Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, ఆగస్టు 01, 2026

దశాబ్దాల శ్రౌత సాధనకు నీరాజనం


బ్రహ్మశ్రీ గట్టు సరహరి ఘనాపాఠికి జీవిత సాఫల్య గౌరవం 

 గురుకుల పరంపర నుంచి రాష్ట్రస్థాయి పురస్కారం వరకు

 మహా మనీషి నరహరి ఘనాపాఠి అపూర్వ వైదిక ప్రయాణం 

భారతీయ సంస్కృతికి, నిత్య సనాతన వైదిక ధర్మానికి శబ్ద ప్రమాణమే ప్రాణాధారం. మానవ కల్యాణార్థం అవ్యాజమైన కరుణతో ఆవిర్భవించిన వేద విజ్ఞానం శతాబ్దాల తరబడి కాల ప్రవాహాన్ని తట్టుకుని, రూపాంతరం చెందకుండా నేటికీ భాసించడానికి ప్రధాన కారణం శ్రౌత స్మార్త విద్వాంసుల త్యాగనిరతి, గురుకుల పరంపర నిర్వహించిన నిష్టాగరిష్ఠ సాధన. అమూల్యమైన ఈ జ్ఞాన సంపదను కాపాడటానికి తమ జీవితాలనే వైదిక యజ్ఞంలో సమిధలుగా సమర్పించిన మహనీయులలో తెలంగాణ నేల కన్న అరుదైన శ్రోత నిధి, వేద కేసరి బ్రహ్మశ్రీ గట్టు నరహరి ఘనాపాఠి ప్రముఖులు.  


దాదాపు ఏడు దశాబ్దాల పాటు వేదం, ఆగమం, జ్యోతిష్యం, స్మార్త సంప్రదాయం, యజ్ఞ యాగాదులు, దేవాలయ ప్రతిష్ఠాపనలు వంటి బహుముఖీన ఆధ్యాత్మిక రంగాలలో ఆయన అందించిన సేవలు భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. అట్టి మహామనీషి జీవిత సాఫల్యానికి తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "జీవిత సాఫల్య (లైఫ్ అచీవ్ మెంట్) పురస్కారం" ప్రకటించడం వేద సంస్కృతికి లభించిన మహోన్నత గౌరవం. ఆగస్టు 2న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా జరిగే ఈ సత్కార మహోత్సవం కేవలం ఒక వ్యక్తికి దక్కిన సత్కారం మాత్రమే కాక, సనాతన వేద పరంపరకు తెలుగు సమాజం అర్పిస్తున్న నీరాజనంగా నిలుస్తుంది. 

 మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన అంబా అగస్త్యేశ్వర స్వామి సన్నిధి కలిగిన చెన్నూరును స్వగ్రామంగా చేసుకున్న నరహరి ఘనాపాఠి 1947వ సంవత్సరం చైత్ర బహుళ అమావాస్య పర్వదినాన అచలాపుర గ్రామంలో జన్మించారు. తండ్రి గట్టు వెంకటశాస్త్రులు, తల్లి త్రివేణమ్మ పుణ్యఫలంగా లభించిన సుసంస్కారాలతో బాల్యం నుంచే విద్యాభ్యాసంలో అద్భుతమైన ఏకసంథాగ్రహణ శక్తిని ప్రదర్శించారు. ప్రాచీన గురుకుల పరంపరను అనుసరిస్తూ వేదాధ్యయనం ప్రారంభించిన ఆయన, విజయవాడలోని ప్రతిష్టాత్మక శృంగేరీ శంకరమఠంలో బ్రహ్మశ్రీ కంభంపాటి సేతుమాధవ అవధాని వద్ద తైత్తిరీయ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం వరకు అత్యంత క్షుణ్ణంగా అభ్యసించారు. తదనంతరం వేదంలోని గంభీర శబ్ద శృంఖలాలను సుబోధకం చేసే ఘనాభ్యాసాన్ని మహోన్నత వేదవేత్త బ్రహ్మశ్రీ మద్దులపిల్లి సూర్యనారాయణ ఘనాపాఠి పర్యవేక్షణలో పూర్తిచేసి "ఘనాపాఠి" గా రూపుదిద్దుకున్నారు.  

కేవలం వేద శబ్దాలకే పరిమితం కాకుండా మారేపల్లి సత్యనారాయణ అవధాని వద్ద స్మార్త విద్యను. చెన్నూరులోని మత్సా నరసింహ సిద్ధాంతి వద్ద సంపూర్ణ జ్యోతిష శాస్త్రాన్ని, విజయవాడలో మాణిక్యశాస్త్రి వద్ద వేదాంత విచారాన్ని విస్తృతంగా విశ్లేషించారు. శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి దివ్య సన్నిధానంలో ప్రాణాయామ సాధనతో కూడిన యోగ విద్యను, వైదిక ఆగమ శాస్త్రంలో నిష్ణాతుడయ్యే సాధక నైపుణ్యాన్ని సంపాదించడం ఆయన విద్యాభ్యాసంలో అపూర్వమైన ఘట్టం. వేద పరిజ్ఞానాన్ని పరీక్షించే పరీక్షాధికారుల ముందు ఆయన కనబరిచిన నైపుణ్యం వేద పండిత లోకంలో సంచలనం సృష్టించింది. విజయవాడ కౌతావారి సభ, ఉజ్జయిని, కాశీ వంటి ప్రసిద్ధ పండిత పరిషత్తులలో నిర్వహించిన కఠినమైన పరీక్షలలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై విద్వాంసుల ప్రశంసలు పొందారు. కాంచీపురంలో జగద్గురు పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సమక్షంలో నిర్వహించిన శలాక పరీక్ష ఆయన పాండిత్యానికి శిఖరాయమాన నిదర్శనం. వేద గ్రంథంలో ఏ పుటలోని ఏ పదాన్ని సూచించినా, దానికి ముందు వెనుక ఉన్న సమగ్ర వేద భాగాలను నిర్దుష్టమైన స్వరాఘాతాలతో, నిరర్గళంగా వల్లించే ఈ పరీక్షలో ఘనవిజయం సాధించి, పరమాచార్యుల వారి హస్తాల మీదుగా "వేద కేసరి" బిరుదుతో పాటు స్వర్ణకంకణ బహుమానాన్ని పొందడం ఆయన అపార పాండిత్యానికి లభించిన అత్యున్నత ప్రామాణికత. 

 అధ్యయనానికే తన సేవలను పరిమితం చేయకుండా, దేవాలయాల పునరుద్దరణ, ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలలో ఆగమ విధివిధానాలను అమలు పరచడంలో ఆయన చూపిన నైపుణ్యం అసమానమైనది. శృంగేరీ పీఠాధిపతుల ఆజ్ఞానుసారం కాశీ అన్నపూర్ణాలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ శిఖర ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠాపనలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూజ్య జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారిచే తెలంగాణ విశిష్ఠులుగా శ్లాఘించ బడ్డారు. కర్ణాటకలోని శృంగేరీ శివగంగ క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ గాలిగోపుర ప్రతిష్ఠా కుంభాభిషేక ముహూర్తాలను స్వయంగా నిర్వహించి ప్రతిష్టాచార్యుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో బదరీనాథ్ క్షేత్రంలో నిర్వహించిన చతుర్వేద స్వాహాకార మహాయాగంలో ప్రధాన పాత్ర పోషించి "వేదరత్న" బిరుదాన్ని అందుకున్నారు.

 1984లో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో అరుదైన రజత పుష్పాభిషేక గౌరవాన్ని పొందిన ఆయన, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకుల, ఆధ్యాత్మిక పీఠాధిపతుల ప్రశంసలు అందుకున్నారు. పూరీ శంకరాచార్య పీఠం అందించిన "వేదచూడామణి". భద్రాచలంలో లభించిన "స్మార్త విద్యావారధి", "భారతీతీర్థ పురస్కారం" వంటి అనేక గౌరవాలు ఆయన పాండిత్యానికి దక్కిన కిరీటాలు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు వేలకు పైగా వివిధ దేవతా విగ్రహాల, దేవాలయాల శాస్త్రోక్త ప్రతిష్ఠాపనలు నిర్వహించి "ప్రతిష్టాచార్య"గా పేరుగాంచిన నరహరి ఘనాపాఠి, తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ, ఇతర దివ్యక్షేత్రాలలోనూ నిర్వహించిన అతిరుద్ర, అయుతచండీ, చతుర్వేద స్వాహాకార మహాయాగాలలో బ్రహ్మ స్థానాన్ని అలంకరించి "యాగబ్రహ్మ"గా ఖ్యాతిగాంచారు.

 శృంగేరీ, శృంగేరీ శివగంగ పీఠాలకు యావజ్జీవ ఆస్థాన విద్వాంసునిగా వ్యవహరిస్తూనే, మైసూరు దత్తపీఠం, ఉజ్జయిని సాందీపని వేద పాఠశాల, తెలంగాణ వేద పరిషత్ వంటి ప్రముఖ సంస్థలలో వేద పరీక్షాధికారిగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎనబై ఐదేళ్లు దాటిన ప్రస్తుత వయస్సులో కూడా నిత్యం సుమారు పద్నాలుగు గంటల పాటు వేద పారాయణంలో మునిగి తేలుతూ, ప్రాణాయామ, ప్రత్యాహార నిత్య సాధనలతో గృహస్థాశ్రమంలోనే మహర్షితుల్యమైన సన్యాస జీవనాన్ని సాగిస్తున్నారు. ధర్మపురి క్షేత్రంలో జన్మించిన సంస్కృత విదుషీమణి అయిన సహధర్మచారిణి కమలమ్మ తోడ్పాటుతో సాగుతున్న ఆయన వైదిక ప్రయాణం భావితరాలకు సనాతన ధర్మదీపికగా వెలుగులు విరజిమ్ముతోంది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారం ఒక మహోన్నత వేద నిధికి సమాజం అర్పించిన కృతజ్ఞతాంజలి.



రామకిష్టయ్య సంగనభట్ల 

సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ 

 94405 95494

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026