రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
దిక్సూచి, మంథని, జూలై 21
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని ప్రధాన రహదారి విస్తరణ పనులను అధికారులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలు, వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రవేశం నుంచి ప్రధాన రహదారిలో ప్రమాదకర మలుపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, దుకాణాల ముందు ఒకే తరహా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు.
పట్టణ సుందరీకరణకు ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను స్వాగతిస్తామని పేర్కొన్నారు. రహదారి విస్తరణలో భాగంగా దుకాణాలు, భూములు కోల్పోయిన చిరు వ్యాపారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి కోరారు. రానున్న పుష్కరాల నాటికి మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాసిరకం పనులకు తావివ్వొద్దని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి