Dtv updates
గురువారం, ఆగస్టు 06, 2026
పట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
మంగళవారం, ఆగస్టు 04, 2026
మహాదేవపూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
క్యాన్సర్ నిర్ధారణ, కంటి పరీక్షలు – అర్హులకు ఉచిత అద్దాల పంపిణీ
దిక్సూచి, మహాదేవపూర్, ఆగస్టు 4 :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల (తాయి) స్మారకార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, ఓమెగా హాస్పిటల్, కరీంనగర్‌కు చెందిన సుషిత హాస్పిటల్, పుష్పగిరి హాస్పిటల్ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వందలాది మంది ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి వద్దకే చేరవేయాలనే లక్ష్యంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాటారం డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 680 మందికి హైదరాబాద్‌లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి చూపు ప్రసాదించినట్లు చెప్పారు. అలాగే మంథని నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 45 వేల మందికి కంటి పరీక్షలు, చికిత్సలు అందించినట్లు వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యమని, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను కొనసాగిస్తామని శ్రీను బాబు తెలిపారు. శిబిరం విజయవంతానికి సహకరించిన వైద్య బృందాలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ప్రభుత్వ కార్యాలయాలకు 'టీ-ఫైబర్' ఇంటర్నెట్ మాత్రమే."..
* సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు
* ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయండి
* టీ - ఫైబర్' సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు
దిక్సూచి, హైదరాబాద్:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... టీ-ఫైబర్ నెట్వర్క్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశముందని వెల్లడించారు. అంతేకాకుండా... ఇంట్రానెట్ బేసిస్‌లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడం ద్వారా రాష్ట్ర డేటా సెంటర్‌కు అనుసంధానం ఏర్పడి, పూర్తి స్థాయి డేటా సెక్యూరిటీ చేకూరుతుందన్నారు. గత ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ – ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఫలితంగా... ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే సుమారు రూ.13 కోట్లు ఆదా అయ్యిందన్నారు. మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సేవలను విస్తరించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూనే... రాబోయే రోజుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్వర్క్(టీ – స్వాన్)ను నెల రోజుల్లోపు పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘టీ-ఫైబర్’కు సూచించారు. అలాగే... ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రిన్సిపుల్ మానిటైజేషన్ పార్టనర్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం, ఆగస్టు 03, 2026
వావ్..చాలా బాగున్నాయ్
ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
"మన ఊరు–మన కోచింగ్ సెంటర్" కార్యక్రమంలో భాగంగా శ్రీ విశ్వ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ తరగతులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుప్రారంభించారు. ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంథని నియోజకవర్గ నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మూడు నెలలు కష్టపడి క్రమశిక్షణతో శిక్షణ పొందితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని, ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
కోచింగ్‌తో పాటు వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించామని, ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేస్తామని తెలిపారు. పరీక్షల్లో వెనుకబడినా నిరుత్సాహపడకుండా లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. త్వరలో మరోసారి వచ్చి విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూరల్ వీక్ స్పోర్ట్స్ విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు
దిక్సూచి, మంథని, ఆగస్టు 3: గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీసేందుకు డీఎస్ఆర్ (Dream Start Rise) ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ వీక్ స్పోర్ట్స్ పోటీల విజేతలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టి-వర్క్స్ సహకారంతో మంథనిలో డీఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జూలై 28 నుంచి నిర్వహించిన క్రీడా పోటీల్లో సుమారు 1,600 మంది యువత పాల్గొనగా, 150 మందికి బహుమతులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
పోటీల నిర్వహణకు సహకరించిన ఫిజికల్ డైరెక్టర్లు, నిర్వాహకులను మంత్రి అభినందించారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ విజేతలేనని పేర్కొంటూ, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఆర్ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోకాకోలా కంపెనీ తో యువతకు ఉపాధి అవకాశాలు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
దిక్సూచి, మంథని:
కోకాకోలా కంపెనీ తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివారులో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన సుమారు 250 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోకాకోలా సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కోకాకోలా కంపెనీ సీఎస్ఆర్ నిధుల కింద రూ.2 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూమి, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల పై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు గౌరవ ప్రజాప్రతిథులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
మంథని పట్టణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్‌డ్యాం ఆధునికరణ, కట్ట పై సుందరీకరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. చెక్‌డ్యాంలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, కట్టపై వాక్‌వే, చిన్నారుల పార్క్, పచ్చదనం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంథని పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి
మంథనిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మంత్రి శ్రీధర్ బాబు
ఆదివారం, ఆగస్టు 02, 2026
3న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన
మంథని, ఆగస్టు 2: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం (03-08-2026) మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటన వివరాలు:
- ఉదయం 9:00 గంటలకు: మంథనిలోని శివ కిరణ్ గార్డెన్లో "మన ఊరు–మన కోచింగ్ సెంటర్" ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కానిస్టేబుల్, ఎస్ఐ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
- ఉదయం 10:00 గంటలకు: ఎస్ఎల్బీ గార్డెన్లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
- ఉదయం 10:30 గంటలకు: మంథని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కోకాకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు, ఇతర కంపెనీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
- ఉదయం 11:00 గంటలకు: బొక్కల వాగు అభివృద్ధి ప్రణాళికపై కంపెనీ ప్రతినిధుల ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తారు.
- ఉదయం 11:30 గంటలకు: మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనులపై చర్చిస్తారు.
- మధ్యాహ్నం 12:00 గంటలకు: రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ స్థలాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తారు.
మంత్రి పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొననున్నారు.
శనివారం, ఆగస్టు 01, 2026
దశాబ్దాల శ్రౌత సాధనకు నీరాజనం
బ్రహ్మశ్రీ గట్టు సరహరి ఘనాపాఠికి జీవిత సాఫల్య గౌరవం
గురుకుల పరంపర నుంచి రాష్ట్రస్థాయి పురస్కారం వరకు
మహా మనీషి నరహరి ఘనాపాఠి అపూర్వ వైదిక ప్రయాణం
భారతీయ సంస్కృతికి, నిత్య సనాతన వైదిక ధర్మానికి శబ్ద ప్రమాణమే ప్రాణాధారం. మానవ కల్యాణార్థం అవ్యాజమైన కరుణతో ఆవిర్భవించిన వేద విజ్ఞానం శతాబ్దాల తరబడి కాల ప్రవాహాన్ని తట్టుకుని, రూపాంతరం చెందకుండా నేటికీ భాసించడానికి ప్రధాన కారణం శ్రౌత స్మార్త విద్వాంసుల త్యాగనిరతి, గురుకుల పరంపర నిర్వహించిన నిష్టాగరిష్ఠ సాధన. అమూల్యమైన ఈ జ్ఞాన సంపదను కాపాడటానికి తమ జీవితాలనే వైదిక యజ్ఞంలో సమిధలుగా సమర్పించిన మహనీయులలో తెలంగాణ నేల కన్న అరుదైన శ్రోత నిధి, వేద కేసరి బ్రహ్మశ్రీ గట్టు నరహరి ఘనాపాఠి ప్రముఖులు.
దాదాపు ఏడు దశాబ్దాల పాటు వేదం, ఆగమం, జ్యోతిష్యం, స్మార్త సంప్రదాయం, యజ్ఞ యాగాదులు, దేవాలయ ప్రతిష్ఠాపనలు వంటి బహుముఖీన ఆధ్యాత్మిక రంగాలలో ఆయన అందించిన సేవలు భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. అట్టి మహామనీషి జీవిత సాఫల్యానికి తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "జీవిత సాఫల్య (లైఫ్ అచీవ్ మెంట్) పురస్కారం" ప్రకటించడం వేద సంస్కృతికి లభించిన మహోన్నత గౌరవం. ఆగస్టు 2న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా జరిగే ఈ సత్కార మహోత్సవం కేవలం ఒక వ్యక్తికి దక్కిన సత్కారం మాత్రమే కాక, సనాతన వేద పరంపరకు తెలుగు సమాజం అర్పిస్తున్న నీరాజనంగా నిలుస్తుంది.
మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన అంబా అగస్త్యేశ్వర స్వామి సన్నిధి కలిగిన చెన్నూరును స్వగ్రామంగా చేసుకున్న నరహరి ఘనాపాఠి 1947వ సంవత్సరం చైత్ర బహుళ అమావాస్య పర్వదినాన అచలాపుర గ్రామంలో జన్మించారు. తండ్రి గట్టు వెంకటశాస్త్రులు, తల్లి త్రివేణమ్మ పుణ్యఫలంగా లభించిన సుసంస్కారాలతో బాల్యం నుంచే విద్యాభ్యాసంలో అద్భుతమైన ఏకసంథాగ్రహణ శక్తిని ప్రదర్శించారు. ప్రాచీన గురుకుల పరంపరను అనుసరిస్తూ వేదాధ్యయనం ప్రారంభించిన ఆయన, విజయవాడలోని ప్రతిష్టాత్మక శృంగేరీ శంకరమఠంలో బ్రహ్మశ్రీ కంభంపాటి సేతుమాధవ అవధాని వద్ద తైత్తిరీయ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం వరకు అత్యంత క్షుణ్ణంగా అభ్యసించారు. తదనంతరం వేదంలోని గంభీర శబ్ద శృంఖలాలను సుబోధకం చేసే ఘనాభ్యాసాన్ని మహోన్నత వేదవేత్త బ్రహ్మశ్రీ మద్దులపిల్లి సూర్యనారాయణ ఘనాపాఠి పర్యవేక్షణలో పూర్తిచేసి "ఘనాపాఠి" గా రూపుదిద్దుకున్నారు.
కేవలం వేద శబ్దాలకే పరిమితం కాకుండా మారేపల్లి సత్యనారాయణ అవధాని వద్ద స్మార్త విద్యను. చెన్నూరులోని మత్సా నరసింహ సిద్ధాంతి వద్ద సంపూర్ణ జ్యోతిష శాస్త్రాన్ని, విజయవాడలో మాణిక్యశాస్త్రి వద్ద వేదాంత విచారాన్ని విస్తృతంగా విశ్లేషించారు. శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి దివ్య సన్నిధానంలో ప్రాణాయామ సాధనతో కూడిన యోగ విద్యను, వైదిక ఆగమ శాస్త్రంలో నిష్ణాతుడయ్యే సాధక నైపుణ్యాన్ని సంపాదించడం ఆయన విద్యాభ్యాసంలో అపూర్వమైన ఘట్టం. వేద పరిజ్ఞానాన్ని పరీక్షించే పరీక్షాధికారుల ముందు ఆయన కనబరిచిన నైపుణ్యం వేద పండిత లోకంలో సంచలనం సృష్టించింది. విజయవాడ కౌతావారి సభ, ఉజ్జయిని, కాశీ వంటి ప్రసిద్ధ పండిత పరిషత్తులలో నిర్వహించిన కఠినమైన పరీక్షలలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై విద్వాంసుల ప్రశంసలు పొందారు. కాంచీపురంలో జగద్గురు పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సమక్షంలో నిర్వహించిన శలాక పరీక్ష ఆయన పాండిత్యానికి శిఖరాయమాన నిదర్శనం. వేద గ్రంథంలో ఏ పుటలోని ఏ పదాన్ని సూచించినా, దానికి ముందు వెనుక ఉన్న సమగ్ర వేద భాగాలను నిర్దుష్టమైన స్వరాఘాతాలతో, నిరర్గళంగా వల్లించే ఈ పరీక్షలో ఘనవిజయం సాధించి, పరమాచార్యుల వారి హస్తాల మీదుగా "వేద కేసరి" బిరుదుతో పాటు స్వర్ణకంకణ బహుమానాన్ని పొందడం ఆయన అపార పాండిత్యానికి లభించిన అత్యున్నత ప్రామాణికత.
అధ్యయనానికే తన సేవలను పరిమితం చేయకుండా, దేవాలయాల పునరుద్దరణ, ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలలో ఆగమ విధివిధానాలను అమలు పరచడంలో ఆయన చూపిన నైపుణ్యం అసమానమైనది. శృంగేరీ పీఠాధిపతుల ఆజ్ఞానుసారం కాశీ అన్నపూర్ణాలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ శిఖర ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠాపనలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూజ్య జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారిచే తెలంగాణ విశిష్ఠులుగా శ్లాఘించ బడ్డారు. కర్ణాటకలోని శృంగేరీ శివగంగ క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ గాలిగోపుర ప్రతిష్ఠా కుంభాభిషేక ముహూర్తాలను స్వయంగా నిర్వహించి ప్రతిష్టాచార్యుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో బదరీనాథ్ క్షేత్రంలో నిర్వహించిన చతుర్వేద స్వాహాకార మహాయాగంలో ప్రధాన పాత్ర పోషించి "వేదరత్న" బిరుదాన్ని అందుకున్నారు.
1984లో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో అరుదైన రజత పుష్పాభిషేక గౌరవాన్ని పొందిన ఆయన, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకుల, ఆధ్యాత్మిక పీఠాధిపతుల ప్రశంసలు అందుకున్నారు. పూరీ శంకరాచార్య పీఠం అందించిన "వేదచూడామణి". భద్రాచలంలో లభించిన "స్మార్త విద్యావారధి", "భారతీతీర్థ పురస్కారం" వంటి అనేక గౌరవాలు ఆయన పాండిత్యానికి దక్కిన కిరీటాలు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు వేలకు పైగా వివిధ దేవతా విగ్రహాల, దేవాలయాల శాస్త్రోక్త ప్రతిష్ఠాపనలు నిర్వహించి "ప్రతిష్టాచార్య"గా పేరుగాంచిన నరహరి ఘనాపాఠి, తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ, ఇతర దివ్యక్షేత్రాలలోనూ నిర్వహించిన అతిరుద్ర, అయుతచండీ, చతుర్వేద స్వాహాకార మహాయాగాలలో బ్రహ్మ స్థానాన్ని అలంకరించి "యాగబ్రహ్మ"గా ఖ్యాతిగాంచారు.
శృంగేరీ, శృంగేరీ శివగంగ పీఠాలకు యావజ్జీవ ఆస్థాన విద్వాంసునిగా వ్యవహరిస్తూనే, మైసూరు దత్తపీఠం, ఉజ్జయిని సాందీపని వేద పాఠశాల, తెలంగాణ వేద పరిషత్ వంటి ప్రముఖ సంస్థలలో వేద పరీక్షాధికారిగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎనబై ఐదేళ్లు దాటిన ప్రస్తుత వయస్సులో కూడా నిత్యం సుమారు పద్నాలుగు గంటల పాటు వేద పారాయణంలో మునిగి తేలుతూ, ప్రాణాయామ, ప్రత్యాహార నిత్య సాధనలతో గృహస్థాశ్రమంలోనే మహర్షితుల్యమైన సన్యాస జీవనాన్ని సాగిస్తున్నారు. ధర్మపురి క్షేత్రంలో జన్మించిన సంస్కృత విదుషీమణి అయిన సహధర్మచారిణి కమలమ్మ తోడ్పాటుతో సాగుతున్న ఆయన వైదిక ప్రయాణం భావితరాలకు సనాతన ధర్మదీపికగా వెలుగులు విరజిమ్ముతోంది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారం ఒక మహోన్నత వేద నిధికి సమాజం అర్పించిన కృతజ్ఞతాంజలి.రామకిష్టయ్య సంగనభట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్
94405 95494
తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి
* ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠి కృషితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
* సీఎస్ఆర్ ద్వారా కీలక పాత్ర పోషించాలని కార్పొరేట్ సంస్థలకు పిలుపు
* ‘సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’లో మంత్రి శ్రీధర్ బాబు
దిక్సూచి, హైదరాబాద్:
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో కొండాపూర్ లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని వివరించారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా... ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా... అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు... కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన
అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా... సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాన్స్టిట్యూయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్( సీడీఎక్స్)కు నాలెడ్జ్ పార్ట్ నర్ గా ఉండేందుకు ముందుకొచ్చిన ' ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా' ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పోరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ప్రతినిధులు మహదేవ్ తిరునగరి, ఎం.దామోదరన్, శిల్పా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గోదావరి జలాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నాం
ఎల్లంపల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ప్రాజెక్టు
మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది
ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దిక్సూచి, రామగుండం:
ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.
ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు.
జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
డీపీఆర్ ప్రకారం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు.
ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలుగా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించి ప్రస్తుత జలస్థితిని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుతున్నాయని, రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తోందన్నారు.
కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి ఎన్డీఎస్ఏ అనుమతించలేదని, దీనిపై అనవసర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీటి తరలింపు పనులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, మిడ్ మానేరు, ఫ్లడ్ ఫ్లో కాలువ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించబడినవేనని పేర్కొన్నారు.
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు నాసిరకంగా నిర్మించడంతోనే దెబ్బతిన్నాయని అన్నారు. గురుత్వాకర్షణ ద్వారా నీరు వచ్చే అవకాశమున్నప్పటికీ భారీ ఎత్తిపోతల ద్వారా వేల కోట్ల రూపాయల విద్యుత్ వ్యయం జరిగేలా ప్రాజెక్టు రూపొందించారని విమర్శించారు. నీటిపారుదల రంగంలో తుగ్లక్ నిర్ణయాలతో లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు , మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన శిక్షలు
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది
ముద్ర, రామగిరి:
ర్యాగింగ్ కు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలులో ఉన్నాయని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. శనివారం మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యాంలో జేఎన్టీయు మంథని ఇంజనీరింగ్ కళాశాల లో ర్యాగింగ్ పై న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె మాట్లాడుతూ యుజిసి మార్గదర్శక ప్రకారం విద్య సంస్థలలో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలతో పాటు,అనేక మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని, ఎవరైనా వ్యక్తులు తోటి విద్యార్థుల పై కళాశాల ప్రాంగణంలో, బయట ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన శిక్ష లు పడతాయని, ర్యాగింగ్ అనైతిక చర్య, అమానవీయం అని పేర్కొన్నారు. భారతీయ సంసృతి లో ఇలాంటి చర్య లకు అవకాశం లేదని సత్ప్రవర్తన తో చట్ట బద్ధంగా మెసలుకోవాలని కోరారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.రఘోతం రెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ పాశ్చాత్య సంస్కృతి అని, మనం చట్టబద్ధమైన పౌరులుగా ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త గా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుదారాణి, ద్వితీయ శ్రేణి న్యాయ మూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, న్యాయవాదులు శశిభూషణ్ కాచె, నూనేటి ఆంజనేయులు, సి.ఐ. బుద్దే స్వామి, ఏస్.ఐ.టి.శ్రీనివాస్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ ప్రనీత్, జెఎన్టీయూ ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణా రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి
శుక్రవారం, జులై 31, 2026
వైద్య శిబిరానికి భారీ స్పందన
![]() |
| వృద్ధురాలిని పలుకరిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు |
మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
*శిధిలావస్థలో ఉన్న మహదేవపూర్ ఆసుపత్రిని పునర్నిర్మిస్తాం
* ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఆరోగ్య శిబిరం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
దిక్సూచి, మహదేవపూర్:
మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడిబిఐ సహకారంతో ఎంఎన్జి ఆసుపత్రి హైదరాబాద్, ఓమెగా ఆసుపత్రి కరీంనగర్ వైద్యులు మరియు వైద్య సిబ్బందిచే ఉచిత కాన్సర్, కంటి నిర్దారణ పరీక్షలు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు. ముక్యంగా మహిళలు కాన్సర్ వ్యాధి బారిన పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పేదోళ్లకు ఉపయోగపడాలని, దాని ద్వారా వారు ఆర్థికంగా చితికి పోకుండా ఆదిలోనే వ్యాధిని గుర్తించి, వ్యాధి అంతు చూడాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెరి మీటర్, హెల్త్ ఏటిఎం, ఈసీజి వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ ఏ టి ఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. హెల్త్ ఏటియం ద్వారా నిర్వహించిన పరీక్షలకు కార్డు ఇస్తారని తద్వారా 5 సంవత్సరాలు వరకు రిపోర్ట్స్ భద్రంగా ఉంటాయని తెలిపారు. అలాగే కంటి పరీక్షల కోసం ప్రత్యేక యంత్రం, గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించ నున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేపించు కోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్య పరీక్షలు చేయిపించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి హైదరాబాద్ లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి చూపు ప్రసాదించినట్లు మంత్రి వెల్లడించారు. మంథని నియోజక వ్యాప్తంగా 45వేల మందికి కంటి చికిత్సలు చేయించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ వైద్య క్యాంపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మంత్రి అభినందించారు. అంతకు ముందు మంత్రి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం వైద్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా శ్రీకాంత్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, విబిజి రాంజీ రాష్ట్ర సభ్యులు దండు రమేష్, కాటారం ఆర్డిఓ రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ రవీంద్ర నాధ్, అంకాలజిస్టు డా సంతోష్ రెడ్డి, వైద్యులు సర్పంచ్ హసీనా భాను అక్బర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, పిఏసిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఐడిబిఐ మేనేజర్ చంద్ర మౌళీశ్వర రెడ్డి, కాలేస్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేనత్తకు మంత్రి శ్రీధర్ బాబు నివాళి
| మేనత్తకు నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు |
మంథని: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి స్వర్గీయ సువర్ణ వనమాల ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, రామగుండం మాజీ శాశనసభ్యులు సోమారపు సత్యనారాయణ, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బుధవారం, జులై 29, 2026
మహంకాళీ బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబు
ఆదివారం, జులై 26, 2026
నేటి ముఖ్యాంశాలు
🔴 నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం
🔴 మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం. 35 పరుగుల తేడాతో భారత్ గెలుపు. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.
🔴 కరీంనగర్: సుడా చైర్మన్ పదవి దాదాపు ఖరారు..ముగ్గురు మంత్రుల ఏకాభిప్రాయంతో కొత్త వారికి అవకాశం
🔴 గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం. వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చానుకు స్వర్ణం.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్‌తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

.png)










