ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజనతో స్వయం ఉపాధికి చేయూత
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
దిక్సూచి, మేడ్చల్, సెప్టెంబర్ 1: మైనారిటీ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన అని తెలిపారు.
మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజుబుద్దీన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
225 మంది మహిళలకు రూ.50 వేల చొప్పున సాయం
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద మేడ్చల్ జిల్లాలో 225 మంది మైనారిటీ మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం ద్వారా పథకంలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
ఈ ఆర్థిక సహాయాన్ని మహిళలు స్వయం ఉపాధి, చిన్న వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకుని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మహిళలకు అందించే ప్రతి రూపాయి కుటుంబ సంక్షేమానికి ఉపయోగపడుతుందని, అందుకే ప్రజా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.
వృత్తి ఆధారిత ఉపాధికి ప్రోత్సాహం
మైనారిటీ వర్గాల్లో సంప్రదాయ వృత్తులపై ఆధారపడే వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక చేయూత అందిస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు. తుర్క కాశీ ముస్లిం వర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు రూ.60 వేల విలువైన జనరేటర్లు, టూల్కిట్లను పంపిణీ చేశారు.
అలాగే ‘రేవంత్ అన్న సహారా–మిస్కీనో కే లియే’ పథకం ద్వారా మైనారిటీల జీవనోపాధికి అవసరమైన మోపెడ్లను అందిస్తున్నామని, స్వయం ఉపాధి కింద మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నామని తెలిపారు.
మైనారిటీల విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మత, సామాజిక, మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయం అందించడంతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.
ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం
ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్థిక చేయూత అందించడం గర్వంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని తెలిపారు.
గృహజ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్నామని, సీయూఆర్ఈ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
విద్య, రైతులు, యువతకు ప్రాధాన్యం
పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి వ్యవసాయ పనిముట్లు, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు.
అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు లబ్ధిదారులకు చెక్కులు, జనరేటర్లు, టూల్కిట్లను అందజేశారు.కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, ఆర్టీఏ సభ్యుడు, మున్సిపల్ చైర్పర్సన్లు, టీజీఎల్‌డీఏ చైర్మన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కాంతమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి