Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, జులై 06, 2026

లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

* మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా జహీరాబాద్ నిమ్జ్*

* పారిశ్రామిక ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల దుష్ప్రచారం

* *దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, సిద్దిపేట, జూలై 6:

ఆరోగ్య రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను అవకాశాలుగా అందిపుచ్చకునేలా తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పరిశోధన, సాంకేతికత, ఏఐ, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ధిని సమన్వయం చేస్తూ, భవిష్యత్తులో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్లలోని బయోటెక్ పార్క్ ఫేజ్ – 3 లో రూ.800 కోట్ల పెట్టుబడితో సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. జహీరాబాద్ నిమ్జ్ ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ‘గ్రీన్ ఫార్మా’ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని... పర్యావరణహిత పద్ధతుల్లో ఔషధాలను ఉత్పత్తి చేసేలా పరిశ్రమలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చేలా... తెలంగాణ నుంచే ఒక కొత్త మాలిక్యూల్ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ రైజింగ్–2047, నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా పరిశోధన నుంచి ఉత్పత్తి వరకు అన్ని దశలను అనుసంధానించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్ అండ్ జీన్ థెరపీలు, ఏఐ, డిజిటల్ హెల్త్ తదితర అత్యాధునిక రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీలపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లలో పారిశ్రామికంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా అదే పనిగా మాపై బురద చల్లుతున్నాయన్నారు. తాజాగా ప్రారంభించిన ఈ ప్లాంట్ లో అత్యాధునిక కంటైన్‌మెంట్ టెక్నాలజీని ఉపయోగించి... క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఓరల్ ఆంకాలజీ ఔషధాలు, స్టెరిలైజ్డ్ ఇంజెక్టబుల్స్, లైయోఫిలైజ్డ్ పౌడర్ ఇంజెక్షన్లు, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ను ఉత్పత్తి చేస్తారన్నారు. ఇక్కడ కొత్తగా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. దేశీయ ఫార్మా రంగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కంపెనీ ప్రతినిధులు డా.గోవింద రెడ్డి, డా.మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

  అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 6:

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా   రెవెన్యూ అధికారి రాజేశ్వరి  సంబంధిత  అధికారులను ఆదేశించారు.

సోమవారం  జిల్లా   రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

శ్రీరాంపూర్ మండలం  మంగపేట గ్రామానికి చెందిన ఏ లక్ష్మి తమ గ్రామ నందు ఖాళీగా ఉన్న అంగన్వాడి ఆయా పోస్ట్ తమకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహంకాళి వీరమ్మ, గొట్టె లింగమ్మ  సర్వేనెంబర్ 294 నందు ప్రభుత్వం తరఫున ఉమ్మడిగా బోర్వెల్ ఏర్పాటు చేయుట గురించి దరఖాస్తు చేసుకోగా ఈడీఎస్సీ కార్పొరేషన్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

మంథని పట్టణం రాఘవ ఊర్ల నగర్ కు చెందిన భీమనపల్లి సురేందర్ తన కుమార్తెకు ఏదైనా బిసి గురుకుల పాఠశాలలో 8వ తరగతి నందు సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా గురుకుల పాఠశాల సొసైటీ అధికారుల కొరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ , సంబంధిత జిల్లా అధికారులు, కలెక్టరేట్ డి.విభాగ పర్యవేక్షకులు ఈశ్వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి నివాళి

 

 చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

దిక్సూచి, మంథని, జూలై 6:

బీజేపీ, పూర్వపు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని మంథని ప్రాంతంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్, మాజీ అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు రేపాక శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడ్ల సాగర్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, చంద్రన్న, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

దిక్సూచి, కరీంనగర్, జూలై 6:

రైతు భరోసా నిధుల విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు సంబరాలు చేసుకున్నారు. సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్, లక్ష్యంపూర్ గ్రామాల రైతులతో పాలాభిషేకం  సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తోందని అన్నారు. రైతుల పక్షాన నిలబడి రేవంత్ అన్న నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తోందని, రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కాంతాల జగన్ రెడ్డి, వరాల నర్సింగ్,  బొమ్మ ఈశ్వర్ గౌడ్, మిరియాల శ్రీధర్ రెడ్డి  స్థానిక కాంగ్రెస్ నాయకులు కాశిపాక శంకరయ్య, తేజ సందీప్, పెంట శేఖర్, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం, జులై 05, 2026

శ్రీ రేణుక ఎల్లమ్మ సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు


 తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

 – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ధన్వాడ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం


దిక్సూచి, కాటారం, జూలై 5:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో జీవించాలని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రార్థించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, ప్రజల్లో ఐకమత్యం, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ధన్వాడ గ్రామ ప్రజలు ఐక్యంగా కలిసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు.

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, యువతకు మంచి అవకాశాలు లభించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు.





గంగపుత్రుల సేవలు చిరస్మరణీయం

 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

 దిక్సూచి, మంథని, జూలై 5:

ఇటీవల మంథని గోదావరి నదిలో గల్లంతై మృతి చెందిన కొమురయ్య మృతదేహాన్ని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించిన గంగపుత్రుల సేవలను కొనియాడుతూ, ఈరోజు బెస్తపల్లి గ్రామంలో గంగపుత్రులను మరియు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి  శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాద సమయంలో ఏమాత్రం వెనుకాడకుండా మానవత్వంతో ముందుకు వచ్చి సేవలందించిన గంగపుత్రులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. వారి సేవా భావం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, కొండ్రు లక్ష్మణ్, వార్డు సభ్యుడు కంచు మల్లేష్, తోట్ల రాజు, బొరె తిరుపతి, బొరె రాజేశం, ధర్మాజీ రాజేందర్, మహేష్, సందీప్, గుమ్మడి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్..!



జూలై 8న రెండు కీలక అవకాశాలు

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 4: నిరుద్యోగ యువతకు, ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు జూలై 8న రెండు కీలక అవకాశాలు లభించనున్నాయి. ఒకవైపు బీసీ గురుకుల పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించగా, మరోవైపు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో 67 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు.

బీసీ గురుకులాల్లో అతిథి ఉపాధ్యాయుల ఇంటర్వ్యూలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు అతిథి ఉపాధ్యాయుల నియామకానికి జూలై 8న ఇంటర్వ్యూలు, డెమో నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ అంజలి తెలిపారు.

పీజీ, బీఎడ్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. పీజీటీ, టీజీటీ విభాగాల్లో ఇంగ్లీష్, బయో సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సోషల్, జువాలజీ, కామర్స్, కెమిస్ట్రీ, సివిక్స్, బోటనీ, ఎకనామిక్స్, బీఎస్సీ నర్సింగ్ తదితర సబ్జెక్టులకు నియామకాలు చేపట్టనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు జూలై 8న ఉదయం 10 గంటలకు తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.


67 పోస్టులకు జాబ్ మేళా

జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో 67 ఉద్యోగాల భర్తీ కోసం జూలై 8న జాబ్ మేళా నిర్వహించనున్నారు.

ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • సేల్స్ ఎగ్జిక్యూటివ్ – 60

  • ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 4

  • హెచ్‌ఆర్ – 2

  • ఆఫీస్ బాయ్ – 1

సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్మీడియట్/డిగ్రీ/డిప్లొమా, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్, హెచ్‌ఆర్ పోస్టులకు ఎంబీఏ (మార్కెటింగ్)/హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్, ఆఫీస్ బాయ్ పోస్టుకు పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు అర్హులు.

అభ్యర్థులు జూలై 8న ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం (IDOC), మొదటి అంతస్తు, రూమ్ నెం. 233లో నిర్వహించే జాబ్ మేళాకు అప్‌డేటెడ్ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ కార్డు, అనుభవ పత్రాలు (ఉన్నట్లయితే) తీసుకుని హాజరు కావాలని అధికారులు సూచించారు.

మరిన్ని వివరాలకు: 9908674056, 8985336947, 8121262441 సంప్రదించవచ్చు.

మహిళపై దోపిడీ, హత్యాయత్నం.. విద్యార్థి అరెస్ట్









ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనం ఆ విద్యార్థిని క్రిమినల్ చేసింది

 దిక్సూచి,  కరీంనగర్, జూలై 5:

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనం ఓ యువకుడిని దారుణ నేరానికి పాల్పడేలా చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకున్న డిగ్రీ విద్యార్థి, డబ్బు కోసం ఓ మహిళా కూలీపై దోపిడీ చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన ధమ్మ దినేష్ రెడ్డి (21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. DIUWIN, జియో లాటరీ, కలర్ ట్రేడింగ్ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్‌లకు బానిసైన అతడు సుమారు రూ.4 లక్షలు నష్టపోయాడు. లోన్ యాప్‌ల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో డబ్బు సమకూర్చుకునేందుకు దోపిడీకి పథకం రచించాడు.

జూలై 1న కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద పని కోసం వేచి ఉన్న గంగాధర లక్ష్మి (55) అనే మహిళా కూలీని ర్యాపిడో బైక్‌పై నమ్మించి నుస్తులాపూర్ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడలో ఉన్న సుమారు ఐదు గ్రాముల బంగారు పుస్తెలు, గుండ్లు, వెండి మట్టెలను లాక్కున్నాడు.

అనంతరం తాను గుర్తుపట్టకుండా ఉండేందుకు మహిళను సమీపంలోని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. బాధితురాలు బావిలోని తాడును పట్టుకుని బయటపడేందుకు ప్రయత్నించగా, నిందితుడు కత్తితో ఆ తాడును నరికేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈత రావడంతో బాధితురాలు బావిలోని మోటార్ పైపును పట్టుకుని రాత్రంతా ప్రాణాలతో పోరాడింది. మరుసటి రోజు ఉదయం బావి నుంచి వినిపించిన అరుపులను గమనించిన స్థానిక రైతులు వెంటనే అక్కడికి చేరుకుని మంచం, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

సమాచారం అందుకున్న కరీంనగర్ 1-టౌన్, 3-టౌన్ పోలీసులు, జిల్లా దర్యాప్తు విభాగం (DIU) బృందాలు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని మార్కెట్ ప్రాంతంలోని అమరవీరుల స్థూపం సమీపంలో అరెస్ట్ చేశాయి. దొంగిలించిన నగలను కొనుగోలు చేసిన వ్యాపారి వద్ద నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల హెచ్చరిక

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లు యువతను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి నేరాల వైపు నెడుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిఘా ఉంచాలని, వారు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు లేదా అప్పుల్లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే లేబర్ అడ్డాల వద్ద పని కోసం వేచి ఉండే కూలీలు అపరిచితులను నమ్మి ఒంటరిగా వెళ్లే ముందు వారి వివరాలు, వాహనం నంబర్‌ను కుటుంబ సభ్యులకు లేదా తోటి కూలీలకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

శనివారం, జులై 04, 2026

తండ్రుల పేరిట పురస్కారాలు ఇవ్వడం గొప్ప సంస్కృతి


రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ జివి శ్యాంప్రసాద్ లాల్

దిక్సూచి, కరీంనగర్:

మన భారతీయ సంస్కృతి “మాతృదేవో భవ, పితృదేవో భవ” అని బోధించిందని, తల్లిదండ్రుల పేరిట పురస్కారాలు అందించడం గొప్ప సంస్కృతి అని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ జివి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు.

 శుక్రవారం సాయంత్రం కరీంనగర్ ఫిలిం భవన్ లో సమైక్య సాహితి ఆధ్వర్యంలో తండ్రుల పేరిట అందజేస్తున్న విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి తండ్రులను దేవతలతో సమానంగా భావించే మన సంస్కృతి లో వారి పేరును సేవతో, సత్కార్యాలతో, సన్మానాలతో చిరస్థాయిగా నిలబెట్టడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. 

నాన్న ల పట్ల ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తీకరించడం నిజంగా ప్రశంసనీయమని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు, గద్దర్ పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. 

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం ఎన్నటికీ తీర్చలేనిదని వారి పేరు సమాజంలో గౌరవంగా నిలిచేలా చేయడం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, వారి విలువలను భావితరాలకు అందించడం నిజమైన ప్రేమ కు నిదర్శనం అని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం నాన్నల పేరిట అందించే ఈ పురస్కారాలు సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. ముందుగా నంది శ్రీనివాస్ రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పురస్కార ప్రదాత గా వ్యవహరించే ఆచార్య రజనిశ్రీ నృత్య పురస్కారాన్ని 

 ప్రముఖ నృత్య కళాకారులు, అధ్యక్షులు ఆదివాసీ నృత్య నికేతన్ జె. రతన్ కుమార్ కు ప్రదానం చేశారు. సీనియర్ ఫిజీషియన్ డా. డి. రఘురామన్ అందిస్తున్న డాక్టర్ దారం నాగభూషణం పురస్కారాన్ని , ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కవి  కరిపె రాజ్ కుమార్ కు ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని 

సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ ప్రదాత గా అందజేసే మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారాన్ని 

అసోసియేట్ ప్రొఫెసర్, ఛైర్మన్ బోర్డు ఆఫ్ స్టడీస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొ. ఎస్. రఘు కు అందజేశారు. పూర్వ డిప్యూటి న్యూస్ ఎడిటర్, ఈనాడు రావికంటి శ్రీనివాస్ ప్రదాత గా అందించే 

రావికంటి రామయ్య గుప్త పురస్కారాన్ని  ప్రముఖ పద్యకవి, చతుర, విపుల పూర్వ ఎడిటర్ చంద్ర ప్రతాప్ కంతేటి కి అందజేశారు. సమైక్య సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.అనంతాచార్య అందించే సంపత్ కుమారాచార్య స్మారక సంగీత పురస్కారాన్ని ప్రముఖ మృదంగ కళాకారులు నమిలికొండ వేణుగోపాల్ కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార ప్రదాతలు మరియు పురస్కార గ్రహీతలు మాట్లాడారు. జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం లో రతన్ కుమార్ శిష్య బృందం చక్కని నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమం లో డా గండ్ర లక్ష్మణరావు, డా బివిఎన్ స్వామి, గాజుల రవీందర్, తదితరులు పాల్గొన్నారు

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు  దుద్దిళ్ల శ్రీధర్ బాబు

*అధికారులు బాధ్యత, పారదర్శకతతో పని చేయాలి

*ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి

*ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై శ్వేతపత్రం సిద్ధం చేయాలి

*యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికి ఆదర్శం.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి

*అభివృద్ధి పనులు, భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

*సన్న వడ్లు సాగు చేసి బోనస్ పొందాలి

* ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల్లో గణనీయమైన పురోగతి

* జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి. పెద్దపల్లి,  జూలై, 04:

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 

శనివారం  పెద్దపల్లి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రోటోకాల్ & ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్ , ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,  రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్  రాజ్ ఠాకూర్ లతో కలిసి పెద్దపెల్లి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఇరిగేషన్ , పంచాయతీరాజ్,పట్టణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు,  వైద్య శాఖ, విద్యా శాఖ, ఎస్సి, తీసి, మైనారిటీ సంక్షేమ శాఖ, పరిశ్రమల, రెవెన్యూ శాఖ, వి.బి.జి రామ్ జి, త్రాగునీటి సరఫరా,  విద్యుత్ సరఫరా , అటవీ శాఖ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాలకు పైగా పదవీకాలం ఉందని, ఈ కాలంలో ప్రతి అధికారి మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేయాలని మంత్రి  అన్నారు.

ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలను ఓపికగా వినాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి విసుగు లేకుండా ప్రతి దరఖాస్తును పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుల్లో లోపాలు ఉంటే లేదా ఏదైనా పని ఆలస్యం అవుతుంటే దానికి గల కారణాలను ప్రజలకు స్పష్టంగా, వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని ఆదేశించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. చిన్న సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. తెలిసి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా స్థాయిలో సమగ్ర శ్వేతపత్రం (వైట్ పేపర్) సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు, సూచన, అభిప్రాయం ప్రభుత్వానికి చేరేలా చర్యలు తీసుకోవాలని, వాటి ఆధారంగా లోపాలు, పెండింగ్ అంశాలు, బ్యాక్‌లాగ్‌లను గుర్తించి వెంటనే సరిదిద్దే కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లా పరిపాలన, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నాయకత్వంలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సేవల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు.

రైతుల కోసం పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. జిల్లాలో ప్రతి అర్హ రైతుకు అవసరమైన సమయంలో యూరియా తప్పనిసరిగా అందేలా చూడాలని, అవసరం లేని వారికి యూరియా పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి పంటల సాగును విస్తరించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి మండలంలోని రైతు వేదికల్లో ఆ ఏడు రకాల విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన విత్తన మేళా తరహాలో రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

వ్యవసాయ అధికారులు రైతులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పంటలను పర్యవేక్షించాలని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని తెలిపారు.

 అనధికారిక, నాణ్యతలేని విత్తనాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.జిల్లాలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని, భూసేకరణ ప్రక్రియలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ పారదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు.

*ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ,* వానాకాలంలో సన్న రకాల వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయం, గత ప్రభుత్వం రైతుబంధు కింద అందించిన మొత్తాన్ని మించిందని  అన్నారు.

 రైతులు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న సన్న రకాల వరిని సాగు చేసి అధిక లాభాలు పొందాలని పిలుపునిచ్చారు.

మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఏడు రకాల వరి వంగడాలను ప్రభుత్వం ముందుగానే గుర్తించి వాటికి బోనస్ ప్రకటించిందని తెలిపారు.

 రైతులు కూడా ఆయా ఏడు రకాల వరి వంగడాలనే సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గతంలో రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత కూడా 45 రోజుల వరకు చెల్లింపులు అందని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తోందని తెలిపారు. 

రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు నాణ్యమైన విత్తనాలతో ప్రభుత్వం సూచించిన వరి వంగడాలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ప్రభుత్వ విప్ పిలుపునిచ్చారు.



జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ యూరియా  యాప్ వినియోగంతో గత యాసంగిలో జిల్లాలో యూరియా వినియోగం 19 శాతం తగ్గిందని తెలిపారు. వానాకాలం సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 21,126 మంది రైతులకు యాప్ ద్వారా 2,453 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని అన్నారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, గత మూడు సంవత్సరాల్లో 3,572 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా రూ.5.43 కోట్ల సబ్సిడీ అందించామని చెప్పారు.

పీఎం కుసుమ్ పథకం కింద నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎలిగేడు వద్ద ప్రపంచ స్థాయి గోదాముల నిర్మాణానికి భూమి కేటాయించామని తెలిపారు.

గత యాసంగిలో రికార్డు స్థాయిలో 65,129 మంది రైతుల నుంచి 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,057 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో 6,276 ఇళ్లను మంజూరు చేయగా 1,909 గృహప్రవేశాలు పూర్తయ్యాయని, రూ.130.24 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రెండో విడతకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందన్నారు.

మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, మేడిపల్లి పరిశ్రమల పార్కు, శ్రీపాద మార్గం–మంథని నాలుగు లైన్ల రహదారి, పెద్దపల్లి బైపాస్ తదితర ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఎస్‌ఐఆర్‌లో 90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని చెప్పారు. అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ప్రతి నెల ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 14 లక్షలకుపైగా ఉపాధి దినాలు కల్పించామని, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, ఉపాధి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన పనులను చేపట్టామని, చెరువుల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు.

వైద్య రంగంలో మంథని 50 పడకల ఆసుపత్రి, రామగుండం మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో అవార్డులు సాధించిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఓపీ, ఇన్‌పేషెంట్లు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఆధారిత విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు పైలట్ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తూ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, మెగా జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు.

పోషకాహార లోపం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి ఫలించిందన్నారు.

పట్టణాభివృద్ధి కార్యక్రమాల కింద అమృత్–2.0, టీయూఎఫ్‌ఐడీసీ తదితర పథకాల ద్వారా తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ఎక్కువ శాతం పూర్తిచేశామని పేర్కొన్నారు.

సమీక్ష సమావేశానికి ముందు  మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ ఉద్యమ అమరవీరులు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య  చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణలో నూతన అంబులెన్స్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించి, ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించే దిశగా ఈ అంబులెన్స్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  జె.అరుణ శ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్ డి వో లు సురేష్, గంగయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎ. అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్. మల్లయ్య,  జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


హెల్త్ ఇన్సూరెన్స్.. కార్పొరేట్ వైద్యం..!


ఒకప్పుడు ఇంటి స్థలం అమ్ముకుని ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో అదే చికిత్స క్యాష్‌లెస్‌గా అందుతోంది. ఇది ఆరోగ్య రంగంలో పెద్ద మార్పే. అయితే ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అవసరం లేని ఆపరేషన్లు పెరుగుతున్నాయా?

దేశంలో ఆరోగ్య బీమా విస్తరించిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం గతంలో ఖర్చుకు భయపడి చికిత్స వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు ధైర్యంగా ముందుకు రావడమేనని ఆసుపత్రులు చెబుతున్నాయి. కానీ వినియోగదారుల సంఘాలు, కొందరు వైద్య నిపుణులు మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. బీమా ఉందని తెలిసిన తర్వాత ఖరీదైన పరీక్షలు, ప్యాకేజీ చికిత్సలు, వెంటనే ఆపరేషన్ చేయాలనే సూచనలు ఎక్కువవుతున్నాయని వారు అంటున్నారు.

గతంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గర్భాశయ తొలగింపు, మోకాలి మార్పిడి, గుండె సంబంధిత చికిత్సలు, వెన్నెముక శస్త్రచికిత్సల విషయంలో అనవసర ఆపరేషన్లు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వాలు విచారణలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రులపై చర్యలు కూడా తీసుకున్నారు. అదే సమయంలో వేలాది మంది రోగులకు సమయానికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల మొత్తం కార్పొరేట్ వైద్య వ్యవస్థపై ఒకే ముద్ర వేయడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అనుమానాస్పద క్లెయిమ్‌లను అడ్డుకునేందుకు ప్రీ-ఆథరైజేషన్, మెడికల్ ఆడిట్లు, ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ అధిక బిల్లింగ్, అవసరం లేని పరీక్షలు, తప్పుడు క్లెయిమ్‌ల వంటి ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

వైద్య నిర్ణయం పూర్తిగా రోగి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. శస్త్రచికిత్సకు ముందు అన్ని ప్రత్యామ్నాయాలను వివరించడం, అవసరమైతే రెండో వైద్యాభిప్రాయం తీసుకునే అవకాశం కల్పించడం, ప్రభుత్వ నియంత్రణను మరింత బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలకు భరోసా కావాలి. అది అనవసర చికిత్సలకు ప్రోత్సాహకంగా మారకుండా పారదర్శక వ్యవస్థ ఉండాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.

రోగులు పాటించాల్సిన జాగ్రత్తలు

  • శస్త్రచికిత్స అవసరాన్ని పూర్తిగా తెలుసుకోండి.
  • వీలైతే మరో నిపుణుడి (సెకండ్ ఒపీనియన్) అభిప్రాయం తీసుకోండి.
  • ఇన్సూరెన్స్ కవర్ ఉందని అనవసర పరీక్షలకు వెంటనే అంగీకరించవద్దు.
  • చికిత్స, ఖర్చుల వివరాలను లిఖితపూర్వకంగా తీసుకోండి.
  • సందేహం ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీతో నేరుగా మాట్లాడండి.

నియంత్రణ బలోపేతం కావాలంటే...

  • హై రిస్క్ ఆపరేషన్లపై స్వతంత్ర మెడికల్ ఆడిట్లు.
  • అనవసర శస్త్రచికిత్సలు నిరూపితమైతే కఠిన చర్యలు.
  • ఆసుపత్రుల చికిత్స విధానాల్లో పారదర్శకత.
  • రోగుల ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన వ్యవస్థ.
  • బీమా కంపెనీలు–ఆసుపత్రుల లావాదేవీలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ.

ఫ్యాక్ట్ ఫైల్

 హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లాభాలు

  • చికిత్స భారం తగ్గుతుంది.
  • క్యాష్‌లెస్ వైద్యం అందుబాటులోకి వస్తుంది.
  • సమయానికి చికిత్స పొందే అవకాశం పెరుగుతుంది.

సవాళ్లు

  • అధిక బిల్లింగ్ ఆరోపణలు.
  • అవసరం లేని పరీక్షలు, చికిత్సలపై ఫిర్యాదులు.
  • తప్పుడు బీమా క్లెయిమ్‌ల ప్రయత్నాలు.
  • పారదర్శకతపై ప్రశ్నలు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026