Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, ఆగస్టు 26, 2026

స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌లో భాగస్వామ్యం అవ్వండి


* స్కిల్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు కలిసి రండి

* పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

 దిక్సూచి, హైదరాబాద్​:

తెలంగాణను స్కిల్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌, రీస్కిల్లింగ్‌ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణాలో బోయింగ్‌, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ (ఎల్‌ఎల్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘బోయింగ్‌ స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్ కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్లింగ్‌ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆధునిక, పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించేందుకు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అకడమిక్‌ కరిక్యులమ్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడంతో పాటు అనేక కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకుంటూ భవిష్యత్‌ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో బోయింగ్‌, లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ ప్రతినిధులు ప్రవీణ, యశోద, రష్మీ ప్రభ మిశ్రా, బితుపాన్ బోరా, రత్న శేఖర్ రెడ్డి, ఓం దేవ్, డా. విజయ్ కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు.







ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలి: దుద్దిల్ల శ్రీనుబాబు


దిక్సూచి, గోదావరిఖని:

ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించేందుకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రెండో దశపై బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనుబాబు మాట్లాడుతూ.. సర్వేలో ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శిక్షణలో అందించిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుని బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఏ పట్టణ, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలన్నారు. మన ఓట్లను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్వే విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించిన ఆయన, ఈ అంశాలపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రతినిధులపై ఉందని నొక్కిచెప్పారు. కొందరు బూత్ స్థాయి ఏజెంట్ల పనితీరుపై ఇబ్బందులు ఎదురైన అంశం సమావేశంలో ప్రస్తావనకు రాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెంట్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పరిశీలకులు దీపక్ రాథోడ్, ప్రభాకర్‌రెడ్డి, ఫహీం, కాంగ్రెస్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.





ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో దుద్దిళ్ల శ్రీను బాబు


దిక్సూచి, మంథని:

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలందరిపై ఆదివరాహ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీను బాబు ఆకాంక్షించారు.

జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవల్లో విశేషంగా పాల్గొన్న వారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో మెమెంటోలను దుద్దిళ్ల శ్రీను బాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.








మంగళవారం, ఆగస్టు 25, 2026

త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌కు ఘన సన్మానం


దిక్సూచి,  హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి భారత కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌లను మంగళవారం ఘనంగా సన్మానించారు.

ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కలిసి క్రీడాకారిణులను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.




పార్టీ బలోపేతానికి పెద్దపీట

పీఏసీ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై కీలక చర్చ
దిక్సూచి, హైదరాబాద్:

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మంగళవారం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ గారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్‌ సావంత్‌, మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే శ్రీ మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేరవేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించాల్సిన అవసరాన్ని నేతలు ప్రస్తావించారు. రానున్న రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే దిశగా నాయకులు సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పార్టీ రాష్ట్ర నాయకత్వం, ఏఐసీసీ ప్రతినిధులు, జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల సమన్వయంతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌కు మరింత పటిష్టమైన పునాది వేయడమే లక్ష్యంగా పీఏసీ సమావేశం సాగింది.


ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*

ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాల అమలు

భూ భారతి ద్వారా ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యలకు పరిష్కారం

మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ రీ-సర్వే*

ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తహసీల్దార్ కార్యాలయాలు పనిచేయాలి*

మంథని గంగాపురి వద్ద రూ.2.55 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

కమాన్ పూర్‌లో రూ.75 లక్షలతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం*

దిక్సూచి, మంథని:

ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

సోమవారం మంథని మండలం గంగాపురి వద్ద రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను, కమాన్ పూర్ మండలంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో* కలిసి *మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా *మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

మంథని ప్రాంతంలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు గంగాపురి వద్ద ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా పరిసర ప్రాంతాలకు నాణ్యమైన, స్థిరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రైతులు, గృహ వినియోగదారులు, వ్యాపారులు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యుత్, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మంజూరైన నిధులను సకాలంలో వినియోగిస్తూ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

*భూ భారతి ద్వారా భూ సమస్యలకు పరిష్కారం*

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం భూ భారతి ద్వారా చర్యలు చేపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గతంలో ధరణి వ్యవస్థలో ఏర్పడిన అనేక సమస్యల కారణంగా రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. భూ భారతి ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేసి, ప్రజలకు పారదర్శకంగా భూ సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

భూ రీ-సర్వే కార్యక్రమాన్ని దశలవారీగా చేపడుతున్నామని, మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా అధికారులు సమగ్రంగా పనిచేయాలని సూచించారు.

రైతులు, ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. భూ భారతి ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

*తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు సేవా కేంద్రంగా పనిచేయాలి*

కమాన్ పూర్ మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు మెరుగైన సేవలు అందించే కేంద్రంగా పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవంగా స్వీకరించి, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు.

ప్రజలు అందించే దరఖాస్తులు, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపాలని సూచించారు.

*జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,*  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించే విధంగా అధికారులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సూచించారు.

భూ భారతి, భూ రీ-సర్వే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. భూ రికార్డుల సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కరించాలని, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని మంత్రి మరియు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఆర్డిఓ సురేష్, తహసిల్దార్ వాసంతి, సంబంధిత ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.

సోమవారం, ఆగస్టు 24, 2026

మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు




పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు

పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

పిల్లల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేందుకు అల్పాహార పథకం

సుమారు రూ.7.5 కోట్ల సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులతో ఆధునిక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు

గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం


దిక్సూచి, మంథని, ఆగస్టు 24: 

 పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2011లో హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.

హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద  10 మైళ్ల పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలో కూడా అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన సూచనల మేరకు సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో మంథనిలో ఆధునిక యంత్రాలతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక్కడ గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు.

విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని మంత్రి తెలిపారు. వారానికి కనీసం మూడు సార్లు విద్యార్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. పిల్లలకు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం కాకుండా వివిధ రకాల టిఫిన్లను అందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థిని గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరయ్యే పరిస్థితి ఉండేదని తన కష్టాలను మంత్రితో పంచుకుంది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత సాధించడంతో పాటు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదల పొందుతారని మంత్రి అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని కలెక్టర్ తెలిపారు. తాజాగా ప్రారంభించిన అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.

జిల్లాలో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఫిన్‌లాండ్‌లో శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారని, భవిష్యత్తులో మరింత మంది ఉపాధ్యాయులు విదేశాల్లో శిక్షణ పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్ట పునాది వేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో  మంథని ఆర్డీవో సురేష్, మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్ జి.3.జి యం, తహసిల్దార్ ఆరిపోద్దిన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












ఆదివారం, ఆగస్టు 23, 2026

ఆకలికి సెలవు.. చదువుకు వెలుగు

40 వేల మంది పేద పిల్లల కోసం మంథనిలో ‘ఒకే వంటిల్లు’.. యంత్రాల వెనుక ఓ మానవీయ ఆలోచన

దిక్సూచి ప్రత్యేక కథనం | మంథని

ఉదయం పాఠశాల గంట మోగుతుంది.
చేతిలో పుస్తకాలు.. వీపుపై బ్యాగులు.. కళ్లల్లో భవిష్యత్తు కలలు.

కానీ ఆ కలల మధ్య ఓ చిన్న సమస్య పెద్ద అడ్డంకిగా మారుతుంది—ఆకలి.

ఖాళీ కడుపుతో పాఠం వినడం ఎంత కష్టం? పుస్తకం ముందున్నా మనసు భోజనం వైపు మళ్లితే చదువుపై ఏకాగ్రత ఎలా ఉంటుంది?

ఈ ప్రశ్నకు మంథని ఓ వినూత్న సమాధానం చెబుతోంది.

“ముందు పిల్లల కడుపు నింపాలి.. ఆ తర్వాత వారి కలలకు రెక్కలు ఇవ్వాలి.”

ఈ ఆలోచనకు రూపమే మంథని మార్కెట్‌ యార్డులో ఏర్పాటైన భారీ సెంట్రలైజ్డ్ కిచెన్.

ఇది వంటిల్లు కాదు.. ఆకలిపై యుద్ధం

సుమారు 8 ఎకరాల్లో విస్తరించిన ఈ కిచెన్‌ను బయట నుంచి చూస్తే మరో భారీ నిర్మాణంలా కనిపిస్తుంది. కానీ దాని లోపలికి అడుగుపెడితే ఓ కొత్త ప్రపంచం కనిపిస్తుంది.

పొయ్యి పొగ లేదు.
వంట పాత్రలతో హడావుడి లేదు.
గంటల తరబడి కూరగాయలు తరిగే పరిస్థితి లేదు.

అన్నీ యంత్రాల ఆధారంగా జరుగుతాయి.

గంటకు 5,400 ఇడ్లీలు.
ఆటోమేటిక్ దోశ మిక్సింగ్, తయారీ.
పూరీల కోసం ప్రత్యేక మిషన్.
కూరగాయల వాషింగ్, కటింగ్ యూనిట్లు.
మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్.
ఆర్వో వాటర్ ప్లాంట్.
సెంట్రల్ గ్యాస్ బ్యాంక్.
పాత్రలు శుభ్రం చేసే ఆటోమేటిక్ వ్యవస్థ.

అంటే.. ఇది సంప్రదాయ వంటశాల కాదు.

ఓ పారిశ్రామిక స్థాయి ‘ఫుడ్ ప్రొడక్షన్ సిస్టమ్’.

కానీ ఇక్కడ తయారయ్యేది మాత్రం అమ్మకానికి కాదు.

40,052 మంది పిల్లల కోసం.

40 వేల కడుపులు.. ఒకే వంటిల్లు

పెద్దపల్లి, మంథని, రామగుండం ప్రాంతాల్లో ఇప్పటివరకు పాఠశాలల వారీగా వంట చేయడం వల్ల సమయం, నాణ్యత, సిబ్బంది వంటి అనేక సవాళ్లు ఉండేవి.

ఇప్పుడు ఆ విధానానికి భిన్నంగా ఒకే చోట భారీ స్థాయిలో ఆహారం తయారవుతుంది.

పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఈ వ్యవస్థ ద్వారా ఆహారం అందనుంది.

వందలాది పాఠశాలలు.. వేలాది కుటుంబాలు.. 40 వేలకుపైగా విద్యార్థులు..
కానీ వంటిల్లు మాత్రం ఒక్కటే.

ఇదే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

‘టిఫిన్ టైమ్’ మారాలి.. పిల్లల టైమ్ వృథా కాకూడదు

వంట ఆలస్యమైతే భోజనం ఆలస్యం.
భోజనం ఆలస్యమైతే తరగతులపై ప్రభావం.

ఈ గొలుసును తెంచడమే సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

ఉదయం 8 గంటలకే టిఫిన్, సాంబార్, కూరలను సీల్డ్ కంటైనర్లలో పాఠశాలలకు పంపేలా వ్యవస్థను రూపొందించారు.

పిల్లల సమయం వంట కోసం కాదు.. చదువు కోసం.

ఈ ఒక్క మార్పే వేలాది విద్యార్థుల దైనందిన జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

‘సింగరేణి’ కథలో మరో అధ్యాయం

మంథని ప్రాంతం అంటే సింగరేణి కూడా గుర్తుకు వస్తుంది.

ఇన్నాళ్లు భూగర్భంలో బొగ్గును వెలికితీసిన సింగరేణి.. ఇప్పుడు అదే ప్రాంతంలోని పిల్లల భవిష్యత్తుకు పరోక్షంగా బలమిస్తోంది.

సింగరేణి సహకారంతో, ప్రభుత్వం–హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఆధునిక వంటశాల రూపుదిద్దుకుంది.

బొగ్గుతో పరిశ్రమలకు ఇంధనం ఇచ్చిన సింగరేణి..
ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు ఆహారం అందించే కార్యక్రమంలో భాగమైంది.

ఇది ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన మలుపు.

యంత్రాలు వంట చేస్తాయి.. నాణ్యతను మనుషులే కాపాడాలి

ఆటోమేషన్ ఎంత పెరిగినా.. వేలాది మంది పిల్లలకు ఆహారం అందించే వ్యవస్థలో అసలు సవాలు నాణ్యత.

ఒక ఇంట్లో వండే వంటకు, 40 వేల మందికి వండే వంటకు తేడా చాలా ఉంది.

అందుకే పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వంట ప్రక్రియ, ప్యాకింగ్, రవాణా—ప్రతి దశ కీలకమే.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కిచెన్‌ను పరిశీలించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు.

యంత్రాలు తప్పు చేయకపోవచ్చు.. కానీ వ్యవస్థను నడిపించే మనుషుల పర్యవేక్షణే విజయానికి కీలకం.

శ్రీధర్ బాబు ‘ఆలోచన’ నుంచి ‘ఆచరణ’ వరకు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమానికి ముందడుగు వేశారు.

ఆయన ఆలోచనలోని అసలు సారాంశం ఒక్కటే—

పేద పిల్లవాడి పరిస్థితి అతని చదువుకు అడ్డంకి కాకూడదు.

ఇంటి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా.. పాఠశాలలో అతనికి కనీసం ఒక పూట మంచి ఆహారం దొరకాలి.

ఎందుకంటే..

కడుపు నిండిన పిల్లవాడి చేతిలో పుస్తకం బలంగా ఉంటుంది.
పుస్తకం బలంగా ఉంటే.. భవిష్యత్తు కూడా బలపడుతుంది.

ఇది భోజన పథకం కాదు.. భవిష్యత్తు పథకం

మంథని వంటిల్లు గురించి మాట్లాడేటప్పుడు ఇడ్లీలు ఎన్ని? ఎంత సామర్థ్యం? ఎన్ని యంత్రాలు? అనే లెక్కలు చెప్పడం సులభం.

కానీ అసలు లెక్క వేరే.

40,052 మంది పిల్లలు.
40,052 ఆకలి కడుపులు.
40,052 కుటుంబాల ఆశలు.
40,052 భవిష్యత్తులు.

వారిలో ఒక్క విద్యార్థి అయినా ఆకలి కారణంగా పాఠశాలలో వెనుకబడకుండా చూడగలిగితే.. ఈ వంటిల్లు తన లక్ష్యాన్ని సాధించినట్టే.

దిక్సూచి మాట

మంథని వంటిల్లు ఒక భవనం కాదు.
ఒక యంత్రాల సముదాయం కాదు.
ఒక వంటశాల మాత్రమే కాదు.

పేదరికం వల్ల పిల్లల కలలకు ఆకలి అడ్డుకాకూడదనే సంకల్పానికి ఇది ప్రతీక.

ఇక్కడ యంత్రాలు ఇడ్లీలు తయారు చేస్తాయి..
పాత్రలు అన్నం వండుతాయి..
వాహనాలు ఆహారాన్ని తరలిస్తాయి..

కానీ ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఉన్న అసలు శక్తి మాత్రం ఒక్కటే—

“ఏ బిడ్డా ఆకలితో బడిలో కూర్చోకూడదు.”

ఆకలికి సెలవు పెడితే..
చదువుకు దారి తెరుచుకుంటుంది.
ఆ దారిని చూపించడమే.. ‘దిక్సూచి’కి కనిపించిన మంథని వంటిల్లు అసలు కథ.

మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

**ఆగస్టు 24న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభం**

**కమ్యూనిటీ కిచెన్‌లో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి**

**ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలి**
--------------------------------------
**మంథని, ఆగస్టు 22:**
-------------------------------------
మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.

మంథని పట్టణంలోని గంగాపూర్ ప్రాంతంలో ఇస్కాన్ సంస్థ, హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,*  గంగాపూర్ ప్రాంతంలో ఇస్కాన్ సంస్థ, హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమ్యూనిటీ కిచెన్‌ను **ఆగస్టు 24, 2026న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి** చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కమ్యూనిటీ కిచెన్‌లో వంటశాల, ఆహార తయారీ, నిల్వ, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత తదితర సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి పార్కింగ్, భద్రత, విద్యుత్, తాగునీరు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో మంథని ఆర్డీవో సురేష్, మంథని మున్సిపల్ చైర్మన్  శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి,మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసిల్దార్ ఆరిపోద్దిన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రేపు పర్యటన వివరాలు

 


దిక్సూచి,  మంథని, ఆగస్టు 23: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం (ఆగస్టు 24) మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 9 గంటలకు గంగాపురిలో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 22 వేల మంది విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించే కార్యక్రమం ఈ వంటశాల ద్వారా కొనసాగనుంది.

