కోకాపేట వద్ద నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా, మంజీరా జలాలను ఇక్కడికి తీసుకొచ్చింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది.
మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జంటనగర వాసులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ఇదే మార్పునకు సంకేతం.
భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాం. వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం.
భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. నగరవాసులకు అంతర్జాతీయ జీవన ప్రమాణాలను అందించాలన్నదే మా సంకల్పం అన్నారు.
కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.