సమీక్షిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
డీఎంఎఫ్టీలో నిధుల కొరత లేదు.. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలి
జూలై రెండో వారానికల్లా మెజారిటీ అభివృద్ధి పనులకు గ్రౌండింగ్ పూర్తి చేయాలి
పరిశుభ్రత, ప్రతి ఇంటికి తాగునీరు, బ్లాక్ స్పాట్ నిరోధించడమే తొలి ప్రాధాన్యత
రామగుండం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
పెద్దపల్లి:
రామగుండం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని, మంజూరైన ప్రతి పనిని వేగంగా క్షేత్రస్థాయిలో ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జె. అరుణశ్రీతో కలిసి రామగుండం అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగామాట్లాడుతూ డీఎంఎఫ్టీలో నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ స్మశానవాటికలు, మహిళా శక్తి భవనాలు, విద్యాసంస్థల అభివృద్ధి పనులు, తాగునీటి పనులు, ఇతర మౌలిక వసతుల పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంజినీరింగ్ అధికారి రోజు వారీగా పనులను పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయిలో నిర్మిస్తున్న మహిళా సంఘ భవనాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియల్లో జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని సూచించారు. రూ.5 లక్షల విలువైన చిన్న పనులు కూడా ఏడాది గడిచినా పూర్తికాకపోవడం అధికారుల పనితీరును ప్రతిబింబిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై రెండో వారానికల్లా మంజూరైన మెజారిటీ అభివృద్ధి పనులకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కోర్టు భవనం నిర్మాణానికి సంబంధించిన సవరించిన అంచనాలకు ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం వచ్చేలా నిరంతరం ఫాలోఅప్ చేయాలని, మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ అంచనాలను తక్షణమే ఖరారు చేయాలని ఆదేశించారు. 2 బీహెచ్కే గృహాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న విద్యుత్, సెప్టిక్ ట్యాంకులు, తాగునీటి వంటి మౌలిక వసతుల పనులను వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పట్టాలు పంపిణీ చేసిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు కూడా అందజేసి వెంటనే గృహ ప్రవేశం చేసేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్లు జారీ చేయాలని ఆదేశించారు. రామగుండంలోని విద్యాసంస్థల్లో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, నరేగా ద్వారా చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను జూన్ 30లోపు పూర్తి చేసి బిల్లులు క్లెయిమ్ చేయాలని సూచించారు. నరేగా నిధుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పలుమార్లు సూచించినా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి అవసరమైతే మంజూరు రద్దుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మొదటి విడతలో మిగిలిన గృహాల మంజూరుకు అవసరమైన సర్వే పూర్తి చేసి ఒకే రోజు పెద్ద ఎత్తున మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రామగుండం నగరంలో గృహ నిర్మాణాలు, తాగునీటి పనులు, మహిళా శక్తి భవనాల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేయాలని, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రామగుండంలో సుమారు రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇంకా కాగితాలకే పరిమితమై ఉన్నాయని, వాటిని అత్యవసరంగా గ్రౌండ్ చేసి అమలు దశకు తీసుకురావాలని సూచించారు. నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రామగుండం నగరంలో పారిశుద్ధ్య పరిస్థితిని పూర్తిగా మెరుగుపర్చాలని, ప్రతి నెల రూ.2 కోట్ల వరకు పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ రహదారులపై చెత్త కనిపించడం అంగీకారయోగ్యం కాదన్నారు. నగరంలో ఒక్క బ్లాక్ స్పాట్ కూడా లేకుండా వీధి దీపాల ఏర్పాటు, ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ అందించడం ప్రాధాన్యతగా తీసుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.