ఉదయం 10.30 గంటలకు గంగాపురిలో రూ.2.55 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభిస్తారు.

అనంతరం ఉదయం 11.30 గంటలకు కమాన్‌పూర్ మండలంలో రూ.75 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ (ఎంఆర్‌ఓ) కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆదివరాహ స్వామి ఆలయానికి రూ.95 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు. కమాన్‌పూర్ గ్రామంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న ఈజీఎస్ పనులకు శ్రీకారం చుడతారు.

అలాగే గుండారం గ్రామం రాజాపూర్ నుంచి మంగపేట వరకు రూ.3.05 కోట్లతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆదివరాహ స్వామి జయంతి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారు.

శనివారం, ఆగస్టు 22, 2026

కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యానికి కొత్త బాట

 

విద్య, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధిపై విస్తృత చర్చలు

దిక్సూచి ప్రతినిధి, లండన్: 

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి.. నగరాన్ని అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో కేంబ్రిడ్జ్ భాగస్వామి కావాలని ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట సిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి.

అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం, శ్రీధర్‌బాబు



లండన్‌లోని చారిత్రక అంబేద్కర్ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921–22లో నివసించిన ఈ భవనాన్ని ప్రస్తుతం ఆయన ఆశయాలకు అంకితమైన మ్యూజియంగా నిర్వహిస్తున్నారు.

దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అంశాలను యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ చైర్ సంతోష్ దాస్ MBE వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని తెలుసుకోవడం, ఆయనతో ముడిపడిన వస్తువులను చూడటం తన జీవితంలోని గొప్ప అనుభూతుల్లో ఒకటని పేర్కొన్నారు.

కేంబ్రిడ్జ్ భాగస్వామ్యం, అంబేద్కర్ హౌస్ సందర్శన.. తెలంగాణ రైజింగ్ బృందం లండన్ పర్యటనకు విద్య, పరిశోధనతో పాటు సామాజిక న్యాయ స్ఫూర్తిని జోడించాయి.

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2పై బీఎల్‌ఏలకు అవగాహన


ముద్ర ప్రతినిధి, మధిర: మధిర నియోజకవర్గంలోని నాగులవంచలో గల వీవీసీ ఫంక్షన్‌ హాల్‌లో ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాలకు చెందిన బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 ప్రక్రియపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సమగ్ర అవగాహన కల్పించారు.

స్క్రీన్‌ ద్వారా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2లో చేపట్టాల్సిన ప్రక్రియ, బూత్‌ స్థాయిలో బీఎల్‌ఏల బాధ్యతలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఓటర్ల జాబితాలో తప్పులు, మార్పులను గుర్తించడం తదితర అంశాలను వివరించారు. ప్రతి బూత్‌ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్




దిక్సూచి, హైదరాబాద్:

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 2027 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో యూజీసీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. విద్య, పాలన, ప్రజా విధానాలు, ఉన్నత విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఒక ఫెడరల్ విశ్వవిద్యాలయ వ్యవస్థ కాగా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), కింగ్స్ కాలేజ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు దాని వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో ప్రతిపాదిత క్యాంపస్‌ను తొలుత సోమాజిగూడలోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా నిర్వహించి, అనంతరం నగర శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలోని ఎడ్యుకేషన్ జోన్‌కు తరలించే ప్రణాళిక ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ఈ క్యాంపస్ ద్వారా వివిధ విద్యా విభాగాలు, స్కూళ్ల పరిధిలో విస్తృత స్థాయిలో అంతర్జాతీయ కోర్సులను అందించే అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటైతే.. తెలంగాణ విద్యార్థులు ప్రపంచస్థాయి విద్యను స్వరాష్ట్రంలోనే పొందే అవకాశం లభించడంతో పాటు, అంతర్జాతీయ విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

శుక్రవారం, ఆగస్టు 21, 2026

వయోవృద్దుల సంరక్షణ భాద్యత వారసులదే

ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

దిక్సూచి, మంథని:
ప్రపంచ వయోవృద్దుల దినోత్సవ సందర్బంగా మంథని కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి అపర్ణ మల్లాది మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమ బాధ్యత వారి వారసులదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం క్రింద రెవెన్యూ డివిజన్ అధికారి కేసుల విచారణ జరిపి ఉత్తర్వులను జారీ చేస్తారని ,ఉల్లంఘన జరిగిన పక్షంలో కోర్టులు గరిష్ఠంగా  మూడునెలల జైలు శిక్ష, 5వేల వరకు జరిమాన విధించవచ్చని పేర్కొన్నారు,సీనియర్ న్యాయ వాదులు కె రఘోతం రెడ్ఢి, సువర్ణ చంద్రశేఖర్  చట్టం పట్ల అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ,సింగరేణి కార్మికుల  పెన్షనర్ అసోషియేషన్ సభ్యులు, న్యాయ వాదులు కటకం శ్రీనివాస్, సదన్ కుమార్, శశిభూషణ్ కాచె పాల్గొన్నారు

బుధవారం, ఆగస్టు 19, 2026

మంథనికి ఎంత చేసినా ప్రజల రుణం తీర్చుకోలేం

 

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు ప్రసంగం..


దిక్సూచి, మంథని: మంథని నియోజకవర్గానికి రూ.800 కోట్లు కాదు.. మరో రూ.800 కోట్లు ఇచ్చినా ఈ ప్రజల రుణం తీర్చుకోలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంథనిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

మంథని ప్రజల అదృష్టం కొద్దీ వారి ఎమ్మెల్యే, తమ అభిమాన నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు. ఏదైనా సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని పనిని పూర్తి చేయగలిగిన నైపుణ్యం శ్రీధర్‌బాబుకు ఉందని ప్రశంసించారు.

తనకు శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావుతో కలిసి అసెంబ్లీలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేశారు. శాసనసభ స్పీకర్‌గా ఎలా ఉండాలి, ఎలాంటి విలువలు, నైతిక బాధ్యతలతో వ్యవహరించాలి అనే విషయాలను శ్రీపాదరావును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన శ్రీపాదరావు వారసత్వాన్ని శ్రీధర్‌బాబు కొనసాగిస్తున్నారని చెప్పారు.

శ్రీధర్‌బాబు ఏ ముఖ్యమంత్రి హయాంలో ఉన్నా మంథని అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని తుమ్మల అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల సమయంలోనూ మంథని ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పట్టుదలతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేరుగా చెప్పడం కంటే శ్రీధర్‌బాబుకు సమస్యను చెప్పి పరిష్కారం పొందుతున్నామని అన్నారు.

శ్రీధర్‌బాబును ప్రజలు మరింతకాలం ఆశీర్వదించాలని తుమ్మల కోరారు. ఆయన మాటకు, గౌరవానికి, ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా వేదికపై ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. శ్రీధర్‌బాబు అప్పగించే అభివృద్ధి పనులను నాణ్యతతో, నిజాయితీగా, నిబద్ధతతో పూర్తి చేసి ఆయనకు ఎక్కడా మచ్చ రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్‌ శ్రీధర్‌బాబుకు కుడిభుజంలా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రిని సైతం నిలదీసి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అడగగలిగే నాయకుడని కొనియాడారు. అందుకే ఆయనను మరోసారి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు.

అదేవిధంగా యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్‌లో పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలను బలంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి వారసుడిగా వంశీకృష్ణ తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

ప్రజలు ఎన్నుకున్న శ్రీధర్‌బాబు, వంశీకృష్ణ వంటి నాయకులు తమ పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టి మరింత మెరుగ్గా పనిచేయాలని తుమ్మల ఆకాంక్షించారు. మంథని ప్రాంత అభివృద్ధిలో అందరూ భాగస్వాములై, ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

DIKHSOOCHI EPAPER 20.08.2026


 

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026