Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, ఆగస్టు 01, 2026

దశాబ్దాల శ్రౌత సాధనకు నీరాజనం


బ్రహ్మశ్రీ గట్టు సరహరి ఘనాపాఠికి జీవిత సాఫల్య గౌరవం 

 గురుకుల పరంపర నుంచి రాష్ట్రస్థాయి పురస్కారం వరకు

 మహా మనీషి నరహరి ఘనాపాఠి అపూర్వ వైదిక ప్రయాణం 

భారతీయ సంస్కృతికి, నిత్య సనాతన వైదిక ధర్మానికి శబ్ద ప్రమాణమే ప్రాణాధారం. మానవ కల్యాణార్థం అవ్యాజమైన కరుణతో ఆవిర్భవించిన వేద విజ్ఞానం శతాబ్దాల తరబడి కాల ప్రవాహాన్ని తట్టుకుని, రూపాంతరం చెందకుండా నేటికీ భాసించడానికి ప్రధాన కారణం శ్రౌత స్మార్త విద్వాంసుల త్యాగనిరతి, గురుకుల పరంపర నిర్వహించిన నిష్టాగరిష్ఠ సాధన. అమూల్యమైన ఈ జ్ఞాన సంపదను కాపాడటానికి తమ జీవితాలనే వైదిక యజ్ఞంలో సమిధలుగా సమర్పించిన మహనీయులలో తెలంగాణ నేల కన్న అరుదైన శ్రోత నిధి, వేద కేసరి బ్రహ్మశ్రీ గట్టు నరహరి ఘనాపాఠి ప్రముఖులు.  


దాదాపు ఏడు దశాబ్దాల పాటు వేదం, ఆగమం, జ్యోతిష్యం, స్మార్త సంప్రదాయం, యజ్ఞ యాగాదులు, దేవాలయ ప్రతిష్ఠాపనలు వంటి బహుముఖీన ఆధ్యాత్మిక రంగాలలో ఆయన అందించిన సేవలు భారతీయ ఆధ్యాత్మిక క్షేత్రంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. అట్టి మహామనీషి జీవిత సాఫల్యానికి తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "జీవిత సాఫల్య (లైఫ్ అచీవ్ మెంట్) పురస్కారం" ప్రకటించడం వేద సంస్కృతికి లభించిన మహోన్నత గౌరవం. ఆగస్టు 2న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా జరిగే ఈ సత్కార మహోత్సవం కేవలం ఒక వ్యక్తికి దక్కిన సత్కారం మాత్రమే కాక, సనాతన వేద పరంపరకు తెలుగు సమాజం అర్పిస్తున్న నీరాజనంగా నిలుస్తుంది. 

 మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన అంబా అగస్త్యేశ్వర స్వామి సన్నిధి కలిగిన చెన్నూరును స్వగ్రామంగా చేసుకున్న నరహరి ఘనాపాఠి 1947వ సంవత్సరం చైత్ర బహుళ అమావాస్య పర్వదినాన అచలాపుర గ్రామంలో జన్మించారు. తండ్రి గట్టు వెంకటశాస్త్రులు, తల్లి త్రివేణమ్మ పుణ్యఫలంగా లభించిన సుసంస్కారాలతో బాల్యం నుంచే విద్యాభ్యాసంలో అద్భుతమైన ఏకసంథాగ్రహణ శక్తిని ప్రదర్శించారు. ప్రాచీన గురుకుల పరంపరను అనుసరిస్తూ వేదాధ్యయనం ప్రారంభించిన ఆయన, విజయవాడలోని ప్రతిష్టాత్మక శృంగేరీ శంకరమఠంలో బ్రహ్మశ్రీ కంభంపాటి సేతుమాధవ అవధాని వద్ద తైత్తిరీయ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం వరకు అత్యంత క్షుణ్ణంగా అభ్యసించారు. తదనంతరం వేదంలోని గంభీర శబ్ద శృంఖలాలను సుబోధకం చేసే ఘనాభ్యాసాన్ని మహోన్నత వేదవేత్త బ్రహ్మశ్రీ మద్దులపిల్లి సూర్యనారాయణ ఘనాపాఠి పర్యవేక్షణలో పూర్తిచేసి "ఘనాపాఠి" గా రూపుదిద్దుకున్నారు.  

కేవలం వేద శబ్దాలకే పరిమితం కాకుండా మారేపల్లి సత్యనారాయణ అవధాని వద్ద స్మార్త విద్యను. చెన్నూరులోని మత్సా నరసింహ సిద్ధాంతి వద్ద సంపూర్ణ జ్యోతిష శాస్త్రాన్ని, విజయవాడలో మాణిక్యశాస్త్రి వద్ద వేదాంత విచారాన్ని విస్తృతంగా విశ్లేషించారు. శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి దివ్య సన్నిధానంలో ప్రాణాయామ సాధనతో కూడిన యోగ విద్యను, వైదిక ఆగమ శాస్త్రంలో నిష్ణాతుడయ్యే సాధక నైపుణ్యాన్ని సంపాదించడం ఆయన విద్యాభ్యాసంలో అపూర్వమైన ఘట్టం. వేద పరిజ్ఞానాన్ని పరీక్షించే పరీక్షాధికారుల ముందు ఆయన కనబరిచిన నైపుణ్యం వేద పండిత లోకంలో సంచలనం సృష్టించింది. విజయవాడ కౌతావారి సభ, ఉజ్జయిని, కాశీ వంటి ప్రసిద్ధ పండిత పరిషత్తులలో నిర్వహించిన కఠినమైన పరీక్షలలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై విద్వాంసుల ప్రశంసలు పొందారు. కాంచీపురంలో జగద్గురు పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సమక్షంలో నిర్వహించిన శలాక పరీక్ష ఆయన పాండిత్యానికి శిఖరాయమాన నిదర్శనం. వేద గ్రంథంలో ఏ పుటలోని ఏ పదాన్ని సూచించినా, దానికి ముందు వెనుక ఉన్న సమగ్ర వేద భాగాలను నిర్దుష్టమైన స్వరాఘాతాలతో, నిరర్గళంగా వల్లించే ఈ పరీక్షలో ఘనవిజయం సాధించి, పరమాచార్యుల వారి హస్తాల మీదుగా "వేద కేసరి" బిరుదుతో పాటు స్వర్ణకంకణ బహుమానాన్ని పొందడం ఆయన అపార పాండిత్యానికి లభించిన అత్యున్నత ప్రామాణికత. 

 అధ్యయనానికే తన సేవలను పరిమితం చేయకుండా, దేవాలయాల పునరుద్దరణ, ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలలో ఆగమ విధివిధానాలను అమలు పరచడంలో ఆయన చూపిన నైపుణ్యం అసమానమైనది. శృంగేరీ పీఠాధిపతుల ఆజ్ఞానుసారం కాశీ అన్నపూర్ణాలయం, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ శిఖర ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠాపనలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూజ్య జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారిచే తెలంగాణ విశిష్ఠులుగా శ్లాఘించ బడ్డారు. కర్ణాటకలోని శృంగేరీ శివగంగ క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ గాలిగోపుర ప్రతిష్ఠా కుంభాభిషేక ముహూర్తాలను స్వయంగా నిర్వహించి ప్రతిష్టాచార్యుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో బదరీనాథ్ క్షేత్రంలో నిర్వహించిన చతుర్వేద స్వాహాకార మహాయాగంలో ప్రధాన పాత్ర పోషించి "వేదరత్న" బిరుదాన్ని అందుకున్నారు.

 1984లో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో అరుదైన రజత పుష్పాభిషేక గౌరవాన్ని పొందిన ఆయన, మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు పలువురు జాతీయ నాయకుల, ఆధ్యాత్మిక పీఠాధిపతుల ప్రశంసలు అందుకున్నారు. పూరీ శంకరాచార్య పీఠం అందించిన "వేదచూడామణి". భద్రాచలంలో లభించిన "స్మార్త విద్యావారధి", "భారతీతీర్థ పురస్కారం" వంటి అనేక గౌరవాలు ఆయన పాండిత్యానికి దక్కిన కిరీటాలు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు వేలకు పైగా వివిధ దేవతా విగ్రహాల, దేవాలయాల శాస్త్రోక్త ప్రతిష్ఠాపనలు నిర్వహించి "ప్రతిష్టాచార్య"గా పేరుగాంచిన నరహరి ఘనాపాఠి, తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ, ఇతర దివ్యక్షేత్రాలలోనూ నిర్వహించిన అతిరుద్ర, అయుతచండీ, చతుర్వేద స్వాహాకార మహాయాగాలలో బ్రహ్మ స్థానాన్ని అలంకరించి "యాగబ్రహ్మ"గా ఖ్యాతిగాంచారు.

 శృంగేరీ, శృంగేరీ శివగంగ పీఠాలకు యావజ్జీవ ఆస్థాన విద్వాంసునిగా వ్యవహరిస్తూనే, మైసూరు దత్తపీఠం, ఉజ్జయిని సాందీపని వేద పాఠశాల, తెలంగాణ వేద పరిషత్ వంటి ప్రముఖ సంస్థలలో వేద పరీక్షాధికారిగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎనబై ఐదేళ్లు దాటిన ప్రస్తుత వయస్సులో కూడా నిత్యం సుమారు పద్నాలుగు గంటల పాటు వేద పారాయణంలో మునిగి తేలుతూ, ప్రాణాయామ, ప్రత్యాహార నిత్య సాధనలతో గృహస్థాశ్రమంలోనే మహర్షితుల్యమైన సన్యాస జీవనాన్ని సాగిస్తున్నారు. ధర్మపురి క్షేత్రంలో జన్మించిన సంస్కృత విదుషీమణి అయిన సహధర్మచారిణి కమలమ్మ తోడ్పాటుతో సాగుతున్న ఆయన వైదిక ప్రయాణం భావితరాలకు సనాతన ధర్మదీపికగా వెలుగులు విరజిమ్ముతోంది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారం ఒక మహోన్నత వేద నిధికి సమాజం అర్పించిన కృతజ్ఞతాంజలి.



రామకిష్టయ్య సంగనభట్ల 

సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ 

 94405 95494

తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి


* ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠి కృషితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

* సీఎస్ఆర్ ద్వారా కీలక పాత్ర పోషించాలని కార్పొరేట్ సంస్థలకు పిలుపు

*  ‘సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’లో మంత్రి శ్రీధర్ బాబు 

దిక్సూచి, హైదరాబాద్​:

కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో కొండాపూర్ లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని వివరించారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా... ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా... అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు... కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన

అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా... సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాన్‌స్టిట్యూయెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్( సీడీఎక్స్)కు నాలెడ్జ్ పార్ట్ నర్ గా ఉండేందుకు ముందుకొచ్చిన ' ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా' ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పోరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ప్రతినిధులు మహదేవ్ తిరునగరి, ఎం.దామోదరన్, శిల్పా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.











ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం





రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గోదావరి జలాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నాం

ఎల్లంపల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ప్రాజెక్టు

మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది

ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్


దిక్సూచి, రామగుండం:

ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 1963లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, 1959లో కడెం ప్రాజెక్టుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజారిటీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.

ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు.

డీపీఆర్ ప్రకారం షీట్‌పైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా స్కాంట్ పైల్ ఫౌండేషన్ నిర్మించారని, మూడు బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు.

ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గత 34 నెలలుగా కాళేశ్వరం మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి 340 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.80 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,  శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించి ప్రస్తుత జలస్థితిని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుతున్నాయని, రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తోందన్నారు.

కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి ఎన్‌డీఎస్‌ఏ అనుమతించలేదని, దీనిపై అనవసర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీటి తరలింపు పనులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, మిడ్ మానేరు, ఫ్లడ్ ఫ్లో కాలువ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించబడినవేనని పేర్కొన్నారు.



కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,  కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు నాసిరకంగా నిర్మించడంతోనే దెబ్బతిన్నాయని అన్నారు. గురుత్వాకర్షణ ద్వారా నీరు వచ్చే అవకాశమున్నప్పటికీ భారీ ఎత్తిపోతల ద్వారా వేల కోట్ల రూపాయల విద్యుత్ వ్యయం జరిగేలా ప్రాజెక్టు రూపొందించారని విమర్శించారు. నీటిపారుదల రంగంలో తుగ్లక్ నిర్ణయాలతో లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు , మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.








ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన శిక్షలు

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

ముద్ర, రామగిరి:

ర్యాగింగ్ కు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలులో  ఉన్నాయని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. శనివారం మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యాంలో జేఎన్టీయు  మంథని ఇంజనీరింగ్ కళాశాల లో ర్యాగింగ్ పై న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె మాట్లాడుతూ యుజిసి మార్గదర్శక ప్రకారం విద్య సంస్థలలో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలతో పాటు,అనేక మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని, ఎవరైనా వ్యక్తులు తోటి విద్యార్థుల పై కళాశాల ప్రాంగణంలో, బయట ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన శిక్ష లు పడతాయని, ర్యాగింగ్ అనైతిక చర్య, అమానవీయం అని పేర్కొన్నారు. భారతీయ సంసృతి లో ఇలాంటి చర్య లకు అవకాశం లేదని సత్ప్రవర్తన తో చట్ట బద్ధంగా మెసలుకోవాలని కోరారు. బార్ అసోసియేషన్  ఉపాధ్యక్షులు కె.రఘోతం రెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ పాశ్చాత్య సంస్కృతి అని, మనం చట్టబద్ధమైన పౌరులుగా ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త గా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుదారాణి, ద్వితీయ శ్రేణి న్యాయ మూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, న్యాయవాదులు శశిభూషణ్ కాచె, నూనేటి ఆంజనేయులు, సి.ఐ. బుద్దే స్వామి, ఏస్.ఐ.టి.శ్రీనివాస్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ ప్రనీత్, జెఎన్టీయూ ఫిజికల్ డైరెక్టర్ పింగిలి కృష్ణా రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

**పరిశుభ్రత, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి**

**డిజిటల్ విద్యా వనరులను వినియోగించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచాలి**

* FRS నమోదు, హాజరు, విద్యా పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి**

* మోడల్ స్కూల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

దిక్సూచి,  పెద్దపల్లి :

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*  పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,*  వర్షాల కారణంగా పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాములు, తేళ్లు, దోమలు, ఈగలు వంటి వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

అన్ని తరగతి గదులు, వసతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే త్రాగునీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షించి (వాటర్ టెస్టింగ్), విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.
మండల, గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించాలని ఆదేశించారు.
విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) నమోదు వంద శాతం పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి, ఆరోగ్యం, భద్రత, క్రమశిక్షణ అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ తమ విద్యాసంస్థలో ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఈ.ఓ. శారద , జి.సి.డి.ఓ.కవిత, మల్లేశం,సంబంధిత శాఖల అధికారులు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

శుక్రవారం, జులై 31, 2026

వైద్య శిబిరానికి భారీ స్పందన

 వృద్ధురాలిని పలుకరిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

*శిధిలావస్థలో ఉన్న మహదేవపూర్ ఆసుపత్రిని పునర్నిర్మిస్తాం

 * ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఆరోగ్య శిబిరం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

దిక్సూచి, మహదేవపూర్:

మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో  ఐడిబిఐ సహకారంతో  ఎంఎన్జి ఆసుపత్రి హైదరాబాద్, ఓమెగా ఆసుపత్రి కరీంనగర్ వైద్యులు మరియు వైద్య సిబ్బందిచే  ఉచిత కాన్సర్, కంటి నిర్దారణ పరీక్షలు  వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు. ముక్యంగా మహిళలు కాన్సర్ వ్యాధి బారిన పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పేదోళ్లకు ఉపయోగపడాలని, దాని ద్వారా వారు ఆర్థికంగా చితికి పోకుండా ఆదిలోనే వ్యాధిని గుర్తించి, వ్యాధి అంతు చూడాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని  పెరి మీటర్, హెల్త్ ఏటిఎం, ఈసీజి వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  హెల్త్ ఏ టి ఎం  ద్వారా 64 రకాల  వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. హెల్త్ ఏటియం ద్వారా నిర్వహించిన పరీక్షలకు కార్డు ఇస్తారని తద్వారా 5 సంవత్సరాలు వరకు రిపోర్ట్స్ భద్రంగా  ఉంటాయని తెలిపారు.   అలాగే కంటి పరీక్షల కోసం ప్రత్యేక యంత్రం, గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ  యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించ నున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ  ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేపించు కోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్య పరీక్షలు చేయిపించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి హైదరాబాద్ లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి చూపు ప్రసాదించినట్లు మంత్రి వెల్లడించారు. మంథని నియోజక వ్యాప్తంగా 45వేల మందికి కంటి చికిత్సలు చేయించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ వైద్య క్యాంపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మంత్రి అభినందించారు.  అంతకు ముందు మంత్రి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం వైద్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా శ్రీకాంత్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు,  విబిజి రాంజీ రాష్ట్ర సభ్యులు దండు రమేష్,  కాటారం ఆర్డిఓ రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ రవీంద్ర నాధ్, అంకాలజిస్టు డా సంతోష్ రెడ్డి,  వైద్యులు సర్పంచ్ హసీనా భాను అక్బర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య,  పిఏసిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఐడిబిఐ మేనేజర్ చంద్ర మౌళీశ్వర రెడ్డి, కాలేస్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









మేనత్తకు మంత్రి శ్రీధర్ బాబు నివాళి

మేనత్తకు  నివాళి అర్పిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు 

మంథని: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి స్వర్గీయ సువర్ణ వనమాల ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, రామగుండం మాజీ శాశనసభ్యులు సోమారపు సత్యనారాయణ, మానకొండూర్​ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్​,​ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



బుధవారం, జులై 29, 2026

మహంకాళీ బోనాలకు మంత్రి శ్రీధర్‌బాబు

దిక్సూచి,  హైదరాబాద్: 
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, ఆగస్టు 3న నిర్వహించే రంగం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఈవో మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామతీర్థ శర్మ, వేణుమాధవ శర్మ వేదమంత్రోచ్చారణలతో మంత్రిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవీవర ప్రసాద్, మంత్రి సోనాల్, మల్లిఖార్జున్, గంటా గీత, కిరణ్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం, జులై 26, 2026

నేటి ముఖ్యాంశాలు



🔴  నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

🔴  మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం. 35 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు. 3-0తో సిరీస్‌  కైవసం చేసుకున్న భారత్‌.

🔴  కరీంనగర్​: సుడా చైర్మన్ పదవి దాదాపు ఖరారు..ముగ్గురు మంత్రుల ఏకాభిప్రాయంతో కొత్త వారికి అవకాశం

🔴 గ్లాస్గో: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం. వెయిట్‌ లిఫ్టింగ్‌ 48 కేజీల విభాగంలో మీరాబాయి చానుకు స్వర్ణం.

శనివారం, జులై 25, 2026

ఓదెలలో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

 


రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

 ప్రభుత్వ విప్ విజయరమణ రావు

దిక్సూచి, ఓదెల:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జలసిరి పోస్టర్‌ను ఆవిష్కరించి, అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ.46.30 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

కాంగ్రెస్ హయాంలో నాణ్యమైన రెవెన్యూ సేవలు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇటీవలే శ్రీరాంపూర్‌లో తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు ఓదెలలో కూడా కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలో ఓదెలలో నూతన కోర్టు భవన నిర్మాణం కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.

రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండే అవకాశముందని పేర్కొన్న ఆయన, రైతులు వరికి బదులుగా కందులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్‌పామ్, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించకుండా అధిక నీటి అవసరమయ్యే వరి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భూ పునఃసర్వేతో శాశ్వత పరిష్కారం

రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం దశలవారీగా భూ పునఃసర్వే చేపడుతోందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభమైందని, రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

రైతు భరోసా – బోనస్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామని, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వరి కొనుగోలుపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తోందన్నారు.

విద్య, వైద్య రంగాల్లో పురోగతి

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.5.5 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అత్యుత్తమ ఆసుపత్రిగా నిలిచిందని, రూ.53 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీరాములు, తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం




ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

దిక్సూచి ప్రతినిధి, హైదరాబాద్:

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సేకరణ, నిల్వ, రవాణా, రైతులకు సకాలంలో చెల్లింపులు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై మంత్రులు, అధికారులు సమగ్రంగా సమీక్షించారు.

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

తొలి పర్వదిన పండగ


తొలి పర్వదిన పండగ

(అవధాని మోహన శర్మ)

 కాలపురుషుడైన శ్రీమహావిష్ణువు దక్షిణాయనం ప్రారంభమైన ఆషాడశుద్ధ ఏకాదశి నుంచి, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడు. ఈ ప్రారంభ దినాన్ని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి ప్రాశ స్త్యాన్ని పద్మ పురాణం వివరిస్తుంది. ఈ రోజు తులసీదళాలతో ఏకాదశ వ్రతం చేసి ఉపవాస దీక్ష ఆచరించడం* ఆనవాయితీ. *ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా భక్తితో ఉండటమే. సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి. ప్రతి ఏకాదశికీ ప్రత్యేకత ఉన్నా, తొలి ఏకాదశి మాత్రం విశేష ప్రాధాన్యం కలిగిన* పర్వదినం. *సర్వాంతర్యామి అయిన శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ నాలుగు నెలల్లో మహాశి వుడు లోకపాలన చేస్తాడని, హరి నిదురిస్తే హరుడు మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలంలో ధ్యానం, మౌనం, ఉపవాస వ్రతాలు, పితృ కార్యాలు చేస్తారు. వర్షరుతువు కావడం వల్ల చాతుర్మాస* దీక్షలో *ఉన్న భక్తులు నాలుగు నెలలూ ఎక్కడికి ప్రయాణం చేయరు. సాత్విక ఆలోచనలతో గడుపుతూ సాత్విక ఆహారం స్వీకరిస్తారు. పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన కాలం కాబట్టి శ్రావణమాస వ్రతాలు, కార్తీక దీక్షలు ఆచరిస్తారు. శాస్త్రీయంగా చూస్తే జులై నెల నుంచి సూర్యుడు* భూమధ్యరేఖకు *దక్షిణంగా ప్రయాణం చేస్తాడు. అది దేవతలకు రాత్రి కాలం అంటారు. ఉత్తరాయణం వారికి పగటి కాలం.

తొలి ఏకాదశి గురించి పౌరాణిక గాథలెన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. వరాహ పురాణం ప్రకారం, కృతయుగంలో* మురాసురుడనే రాక్షసుణ్ని సంహరించే క్రమంలో అలసిన శ్రీమహావిష్ణువు ఒక గుహలో నిద్రించాడు. ఆయన శరీరం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించి రాక్షసుణ్ని సంహరిం చింది. ఆమెనే విష్ణుప్రియ, ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆమె తన పేరిట ఒక తిథి ఏర్పడాలని, ఆరోజున దైవస్మరణలో గడిపిన వారికి సద్గతులు ప్రాప్తించాలని ప్రార్ధించగా, శ్రీహరి వరమిచ్చాడట. నాటి నుంచి ప్రజలు ఏకాదశి వ్రతం చేసుకుంటున్నారు. పేలాల పిండిని స్వీకరించి ఉపవాస దీక్షను విరమించడం ఆనవాయితీ. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే, అన్నానికి ఎలాంటి లోటు ఉండదని నానుడి. ఉపవాసం, జాగరణం రెండూ చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుందనీ, తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయనీ భక్తుల నమ్మకం. మనిషికి అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు ఉంటాయి. వాటన్నింటినీ ఏకోన్ముఖం చేస్తుంది అంతరేంద్రి యమైన మనసు. ఈ పదకొండింటిని కలిపి ఏకాదశిగా భావిస్తారు పెద్దలు.

మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలకు, హింసాత్మక ప్రవృత్తికి ప్రతీకే మురాసురుడు. ఉపవాస దీక్షతో 'ఏకాదశి'ని మనలోనికి ఆహ్వానించడం ద్వారా చెడును జయించాలి. చాతుర్మాసం పాడి పంటలు శోభిల్లే తొలి కాలం కూడా. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ చేసుకునే మొదటి పండుగ ఈ ఏకాదశి.

మంత్రి పరామర్శ

పరామర్శిస్తున్న సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నివాళి అర్పిస్తున్న మంత్రి 

దిక్సూచి, మంథని: 

మంథని పట్టణంలో దుద్దిల్ల శ్రీపాద రావు సహోదరి సువర్ణ వనమాల  కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు.  వారి జ్ఞాపకాలను, మంచితనాన్ని గుర్తు చేసుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.  ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.

శుక్రవారం, జులై 24, 2026

అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ





దిక్సూచి ప్రతినిధి, బెంగళూరు:

బెంగళూరులో నిర్వహించిన న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ – సౌత్ ఎడిషన్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగిందని తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రానికి ప్రత్యేక బలమని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షిస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

సమ్మిట్‌లో విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, సాంకేతిక రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

సుస్థిర అభివృద్ధి, సమగ్ర వృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

బుధవారం, జులై 22, 2026

మంథని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

 

 రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, మంథని, జూలై 21

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని ప్రధాన రహదారి విస్తరణ పనులను అధికారులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  మంథని పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలు, వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రవేశం నుంచి ప్రధాన రహదారిలో ప్రమాదకర మలుపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, దుకాణాల ముందు ఒకే తరహా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు.

పట్టణ సుందరీకరణకు ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. రహదారి విస్తరణలో భాగంగా దుకాణాలు, భూములు కోల్పోయిన చిరు వ్యాపారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి కోరారు. రానున్న పుష్కరాల నాటికి మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాసిరకం పనులకు తావివ్వొద్దని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంగళవారం, జులై 21, 2026

శ్రీపాద రావు సోదరికి కన్నీటి వీడ్కోలు









మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాద రావు సహోదరి, సువర్ణ వనమాల (91) అంతిమ సంస్కారం గురువారం గోదావరి తీరంలో నిర్వహించారు. 

బుధవారం తెల్లవారుజామున కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మేనత్త పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారి వెంట రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి  సత్యం,  జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026