడేటప్పుడు ఇడ్లీలు ఎన్ని? ఎంత సామర్థ్యం? ఎన్ని యంత్రాలు? అనే లెక్కలు చెప్పడం సులభం.
కానీ అసలు లెక్క వేరే.
40,052 మంది పిల్లలు.
40,052 ఆకలి కడుపులు.
40,052 కుటుంబాల ఆశలు.
40,052 భవిష్యత్తులు.
వారిలో ఒక్క విద్యార్థి అయినా ఆకలి కారణంగా పాఠశాలలో వెనుకబడకుండా చూడగలిగితే.. ఈ వంటిల్లు తన లక్ష్యాన్ని సాధించినట్టే.
దిక్సూచి మాట
మంథని వంటిల్లు ఒక భవనం కాదు.
ఒక యంత్రాల సముదాయం కాదు.
ఒక వంటశాల మాత్రమే కాదు.
పేదరికం వల్ల పిల్లల కలలకు ఆకలి అడ్డుకాకూడదనే సంకల్పానికి ఇది ప్రతీక.
ఇక్కడ యంత్రాలు ఇడ్లీలు తయారు చేస్తాయి..
పాత్రలు అన్నం వండుతాయి..
వాహనాలు ఆహారాన్ని తరలిస్తాయి..
కానీ ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఉన్న అసలు శక్తి మాత్రం ఒక్కటే—
“ఏ బిడ్డా ఆకలితో బడిలో కూర్చోకూడదు.”
ఆకలికి సెలవు పెడితే..
చదువుకు దారి తెరుచుకుంటుంది.
ఆ దారిని చూపించడమే.. ‘దిక్సూచి’కి కనిపించిన మంథని వంటిల్లు అసలు కథ.
మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రేపు పర్యటన వివరాలు
దిక్సూచి, మంథని, ఆగస్టు 23: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం (ఆగస్టు 24) మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 9 గంటలకు గంగాపురిలో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 22 వేల మంది విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించే కార్యక్రమం ఈ వంటశాల ద్వారా కొనసాగనుంది.
ఉదయం 10.30 గంటలకు గంగాపురిలో రూ.2.55 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభిస్తారు.
అనంతరం ఉదయం 11.30 గంటలకు కమాన్‌పూర్ మండలంలో రూ.75 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ (ఎంఆర్ఓ) కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆదివరాహ స్వామి ఆలయానికి రూ.95 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు. కమాన్‌పూర్ గ్రామంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న ఈజీఎస్ పనులకు శ్రీకారం చుడతారు.
అలాగే గుండారం గ్రామం రాజాపూర్ నుంచి మంగపేట వరకు రూ.3.05 కోట్లతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆదివరాహ స్వామి జయంతి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు.
శనివారం, ఆగస్టు 22, 2026
కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యానికి కొత్త బాట
విద్య, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధిపై విస్తృత చర్చలు
దిక్సూచి ప్రతినిధి, లండన్:
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి.. నగరాన్ని అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో కేంబ్రిడ్జ్ భాగస్వామి కావాలని ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట సిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి.
అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం, శ్రీధర్‌బాబు
లండన్‌లోని చారిత్రక అంబేద్కర్ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921–22లో నివసించిన ఈ భవనాన్ని ప్రస్తుతం ఆయన ఆశయాలకు అంకితమైన మ్యూజియంగా నిర్వహిస్తున్నారు.
దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అంశాలను యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ చైర్ సంతోష్ దాస్ MBE వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని తెలుసుకోవడం, ఆయనతో ముడిపడిన వస్తువులను చూడటం తన జీవితంలోని గొప్ప అనుభూతుల్లో ఒకటని పేర్కొన్నారు.
కేంబ్రిడ్జ్ భాగస్వామ్యం, అంబేద్కర్ హౌస్ సందర్శన.. తెలంగాణ రైజింగ్ బృందం లండన్ పర్యటనకు విద్య, పరిశోధనతో పాటు సామాజిక న్యాయ స్ఫూర్తిని జోడించాయి.
ఎస్ఐఆర్ ఫేజ్–2పై బీఎల్ఏలకు అవగాహన
స్క్రీన్ ద్వారా ఎస్ఐఆర్ ఫేజ్–2లో చేపట్టాల్సిన ప్రక్రియ, బూత్ స్థాయిలో బీఎల్ఏల బాధ్యతలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఓటర్ల జాబితాలో తప్పులు, మార్పులను గుర్తించడం తదితర అంశాలను వివరించారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బీఎల్ఏలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్
దిక్సూచి, హైదరాబాద్:
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 2027 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో యూజీసీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.
లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. విద్య, పాలన, ప్రజా విధానాలు, ఉన్నత విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఒక ఫెడరల్ విశ్వవిద్యాలయ వ్యవస్థ కాగా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), కింగ్స్ కాలేజ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు దాని వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ప్రతిపాదిత క్యాంపస్‌ను తొలుత సోమాజిగూడలోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా నిర్వహించి, అనంతరం నగర శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలోని ఎడ్యుకేషన్ జోన్‌కు తరలించే ప్రణాళిక ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ క్యాంపస్ ద్వారా వివిధ విద్యా విభాగాలు, స్కూళ్ల పరిధిలో విస్తృత స్థాయిలో అంతర్జాతీయ కోర్సులను అందించే అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటైతే.. తెలంగాణ విద్యార్థులు ప్రపంచస్థాయి విద్యను స్వరాష్ట్రంలోనే పొందే అవకాశం లభించడంతో పాటు, అంతర్జాతీయ విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్‌తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం
