తెలంగాణ–మారిషస్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ
దిక్సూచి, హైదరాబాద్:
మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లుచ్మనన్ పెంతియా శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పరిపాలన, పర్యాటకం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర రంగాల్లో తెలంగాణ–మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు.
తెలంగాణను తమ దేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా భావిస్తోందని మారిషస్ మంత్రి లుచ్మనన్ పెంతియా తెలిపారు. మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు, ఆధునిక పరిపాలనా విధానాలపై శిక్షణ అందించేందుకు సహకరించాలని శ్రీధర్‌బాబును కోరారు. రాష్ట్రంలోని ఎంసీహెచ్ఆర్డీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు.
అన్ని రంగాల్లో మారిషస్‌కు సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
డిసెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’లో పాల్గొనాలని మారిషస్ మంత్రిని శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
ఈ సమావేశంలో మారిషస్ అధికారులు, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి