(ఖతార్ నుంచి రామడుగు వేణుగోపాల్)
ఆంధ్ర కళా వేదిక (AKV) నిర్వహించిన "సంక్రాంతికి వస్తున్నాము" సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమాన్ని రంగ రంగ వైభోగంగా , అత్యంత అట్టహాసంగా kఖతార్ దేశంలో అల్వక్రా ప్రాంతంలోని DPS MIS పాఠశాలయందు 08.01.2025 గురువారం రోజున సాయంకాలం 5.30 గం. నుండి రాత్రి 12 గం. వరకు నిర్వహించారు. ఐతే సాంస్కృతిక కార్యక్రమం విజయం అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు "ఆంధ్ర కళా వేదిక" చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక మహా ఘట్టం.
కార్యస్థలిలో అడుగు పెట్టగానే సంక్రాంతి ఉత్సాహంతో అలంకరించిన వేదిక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.హరిదాసు , కోడిపుంజు , గాలిపటం, పాలుపొంగించే సంప్రదాయ అలంకరణలు వేదికను మకర సంక్రాంతి పండుగలా మార్చాయి. వాతావరణం పూర్తిగా మనవూర్లో జరిగే పండుగ జరుపుకున్న భావనకు గురిచేసింది .వేదికపై సంగీతం, లైటింగ్, నృత్యం కలసి ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని సృష్టించాయి.
AKV కమిటి సభ్యులందరూ సంప్రదాయ ధోతీలు, శాలువాలు ధరించి, మహిళా సభ్యులు పచ్చని చీరలతో వేదికపైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ గర్వంతో ఉప్పొంగిపోయారు.
సుమారు 80 మంది కళాకారుల భాగస్వామ్యంతో నృత్య నాటిక ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ముఖ్యంగా 40 మంది కళాకారులతో శ్రీకృష్ణ లీలల ప్రదర్శన, వేలాది దీపాల వెలుగుల మధ్య, కనులకు పండుగగా ఆడిటోరియం అంతా ఆధ్యాత్మిక భావం కలిగించింది. స్థానిక కళాకారుల ప్రదర్శనలు కూడా అద్భుతంగా ఉండటంవలన , ప్రతి ప్రదర్శనకు చప్పట్ల మోత మోగింది.
కృష్ణ చైతన్య & మాళవిక గార్ల యుగళ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.డాన్స్ మాస్టర్లు సత్య & తేజస్విని వేదికపై అగ్నిపర్వతంలా చెలరేగారు.నటుడు పృధ్వీ(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ) గారి కుమార్తె శ్రీలు చేసిన నృత్యం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఖతార్లోని భారత రాయబారి శ్రీ విపుల్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రసంగం ప్రారంభించి, సంక్రాంతి సందేశంతో ముగించగా, సభ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. ICC ప్రెసిడెంట్ మరియు భారత రాయబారి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
AKV అధ్యక్షుడు శ్రీ రమణయ్య గారు తన ప్రసంగాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభించి, కమిటీ సభ్యుల సమన్వయాన్ని అభినందిస్తూ, AKV కుటుంబ సభ్యుల నాణ్యత మరియు సహకారాన్ని ప్రశంసిస్తూ , కార్యస్థలం మొత్తం తెలుగు కుటుంబాలతో నిండినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
రామ్ కీ హీరో గారి మాటలు, నటి భూదేవి గారి నృత్యం,జానపద గాయకులు సరళ మరియు జాన్ పాడిన గీతాలు జనాలను పల్లె వాతావరణానికి తీసుకెళ్లాయి. యాంకర్ స్వప్న చౌదరి గారి యాంకరింగ్ కార్యక్రమానికి ప్రాణం పోసింది. ఆమె మాటల సమయంలో ఆడిటోరియం సంపూర్ణ నిశ్శబ్దంలోకి వెళ్లడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
టి.డి జనార్దన్ గారు ( అన్న యన్ టీఆర్ లిట్రేచర్ కమిటీ చైర్మన్) గారు మాట్లాడుతూ తెలుగు భాష, యాస, మరియు తెలుగు రాష్ట్ర కీర్తిని ప్రపంచదేశాలకు తెలియజేసిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరారావుగారి గూర్చి అద్భుతంగా వర్ణించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు పూర్తిగా కుటుంబ సభ్యులే కావడం AKV చరిత్రలో ఒక విశేష ఘట్టం.
ఖతార్ నలుమూలల నుంచి వచ్చిన కుటుంబాలు పిల్లలతో సహా ఆనందంలో మునిగిపోయాయి. ప్రేక్షకులే వేదికపైకి వచ్చి కళాకారులతో కలిసి నృత్యం చేయడం వేదికను ఊపేసింది. పిల్లలు, పెద్దలు, యువత అందరూ ఒకటే ఉత్సాహం.
సాధారణంగా రాత్రి 10 గంటలకే ముగిసే ఈవెంట్, ప్రేక్షకుల ఉత్సాహం చూసి పోలీసులే అనుమతులు ఇస్తూ కార్యక్రమ సమయాన్ని రాత్రి పన్నెండు గంటలవరకు పొడిగించారు. మొదటి నుంచి చివరవరకు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసి ఒక్కరినికూడా కుర్చి నుండి లేవకుండా చేసాయి.
ఈ కార్యక్రమం సూపర్ హిట్ కాదు, బ్లాక్బస్టర్ హిట్ అంటూ కార్యక్రమం చివరన ప్రతీ ప్రేక్షకుడు తన భావం వ్యక్తం చేసాడు .
కళాకారులకు గౌరవం, స్పాన్సర్లకు ప్రాధాన్యం, AKV కమిటీ మరియు AKV కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఈ విజయంలో ప్రతిఫలించింది. “మళ్లీ తదుపరి కార్యక్రమం ఎప్పుడు చేస్తారు?” అన్న ప్రశ్నలే ఈ విజయానికి అద్దం పట్టాయి.
చివరగా అధ్యక్షులు శ్రీ రమణయ్య గారు ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైన అందరు కళాకారులకు, స్పాన్సర్లకు, AKV కమిటీకి, AKV కుటుంబ సభ్యులకు, మరియు వేలాది ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒక కార్యక్రమం కాదని, ఇది ఆంధ్ర కళా వేదిక శక్తికి సజీవ సాక్ష్యం అని అన్నారు.




కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి